ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సేంద్రీయ పద్ధతిలో రాజ్‌మాపై పరిశోధనలు

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:48 PM

గిరిజన రైతులకు నాణ్యమైన రాజ్‌మా విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సేంద్రీయ పద్ధతిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టనున్నారు.

పరిశోధన స్థానంలో సాగుచేస్తున్న రాజ్‌మా ప్రయోగాత్మక సాగు(ఫైల్‌)

చింతపల్లి రెడ్‌పై ప్రయోగాత్మక సాగు

మొలకెత్తే శాతం పెంపు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు ఎంపిక

వచ్చే ఏడాది ముందస్తు రబీ నాటికి మినీ కిట్లు పంపిణీ

తుది దశలో ఉత్కర్స్‌, అరుణ్‌ రకాలపై శాస్త్రవేత్తల అధ్యయనం

చింతపల్లి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులకు నాణ్యమైన రాజ్‌మా విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సేంద్రీయ పద్ధతిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టనున్నారు. ఆదివాసీ రైతులు కొన్నేళ్లుగా ‘చింతపల్లి రెడ్‌’ రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ విత్తనాల్లో మొలకెత్తే శాతం తక్కువగా ఉండడంతో పాటు ఆశించిన దిగుబడులు రావడం లేదు. దీంతో చింతపల్లి రెడ్‌ రాజ్‌మాలో మొలకెత్తే శాతం పెంపు కోసం ఆధునిక సాంకేతిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాత్మక సాగు చేపట్టాలని మే 19వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన పరిశోధన, విస్తరణ సలహామండలి(జెడ్‌ఆర్‌ఈఏసీ) సమావేశంలో శాస్త్రవేత్తలు తీర్మానం చేశారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు రాజ్‌మాపై పరిశోధనలను సేంద్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు కార్యాచరణ ప్రారంభించారు.

దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే రాజ్‌మా పండుతుంది. ఆదివాసీ రైతులు 45 ఏళ్లుగా రాజ్‌మా పంటను సంప్రదాయేతర వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45 వేల హెక్టార్లలో రాజ్‌మాను సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా కాలక్రమంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది పాడేరు డివిజన్‌ పరిధిలో కేవలం పదివేల ఎకరాల్లో మాత్రమే రాజ్‌మా సాగు చేపట్టారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గరిష్ఠంగా ఆరు వేల ఎకరాల్లో రాజ్‌మా సాగు జరుగుతున్నది. ఆదివాసీ రైతులు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్లనే రాజ్‌మా పంటకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చింతపల్లి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నూతన రాజ్‌మా వంగడాలపై 2016లో పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనలు తుది దశలో ఉన్నాయి. అలాగే ఆదివాసీల సంప్రదాయ వంగడం చింతపల్లి రెడ్‌లోనూ మేలి రకం విత్తనాలు అభివృద్ధి చేసేందుకు 2024 ఆగస్టులో ప్రయోగాత్మక సాగు ప్రారంభించారు.

చింతపల్లి రెడ్‌పై పరిశోధనలు

జిల్లాలో ఆదివాసీలు సుదీర్ఘకాలంగా దేశవాళి వంగడం చింతపల్లి రెడ్‌ను సాగు చేస్తున్నారు. ఈ వంగడం గిరిజన ప్రాంత వాతావరణానికి అత్యంత అనుకూలం. ప్రతికూల వాతావరణ పరిస్థితులను, తెగుళ్లను తట్టుకుంటుంది. ఏళ్ల తరబడి ఈ వంగడాన్ని రైతులు సాగు చేస్తుండడంతో నాణ్యమైన విత్తనం రైతులకు అందుబాటులో లేదు. దిగుబడి ఆశాజనకంగా లేదు. దీంతో చింతపల్లి రెడ్‌లో నాణ్యమైన వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు గత ఏడాది ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు. గింజ నాణ్యత, అధిక దిగుబడి, తెగుళ్లు తట్టుకునే విత్తనాలను గుర్తించి విత్తనాభివృద్ధి చేస్తున్నారు. తొలి ఏడాది ప్రయోగాత్మక సాగును శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఏడాది కూడా సేంద్రీయ పద్ధతిలో ప్రయోగాత్మక సాగు కొనసాగించనున్నారు.

ఉత్కర్స్‌, అరుణ్‌ రకాలపై తుది దశ అధ్యయనం

గిరిజన రైతులకు మేలి రకం వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 2016లో ప్రారంభమైన పరిశోధనలను శాస్త్రవేత్తలు కొనసాగిస్తున్నారు. కాన్పూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ జాతీయ అపరాల పరిశోధన సంస్థ నుంచి ఆరు రకాల రాజ్‌మా విత్తనాలను దిగుమతి చేసుకుని శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఉత్కర్స్‌, అరుణ్‌ రకాలు ఆశాజనకంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించి నాణ్యతపై అధ్యయనం చేస్తున్నారు. హెక్టారుకు 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు గుర్తించారు. ఈ పరిశోధనలు తుది దశలో వున్నాయి.

Updated Date - Jun 11 , 2025 | 11:48 PM