ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రాజెక్టుల పరుగు..

ABN, Publish Date - May 16 , 2025 | 12:34 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) రూ.400 కోట్లతో నిర్మించిన పలు ప్రాజెక్టులు, చేపట్టేబోయే కొత్త ప్రాజెక్టులకు త్వరలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్టు కమిషనర్‌ కె.విశ్వనాథన్‌ తెలిపారు.

  • రూ.400 కోట్ల విలువైన పనుల ప్రారంభోత్సవాలకు సన్నాహాలు

  • కొత్తవి చేపట్టేందుకు త్వరలో శంకుస్థాపనలు

  • నూతనంగా ఐదు లేఅవుట్లు

  • కైలాసగిరిపై రూ.1.5 కోట్లతో 55 అడుగుల శివుడి త్రిశూలం ఏర్పాటు

  • మాస్టర్‌ ప్లాన్‌ రహదారులకు టీడీఆర్‌లు

  • కాకాని నగర్‌లో రూ.12 కోట్లతో సబ్‌వే

  • అనకాపల్లిలో కొత్తగా జోనల్‌ కార్యాలయం

  • ‘ఆంధ్రజ్యోతి’తో వీఎంఆర్డీఏ కమిషనర్‌ కె.విశ్వనాథన్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) రూ.400 కోట్లతో నిర్మించిన పలు ప్రాజెక్టులు, చేపట్టేబోయే కొత్త ప్రాజెక్టులకు త్వరలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్టు కమిషనర్‌ కె.విశ్వనాథన్‌ తెలిపారు. అలాగే కొత్తగా ఐదు లేఅవుట్లను వేయనున్నామన్నారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’తో మాట్లాడుతూ అనేక అంశాలను వివరించారు. ఆయా వివరాలు ఆయన మాటల్లోనే..

8విశాఖ నగరంలోని కాపులుప్పాడలో 20 ఎకరాలు, నిడిగట్టులో 12 ఎకరాలు, గిడిజాలలో 7.5, చినముషిడివాడలో నాలుగు ఎకరాలు, అనకాపల్లి పక్కనున్న తుమ్మపాలలో 15 ఎకరాల విస్తీర్ణంలో కొత్త లేఅవుట్లు వస్తాయి.

8మొత్తం మూడు మాస్టర్‌ ప్లాన్‌ పనులను ఏకకాలంలో చేపడుతున్నాం. గతంలో ఖరారు చేసిన మాస్టర్‌ ప్లాన్‌-2041పై అభ్యంతరాలను ఆహ్వానించి మార్పులు, చేర్పులతో కొత్తది తయారుచేస్తాం. అలాగే విశాఖపట్నం-కాకినాడ పెట్రో కెమికల్‌ పెట్రో ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌కు కూడా కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తున్నాం. ఇది పెదగంట్యాడ, నడుపూరు నుంచి నక్కపల్లి వరకు 640 కి.మీ.ల విస్తీర్ణంలో ఉంటుంది. వీఎంఆర్డీఏలో అదనంగా చేరిన 13 మండలాలకు వేరే మాస్టర్‌ ప్లాన్‌ తయారవుతున్నది. ఈ మూడు మాస్టర్‌ ప్లాన్‌లు ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

8నగరంలోని సిరిపురంలో నిర్మించిన మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ భవనం, బీచ్‌ రోడ్డులోని యూహెచ్‌3హెచ్‌ హెలికాప్టర్‌ మ్యూజియం, ఎండాడ, చీమలాపల్లిల్లో నిర్మించిన కల్యాణ మండపాలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేశాం. ఇవికాకుండా కొత్తగా మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నాం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ఇవన్నీ సీఎం చంద్రబాబునాయుడు చేతులమీదుగా చేపట్టే అవకాశం ఉంది.

8కైలాసగిరిపై కొత్తగా శివుడికి సింబాలిక్‌గా త్రిశూలాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇది 55 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పున ఉంటుంది. దీనికి రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. ఆరు నెలల్లోనే దీనిని పూర్తి చేస్తాం. చీకటి పడ్డాక వెలుగులు విరజిమ్మడం దీని ప్రత్యేకత.

8మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ భవనం (ది డెక్‌)లో 4, 5 అంతస్థులు ఐటీ కార్యాలయాలకు ఇచ్చేశాం. మూడో అంతస్థులో రెస్టారెంట్‌, ఫైన్‌ డైనింగ్‌ పెడుతున్నాం. అలాగే టెర్ర స్‌పై కెఫే ఏర్పాటు చేస్తున్నాం. ఈ భవనంలో స్పేస్‌ కోసం చాలా సంస్థలు పోటీ పడుతున్నాయి.

