సీట్లు...పాట్లు
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:37 AM
‘రామ్‌నగర్‌కు చెందిన రాజాన కుందన కృతిక్‌కు రెండో విడతలో చినవాల్తేరులోని కోటక్ స్కూలులో ఒకటో తరగతిలో విద్యా హక్కు చట్టం కింద ఉచిత సీటు వచ్చింది.
విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ ఏడాది పేద వర్గాలకు చెందిన 2,118 మంది పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో సీట్ల కేటాయింపు
రకరకాల కారణాలతో మోకాలడ్డుతున్న యాజమాన్యాలు
తొలి విడతలో 882 మందికి అడ్మిషన్ ఇచ్చేందుకు నిరాకరణ
విద్యా శాఖ అదేశాలు బేఖాతరు
కఠినంగా వ్యవహరించాలంటూ తల్లిదండ్రుల డిమాండ్
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
‘రామ్‌నగర్‌కు చెందిన రాజాన కుందన కృతిక్‌కు రెండో విడతలో చినవాల్తేరులోని కోటక్ స్కూలులో ఒకటో తరగతిలో విద్యా హక్కు చట్టం కింద ఉచిత సీటు వచ్చింది. బాలుడిని తీసుకుని తల్లి పాఠశాలకు వెళితే కంప్యూటర్ కోర్సు కోసం రూ.15 వేలు ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని యాజమాన్యం చెప్పింది. కంప్యూటర్ ఫీజు ఏటా చెల్లించాలని చెప్పడంతో అంత స్థోమత లేక వెనక్కి వచ్చేశారు.’
‘పెదగదిలికి చెందిన నక్కిన చరణ్‌తేజ ఎంవీపీ కాలనీలోని ఆళ్వార్‌దాసు పబ్లిక్ స్కూలులో ఒకటో తరగతిలో ఉచిత సీటు కేటాయించారు. దీంతో బాలుడిని తీసుకుని తల్లిదండ్రులు పాఠశాలకు వెళితే...ఇంటికి పాఠశాల మూడు కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నందున ప్రవేశం ఇవ్వలేమని యాజమాన్యం చెప్పింది.’
కేంద్ర ప్రభుత్వం 2011లో తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యా శాఖ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు అవుతోంది. అయితే కొన్ని పాఠశాలలు మాత్రం ఉచిత ప్రవేశాలకు మోకాలడ్డుతున్నాయి. విద్యా శాఖ అధికారులు జోక్యం చేసుకున్నా ససేమిరా అంటున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం విశాఖ జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల్లో సుమారు ఆరు వేల మంది ఆన్‌లైన్‌లో ఒకటో తరగతిలో ఉచిత సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం పేద వర్గాలకు చెందిన పిల్లలకు మాత్రమే సీట్లు కేటాయిస్తారు. విద్యార్థి నివసించే ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోపు ఉన్న పాఠశాలలను మాత్రమే దరఖాస్తు సమయంలో ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా మొదటి విడత నిర్వహించిన లాటరీలో 3,100 మంది పిల్లలను అర్హులుగా గుర్తించి ఒకటో తరగతిలో సీట్లు కేటాయించారు. వీరిలో 2,118 మందికి ప్రైవేటు పాఠశాలలు ప్రవేశాలు కల్పించాయి. మరో 882 మందికి పలు కారణాలతో సీట్లు ఇవ్వడానికి ప్రైవేటు యాజమాన్యాలు నిరాకరించాయి. రెండో విడతలో లాటరీలో 613 మందికి సీట్లు కేటాయించగా, సుమారు 600 మందికి ఆయా పాఠశాలల యాజమాన్యాలు ప్రవేశాలు కల్పించాయి.
తొలివిడతలో సీట్లు వచ్చినా ప్రవేశాలు లభించని 882లో చాలామంది పిల్లల తల్లిదండ్రులు విద్యాశాఖాధికారులను సంప్రతించారు. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలను అధికారులు ఫోన్‌లో కారణాలు అడిగి ప్రవేశాలు కల్పించాలని సూచించినా ఫలితం లేకపోయింది. విద్యార్థి ఇంటికి సీటు వచ్చిన పాఠశాల మూడు కిలోమీటర్ల కంటే పది మీటర్లు దూరం ఎక్కువగా ఉన్నా ప్రవేశాలు ఇవ్వలేదు. పేద వర్గాలకు చెందిన తల్లిదండ్రులకు దూరం విషయంలో అవగాహన ఉండదు. అయినప్పటికీ పిల్లలు పేద వర్గాలకు చెందినవారా?, కాదా?...అనేది పరిగణనలోకి తీసుకోకుండా కేవలం దూరాన్ని సాకుగా చూపి ప్రవేశాలు నిరాకరించడంపై విద్యా శాఖ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. అంతేతప్ప వారిపై గట్టిగా ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాయి. ఇక కొన్ని పాఠశాలల్లో ప్రవేశ ఫీజు కాకుండా ఇతరత్రా ఫీజులు వసూలు చేస్తుండడంతో కొందరు పిల్లలు వెనక్కి వస్తున్నారు. ఉచిత ప్రవేశాలు పొందిన పిల్లల తల్లులకు తల్లికి వందనం సొమ్ములు జమ కావు. పిల్లలకు చెందిన సొమ్ము సంబంధిత పాఠశాల యాజమాన్యం ఖాతాకు జమచేస్తారు. అయితే గత ఏడాది పథకం అమలు చేయనందున కొన్ని పాఠశాలలు ఈ ఏడాది ప్రవేశాల విషయం కుంటిసాకులు చెబుతూ తప్పించుకున్నాయి. దీనిపై విద్యా శాఖ కఠినంగా వ్యవహరించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Updated Date - Jun 29 , 2025 | 12:37 AM