నత్తనడకన రహదారి విస్తరణ పనులు
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:57 AM
అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు రోడ్డు విస్తరణ పనులు సంవత్సరాల తరబడి సాగుతున్నందున అచ్యుతాపురంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలంగా మారుతోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ హాలులో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో అచ్యుతాపురం జడ్పీటీసీ సభ్యుడు లాలం రాంబాబు, కో-ఆప్షన్ సభ్యుడు నిర్మల్‌కుమార్ అనకాపల్లి - అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులపై ప్రస్తావించారు.
- అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డును వెంటనే పూర్తి చేయాలి
- నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో విశాఖకు అన్యాయం
- జడ్పీ నిధుల కేటాయింపుపై సభ్యులకు సమాచారం లేదు
- సమావేశంలో పలు అంశాలపై సభ్యుల ఆందోళన
విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు రోడ్డు విస్తరణ పనులు సంవత్సరాల తరబడి సాగుతున్నందున అచ్యుతాపురంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలంగా మారుతోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ హాలులో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో అచ్యుతాపురం జడ్పీటీసీ సభ్యుడు లాలం రాంబాబు, కో-ఆప్షన్ సభ్యుడు నిర్మల్‌కుమార్ అనకాపల్లి - అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులపై ప్రస్తావించారు. విస్తరణకు భూములు ఇచ్చిన రైతుల గోడు ఎవరికీ పట్టడం లేదని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు రోడ్డు విస్తరించాల్సిందేనని స్పష్టం చేశారు. అచ్యుతాపురం జడ్పీటీసీ సభ్యుడు లాలం రాంబాబు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో 10 శాతం పనులకు సంబంధించి ప్రభుత్వ భూముల్లో జరుగుతున్నాయని, మిగిలిన 90 శాతం పనులు చేయాలంటే రైతుల అంగీకారం కావాలన్నారు. రైతులకు టీడీఆర్ బాండ్లు ఇస్తామంటున్నారని, దానిపై వారికి అవగాహన లేదన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయితే తప్ప అచ్యుతాపురంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని పేర్కొనడంతో కలెక్టర్ స్పందించి.. త్వరలో రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహిస్తామన్నారు. రోడ్డు పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.
నిధుల కేటాయింపులో అన్యాయం
జలవనరుల శాఖపై చర్చలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో విశాఖ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఉత్తరాంధ్రలోని నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి రోడ్‌మ్యాప్‌లో విశాఖ జిల్లాలో ప్రాజెక్టుల ప్రస్తావన ఎందుకు లేదని ఎస్‌ఈ స్వర్ణకుమార్‌ను ప్రశ్నించారు. ఇంజనీర్ల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దీనిపై మూడు జిల్లాల కలెక్టర్లు స్పందించి ప్రభుత్వానికి సమస్య తెలియజేయాలని కోరారు. ఏజెన్సీలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు జడ్పీ నిధులు ఇవ్వాలని అల్లూరి సీతారామరాజు కలెక్టర్.. జడ్పీ చైర్‌పర్సన్‌ను కోరారు. వైద్య ఆరోగ్యశాఖపై చర్చ జరిగినప్పుడు కో- ఆప్షన్ సభ్యుడు నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ రోగి ఉన్న ఇంట్లో ఆయనతో పాటు వృద్ధులకు వేర్వేరుగా పింఛన్లు ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై విశాఖ కలెక్టర్ హరేంధిరప్రసాద్ వెంటనే స్పందించి ఒకే ఇంట్లో ఉన్న హెచ్‌ఐవీ రోగులు, వితంతులు/వృద్ధులకు అర్హత మేరకు వేర్వేరుగా పింఛన్లు ఇస్తారని, దీనిపై డీఆర్‌డీఏ అధికారులను సంప్రతించాలన్నారు. మాడుగుల ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో షెడ్యూల్ మేరకు ప్రతి వారం పీహెచ్‌సీలకు వైద్య నిపుణులు రావాలన్నారు. గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర మాట్లాడుతూ అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో ఆదివారం కూడా పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. వ్యవసాయ శాఖ చర్చలో అనకాపల్లి వ్యవసాయాధికారి మోహనరావు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కోసం గ్రామాల వారీగా అర్హులైన రైతుల వివరాలపై సిబ్బంది సర్వే చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే కొనసాగుతుందా? అని సభ్యులు ప్రశ్నించగా, విశాఖపట్నం కలెక్టర్ హరేంధిరప్రసాద్ బదులిస్తూ తక్కువ గ్రామాలను తీసుకుని 250 ఎకరాలకు ఒక బ్లాక్‌గా ప్రస్తుతం రీసర్వే చేస్తున్నామన్నారు. రీసర్వేలో సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. కోటవురట్ల జడ్పీటీసీ సభ్యురాలు ఎస్.ఉమాదేవి మాట్లాడుతూ జడ్పీకి 15వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన నిధుల నుంచి జడ్పీటీసీ సభ్యులకు కేటాయించారని, ఇంకా మిగిలిన నిధులను మండలాలకు కేటాయించిన విషయం సభ్యులకు చెప్పడంలేదని ఆక్షేపించారు. అచ్యుతాపురం జడ్పీటీసీ సభ్యుడు లాలం రాంబాబు మాట్లాడుతూ పారిశ్రామికీకరణతో అచ్యుతాపురంలో భూగర్భజలాలకు తీవ్ర ఇబ్బంది వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. నీటి ఎద్దడి నివారించేందుకు ఏలేరు కాలువ నుంచి నీటిని మళ్లించాలని కోరగా, చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయకృష్ణన్ హామీ ఇచ్చారు.
Updated Date - Jul 10 , 2025 | 12:57 AM