వాక రోడ్డుకి మోక్షం
ABN, Publish Date - Jun 04 , 2025 | 01:13 AM
మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామన్నపాలెం జంక్షన్ నుంచి ఎరకన్నపాలెం మీదుగా ఎలమంచిలి మండలం పెద్దపల్లి వరకు రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్నది.
రామన్నపాలెం టు పెద్దపల్లి.. వయా ఎరకన్నపాలెం
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతిపాదనలతో ప్రభుత్వ సానుకూల స్పందన
క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ విజయకృష్ణన్
11 కిలోమీటర్ల పొడవున 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తామని వెల్లడి
మాకవరపాలెం-ఎలమంచిలి మధ్య సగానికిపైగా తగ్గనన్న దూరం
మాకవరపాలెం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామన్నపాలెం జంక్షన్ నుంచి ఎరకన్నపాలెం మీదుగా ఎలమంచిలి మండలం పెద్దపల్లి వరకు రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్నది. సుమారు 40 అడుగుల వెడల్పుతో నిర్మించే ఈ రహదారి అందుబాటులోకి వస్తే.. పలు మండలాలకు చెందిన వివిధ గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై ఎలమంచిలి వైపు రాకపోకలు సాగించడానికి అనువుగా వుంటుంది. ప్రయాణ దూరం కూడా తగ్గుతుంది.
నర్సీపట్నం, మాకవరపాలెం, రోలుగుంట, రావికమతం మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాలకు రావాలంటే కశింకోట మండలం తాళ్లపాలెం మీదుగా ప్రయాణించాలి. మాకవరపాలెం మండల కేంద్రం నుంచి ఎలమంచిలికి సుమారు 25 కిలోమీటర్ల దూరం వుంటుంది. అయితే నర్సీపట్నం- తాళ్లపాలెం రోడ్డులో మాకవరపాలెం మండలంలోని రామన్నపాలెం జంక్షన్ నుంచి ఎరకన్నపాలెం, పెద్దపల్లి మీదుగా ఎలమంచిలి వెళ్లడానికి దగ్గరదారి. దీనిని వాక రోడ్డు అని పిలుస్తుంటారు. మధ్యలో కొంతమేర అటవీ ప్రాంతం వుండడంతో పక్కా రహదారి నిర్మాణానికి పర్యావరణ పరంగా అడ్డంకులు వున్నాయి. దీనివల్ల రోడ్డు నిర్మాణం వీలుకాలేదు. ఈ విషయం స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి రావడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు నిర్మాణానికి అటవీ భూమి ఎంత అవసరం వుంటుందో.. అంతే భూమిని వేరేచోట రెవెన్యూ శాఖ ద్వారా అటవీ శాఖకు బదలాయించాలని ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం మండలంలో పర్యటించిన సందర్భంగా ఈ విషయం ప్రకటించారు. రామన్నపాలెం సెంటర్ నుంచి ఎరకన్నపాలెం మీదుగా ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి వద్ద జాతీయ రహదారి వరకు సుమారు 10 కిలోమీటర్ల పొడవున 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. రామన్నపాలెం నుంచి తాళ్లపాలెం మీదుగా ఎలమంచిలి వరకు 23 కిలోమీటర్ల దూరం వుండగా, ఎరకన్నపాలెం మీదుగా రోడ్డు నిర్మాణం పూర్తయితే సుమారు 13 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఈ రోడ్డు పనులపై పరిశీలన చేస్తున్నారు. రామన్నపాలెం సెంటర్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం అల్యూమినియం కంపెనీ యాజమాన్యం గతంలో ఏపీఐఐసీకి డబ్బులు చెల్లించింది. ఈ మూడు కిలోమీటర్ల రోడ్డును ఏపీఐఐసీ చేపడుతుంది. మిగిలిన సుమారు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డును ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్మిస్తారు. మధ్యలో రెండు కిలో మీటర్లు అటవీ ప్రాంతం వుంది. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా వేరేచోట రెవెన్యూ భూమి ఇవ్వనున్నట్టు తెలిసింది. తొలుత రామన్నపాలెం జంక్షన్ నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఏపీఐఐసీ అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. తరువాత మిగిలిన రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి, ప్రభుత్వ ఆమోదానికి పంపుతారు. అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిస్తారని తెలిసింది.
Updated Date - Jun 04 , 2025 | 01:13 AM