ఆర్‌డబ్ల్యూఎస్‌లో పైరవీలకు పెద్దపీట
ABN, Publish Date - Apr 17 , 2025 | 10:53 PM
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పైరవీలతో ఏదైనా సాధ్యమనే నానుడి కొనసాగుతున్నది. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు బదిలీ నిలిపించుకోగా, మరొకరు బదిలీ అయిన ఆరు నెలలకే ఇక్కడికే వచ్చేందుకు జోరుగా పైరవీలు సాగిస్తుండడం ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్‌లో చర్చనీయాంశంగా మారింది.
బదిలీని నిలిపివేయించుకున్న ఏటీవో, బదిలీ అయినా తిరిగి ఇక్కడికే వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సీనియర్ అసిస్టెంట్
పాడేరును వదిలి వెళ్లేందుకు ఇష్టపడని ఇద్దరు ఉద్యోగులు
ఏజెన్సీలో కమీషన్లు అధికంగా రావడమే కారణమని ఆరోపణలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పైరవీలతో ఏదైనా సాధ్యమనే నానుడి కొనసాగుతున్నది. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు బదిలీ నిలిపించుకోగా, మరొకరు బదిలీ అయిన ఆరు నెలలకే ఇక్కడికే వచ్చేందుకు జోరుగా పైరవీలు సాగిస్తుండడం ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్‌లో చర్చనీయాంశంగా మారింది.
గతేడాది సెప్టెంబరు నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఉద్యోగికి అనకాపల్లి జిల్లాకు బదిలీ కాగా, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఉద్యోగికి శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయింది. ఏటీవో బదిలీని ఆపించుకోగా, సీనియర్ అసిస్టెంట్ తిరిగి ఇక్కడికి వచ్చేందుకు జోరుగా పైరవీలు సాగిస్తున్నారు. ఏజెన్సీలో కమీషన్లు ఎక్కువ రావడం, పని ఒత్తిడి లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఏటీవోకు ఇక్కడి నుంచి శ్రీకాకుళం బదిలీ అయినప్పటికీ తన పలుకుబడినిఉపయోగించుకుని, పైరవీలు సాగించి ఇక్కడే కొనసాగేలా జాగ్రత్తలు పడ్డారు. అయితే సుమారు ఏడేళ్లు పైబడి ఇక్కడ పని చేస్తున్న సదరు ఏటీవో బదిలీని ఆపించుకుని కొనసాగుతుండడం గమనార్హం. అలాగే సదరు ఉద్యోగి ఇతర ఉద్యోగులు, కాంట్రాక్టర్లతో సైతం సఖ్యతగా మెలగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పైరవీలతో ఏటీవో బదిలీని ఆపించుకున్న వైనంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
బదిలీ అయినా ఇక్కడికే వచ్చేందుకు పైరవీలు
ఇక్కడ సుమారుగా తొమ్మిదేళ్లు సీనియర్ అసిస్టెంట్‌గా పని చే సిన ఉద్యోగి గత ఏడాది సెప్టెంబరులో జరిగిన బదిలీల్లో అనకాపల్లి జిల్లాకు బదిలీ అయినప్పటికీ, తిరిగి ఇక్కడికే వచ్చేందుకు అప్పటి నుంచి జోరుగా పైరవీలు చేస్తుండగా తాజాగా అందుకు మార్గం సుగమమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. గతంలోనే ఆయన తన బదిలీని నిలుపుదల చేసుకునేందుకే పైరవీలు చేయగా, అప్పట్లో దానిపై సీపీఐ నేత కూడా రాధాకృష్ణ వ్యతిరేకంచి ఆందోళనకు దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. అయినప్పటికీ తిరిగి ఇక్కడికే వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో పైరవీలు చేస్తే ఏదైనా అవుతుందనే ధీమాతోనే సదరు సీనియర్ అసిస్టెంట్ పాడేరులో తాను నివాసం ఉన్న ఐటీడీఏ రెంటర్ క్వార్టర్‌ను గత ఆరు నెలలుగా ఖాళీ చేయకుండా కొనసాగిస్తున్నారు. అంటే తాను ఎలాగైనా ఇక్కడికి వస్తాననే బలమైన నమ్మకంతోనే బదిలీ జరిగినా క్వార్టర్ ఖాళీ చేయకుండా కొనసాగిస్తున్నారని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ అధికంగా కమీషన్లు వస్తుండడం వల్లే ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఉద్యోగులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈఈ చర్యలతో మందకొడిగా జల్ జీవన్ పనులు
ప్రస్తుతం ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ చర్యలతో ఏజెన్సీలో జల్‌జీవన్ మిషన్ పనులు మందకొడిగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో పదవీ విరమణ చేయనున్న ఆయన కేవలం ఆరు నెలలు ఇక్కడ కాలక్షేపం చేయాలనే లక్ష్యంతోనే బదిలీపై వచ్చారని, అందుకే పనులు జోరుగా జరిగేందుకు కృషి చేయడం లేదని సిబ్బంది. కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ కారణంగానే ఏజెన్సీలో ఎక్కడ మండల సర్వసభ్య సమావేశాలు జరిగినా ప్రధాన అంశం జల్‌జీవన్ మిషన్ పనులపైనే చర్చలు జరుగుతున్నాయి. కలెక్టర్ తాగునీటి సమీక్షలో సైతం వాటిపైనే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను మందలిస్తున్నారు. అలాగే మీకోసం కార్యక్రమంలో సైతం అధిక సంఖ్యలో వినతులు సైతం తాగునీటి సమస్యలపైనే అందుతున్నాయి. ఈ ప్రభుత్వంలో పనులు, నిధులు విరివిగా మంజూరవుతున్న క్రమంలో కేవలం ఈఈ చర్యలతో జోరుగా సాగడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో ఉండే ఈ శాఖ ఏజెన్సీలో మాత్రం పారదర్శకత, ప్రత్యేకతకు దూరంగా పైరవీలకు వేదికగా ఉండడం ప్రభుత్వానికి చెడ్డపేరును తెచ్చిపెడుతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Apr 17 , 2025 | 10:53 PM