హౌసింగ్‌లో రిటైర్టు ఏఈ దందా
ABN, Publish Date - May 03 , 2025 | 01:19 AM
జిల్లా గృహ నిర్మాణ సంస్థలో ఏఈగా పనిచేసి రిటైరైన అధికారి ఒకరు ఇప్పుడు మళ్లీ చక్రం తిప్పుతున్నారు.
అధికార పార్టీ నేతకు పీఏగా చేరి జిల్లా అధికారులతో సమీక్షలు
ఇళ్ల నిర్మాణ పనుల నుంచి పాత కాంట్రాక్టర్లు అవుట్
కొత్తవారికి అప్పగింత
ఇంటికి రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ప్రచారం
విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి):
జిల్లా గృహ నిర్మాణ సంస్థలో ఏఈగా పనిచేసి రిటైరైన అధికారి ఒకరు ఇప్పుడు మళ్లీ చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడికి పీఏగా చేరి, కాంట్రాక్టర్లను బెదిరించడం మొదలుపెట్టారంటున్నారు. కాలనీల్లో చేపట్టిన ఇళ్లకు సంబంధించి రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకుతీసుకువస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పేదల కోసం నగర శివారు ప్రాంతాల్లో రూపొందించిన లేఅవుట్‌లలో ఇళ్లు నిర్మిస్తున్న కొందరు కాంట్రాక్టర్లను ఆయన పక్కనపెట్టి కొత్తవారికి పనులు అప్పగించడం వివాదాస్పదమవుతోంది. అందుకు జిల్లా కార్యాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించడం, కలెక్టర్ నుంచి నేరుగా అనుమతులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నగర శివారుల్లోని 65 లేఅవుట్‌లలో లక్షకుపైగా ఇళ్లు నిర్మించతలపెట్టారు. ఇంటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.1.8 లక్షలు కేటాయించాయి. అయితే ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకురాకపోవడంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనధికారికంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కొందరు కాంట్రాక్టర్లు వేగంగా పనులు చేపట్టగా, మరికొందరు నిదానంగా చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తరువాత కూడా వారే కొనసాగుతున్నారు. అందులో కొందరు అధికార పార్టీ నాయకులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోగా, మరికొందరు తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఐదారు నెలల నుంచి కాంట్రాక్టర్లను హౌసింగ్ అధికారులు కొందరు ఇబ్బందులు పాల్జేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో గృహ నిర్మాణ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అఽధికార పార్టీ నాయకుని వద్ద హౌసింగ్ ఏఈగా పనిచేసి రిటైరైన వ్యక్తి పీఏగా చేరారు. సంస్థలో లోటుపాట్లు తెలిసిన ఆయన నగర శివారుల్లో ఇళ్ల నిర్మాణాలపై దృష్టిసారించారు. ఏడెనిమిది మంది కాంట్రాక్టర్లను టార్గెట్ చేశారు. ముదపాక, గంగవరం, రామవరం, పైడివాడ అగ్రహారం, సంతపాలెం, మామిడిపాలెం, తదితరచోట్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి సుమారు 11 వేల ఇళ్లను తప్పించి, తనకు నచ్చిన ఏడు నిర్మాణ కంపెనీలకు కేటాయించేలా పావులు కదిపారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు కనీస సమాచారం ఇవ్వకుండా జిల్లా అధికారుల ద్వారా కలెక్టర్ అనుమతి పొందేలా ఫైలు నడిపారు. దీని ప్రకారం పి.దుర్గామాధవికి 1,295, గ్రోత్ వెంచర్స్‌కు 1,793, సాయి ఎంటర్‌ప్రైజస్‌కు 2,044, మౌంటెన్ గ్రో కనస్ట్రక్షన్స్‌కు 2,597, శ్రావ్య ఇన్‌ఫ్రాకు 850, ఎస్‌వీ కనస్ట్రక్షన్స్‌కు 1,343, ఆద్య కనస్ట్రక్షన్స్‌కు 2,495 ఇళ్లు అప్పగించారు. వారితో హౌసింగ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ప్రతి ఇంటికీ రూ.మూడు వేలు నుంచి రూ.నాలుగు వేలు ఇవ్వాలని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా రిటైర్టు ఏఈ తమకు తెలియకుండా ఉన్నతాధికారుల ద్వారా 11 వేల ఇళ్లు ఇతర సంస్థలకు అప్పగించడంపై పాత కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకూ తాము చేసిన పనుల మేరకు బిల్లులు ఇవ్వకుండా మరొకరికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా హౌసింగ్ కార్యాలయంలో రిటైర్డు ఏఈ హవా కొనసాగుతుండంతో అటు కాంట్రాక్టర్లు, ఇటు సిబ్బంది సతమతమవుతున్నారు.
Updated Date - May 03 , 2025 | 01:19 AM