‘తల్లికి వందనం’ ప్రారంభం
ABN, Publish Date - Jun 13 , 2025 | 01:04 AM
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వున్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం శ్రీకారం చుట్టింది. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో అర్హుల జాబితాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం జాబితాలను తయారుచేయాల్సి వుంది.
రెండు నుంచి పదో తరగతి వరకు, ఇంటర్ రెండో ఏడాది విద్యార్థుల జాబితాలు సిద్ధం
జిల్లాలో 1,79,272 మంది అర్హులు
ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున సాయం
ఒకటి, రెండు రోజుల్లో 1,19,357 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ
ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల తరువాత దరఖాస్తుల స్వీకరణ
అనంతరం అర్హుల జాబితా ప్రకటన
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వున్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం శ్రీకారం చుట్టింది. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో అర్హుల జాబితాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం జాబితాలను తయారుచేయాల్సి వుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో చదువుతున్న సుమారు లక్షా 80 వేల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం అమలయ్యే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.
కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంత మందికి ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ పథకం కింద అందజేస్తామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గత ఏడాది పాఠశాలలు తెరవడం, అప్పుడే కూటమి అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని అమలు చేయడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజున ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎ చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఈ పథకాన్ని ప్రారంభిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా విద్యా శాఖాధికారులు గతంలో ప్రభుత్వానికి ఆన్‌లైన్ ద్వారా పంపిన వివరాల ప్రకారం జిల్లాలో 1,033 ప్రభుత్వ పాఠశాలల్లో రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, జూనియర్ కళాశాలల్లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 93,555 మంది వున్నారు. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్ సెకండియర్ 98 వేల మంది వరకు చదువుతున్నారు. మొత్తం మీద 1,79,272 మంది విద్యార్థులు ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరికి సంబంధించి 1,19,357 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు ఒకటి, రెండు రోజుల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇక ఒకటో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు పూర్తయిన తరువాత వారిలో అర్హులైన విద్యార్థులకు ఈ పథకం కింద సాయం అందుతుంది. ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్ ప్రథమ సంత్సరంలో చేరే విద్యార్థులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరు గ్రామ/ వార్డు సచివాలయాల్లోని గృహ డేటాబేస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే శాశ్వత నివాసి అయి ఉండాలి. కుటుంబ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి. పథకం ద్వారా లబ్ధి పొందాలనుకొనే తల్లులు ఆధార్ కార్డుతోపాటు పిల్లల ఆధార్ కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రం లేదా ఓటరు కార్డు, రేషన్ కార్డు, వార్షిక ఆదాయం రుజువు చేసే పత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా పుస్తకం, లేదా చెక్కు అందజేయాలి. తల్లులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకొని, బ్యాంకు ఖాతాతో లింకు అయిన ఫోన్ నంబరు యాక్టివ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. దరఖాస్తును సచివాలయంలో అందజేస్తే సంబంధిత విద్యా శాఖాధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తరువాత తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
Updated Date - Jun 13 , 2025 | 01:04 AM