8కొత్తగా చేపట్టబోయే ఐదు మాస్టర్‌ ప్లాన్‌ రహదారులకు టెండర్లు పిలుస్తున్నాం. వీటిని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఈ రహదారులకు భూములు ఇచ్చే రైతులు, గృహస్థులకు వీఎంఆర్డీఏ పరిధి అయితే మేము టీడీఆర్‌లు ఇస్తాం. జీవీఎంసీ పరిధి అయితే వారు ఇస్తారు. ముందు టీడీఆర్‌లు ఇచ్చాకే పనులను ప్రారంభించాలనుకుంటున్నాం.

8విశాఖపట్నం విమానాశ్రయం సమీపాన కాకాని నగర్‌ వద్ద రూ.12 కోట్ల వ్యయంతో సబ్‌వే నిర్మాణం చేపడుతున్నాం.

8ఎన్‌ఏడీ వద్ద రైలు ఓవర్‌ బ్రిడ్జి పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేస్తాం.

8అనకాపల్లిలో కొత్తగా వీఎంఆర్డీఏ జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విజయనగరంలోని జోనల్‌ కార్యాలయాన్ని ఆధునీకరిస్తున్నాం.

8మధ్యతరగతి ప్రజల కోసం అపార్ట్‌మెంట్లు నిర్మించాలని చేసిన ప్రతిపాదనకు మంచి స్పందన వస్తోంది. మిథిలాపురి వుడా కాలనీ, మధురవాడ, వేపగుంట ప్రాంతాల్లో అనువైన భూములు ఉన్నాయి. అన్ని రకాల సదుపాయాలతో వీటిని నిర్మించి, మార్కెట్‌ రేటు కంటే తక్కువకు ఇవ్వాలని యోచిస్తున్నాం.

8వీఎంఆర్డీఏ సిటీ సెంట్రల్‌ పార్కులో గ్లో గార్డెన్‌కు కొన్ని మార్పులు చేసి పనులు చేపట్టాలని అనుకుంటున్నాం. అదేవిధంగా చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ సూచన మేరకు మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి కోసం ఓ కేంద్రాన్ని నిర్మించి కౌన్సెలింగ్‌ నిర్వహించే ఏర్పాటు కూడా చేస్తాం.

8కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జి పనులు కొంచెం నెమ్మదిగా జరుగుతున్నాయి. దానిని వేగవంతం చేస్తాం.

ఎట్టకేలకు వీఎంఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌-2041కు సవరణలు

22 నుంచి అభ్యంతరాలు, సలహాల స్వీకరణ

వెబ్‌ అప్లికేషన్‌, ఫోన్‌ ద్వారా కూడా అభిప్రాయాలు చెప్పవచ్చు

సంస్థ కమిషనర్‌ విశ్వనాథన్‌

విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఖరారు చేసిన వీఎంఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌-2041కు ఎట్టకేలకు సవరణ చేయాలని నిర్ణయించారు. వీఎంఆర్డీఏ పరిధిలో వైసీపీ నేతల భూముల విలువ పెరిగేలా, పార్టీకి చెందిన బిల్డర్లకు లబ్ధి చేకూరేలా, నగర శివార్లలో పెద్ద సంఖ్యలో లేఅవుట్లు వేసుకున్న వారికి ప్రయోజనం కలిగేలా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి, ఖరారు చేశారు. ఇతరుల నుంచి హస్తగతం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్న భూములకు అనుగుణంగా జోన్లను మార్చేశారు. స్వప్రయోజనాల కోసం మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను మళ్లించారు. దీంతో ఇతర రైతులు, ప్రజలు నష్టపోయారు. అవసరం లేకపోయినా కొన్ని రహదారులను 200 అడుగుల నుంచి 250 అడుగుల వెడల్పున విస్తరించడానికి నిర్ణయించారు. ఆ పేరుతో వైసీపీ నేతలు జీవీఎంసీ నుంచి కోట్ల రూపాయల విలువైన టీడీఆర్‌లు కొట్టేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ మాస్టర్‌ ప్లాన్‌ను సవరించాలని అనేక వర్గాలు కోరుతున్నాయి. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా, అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలో వీఎంఆర్డీఏ దీనిపై ఈ నెల 19న ప్రకటన జారీ చేయాలని నిర్ణయించింది. 22 నుంచి జూన్‌ 21 వరకు మాస్టర్‌ ప్లాన్‌-2041పై అభ్యంతరాలు, సూచనలను నేరుగా లేదా పోస్టులో వీఎంఆర్డీఏ కార్యాలయానికి పంపవచ్చు. దీనికి వెబ్‌ అప్లికేషన్‌ను కూడా రూపొందించామని, మొబైల్‌ ఫోన్‌ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చునని వీఎంఆర్డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌ తెలిపారు. ప్రభుత్వ శాఖలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

Updated Date - May 16 , 2025 | 12:35 AM