పూడిక తీసి.. తుప్పలు తొలగించి..
ABN, Publish Date - Jul 29 , 2025 | 01:31 AM
కల్యాణపులోవ ఆయకట్టుకు సాఫీగా నీరు సరఫరా అయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఉపాధి నిధులతో బాగుపడిన కల్యాణపులోవ పంట కాలువలు
రెండుచోట్ల అక్విడక్టులకు మరమ్మతు పనులు
ఆయకట్టు చివరి భూములకు తీరనున్న నీటి కొరత
రావికమతం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):
కల్యాణపులోవ ఆయకట్టుకు సాఫీగా నీరు సరఫరా అయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుల వినతి మేరకు ఉపాధి హామీ పథకం నిధులతో కాలువల్లో చేపట్టిన పూడిక తీత, తుప్పల తొలగింపు పనులు చివరి దశకు చేరుకున్నారు. ఆగస్టు రెండో వారం నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా వున్నట్టు అధికారులు చెబుతున్నారు.
కల్యాణపులోవ జలాశయం కింద మండలంలో కల్యాణపులోవ, ములకలాపల్లి, జెడ్.కొత్తపట్నం, గంపవానిపాలెం,జెడ్. బెన్నవరం, కిత్తంపేట, దొండపూడి,కొత్తకోట, మత్సవానిపాలెం, ఆర్.కొత్తూరు, మర్రివలస, కన్నంపేట తదితర 16 రెవిన్యూ 16 రెవెన్యూ గ్రామాల పరిధిలో 4,484 ఎకరాల ఆయకట్టు వుంది. మొత్తం 14.5 కిలోమీటర్ల మేర ప్రధాన పంట కాలువ వుంది. పది వరకు పిల్ల కాలువులు వున్నాయి. కాలక్రమేణా పూడిక పేరుకుపోవడంతో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడిక తీయించింది. మూడేళ్ల వరకు పరిస్థితి బాగానే వుంది. తరువాత నుంచి క్రమంగా పూడిక పెరిగిపోయి, తుప్పలు బలిసిపోయాయి. దీంతో కాలువల్లో నీరు సరిగా ప్రవహించక ఆయకట్టు చివరి భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను రైతులు అప్పటి వైసీపీ పాలకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పూడిక తీయించలేదు. దీనికి తోడు ములకలాపల్లి వద్ద రెండు అక్విడక్టులు శిథిలమై నీరు వృథాగా గెడ్డలోకి పోతున్నది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయకట్టు రైతులు చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజును కలిసి, సాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితం కాలువలను పరిశీలించి ఆయన ఉపాధి హామీ పథకం కింద రూ.28.5 లక్షలు మంజూరు చేయించారు. ఆయా గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలతో కాలువల్లో పూడిక తీత, తుప్పల తొలగింపు పనులు చేయించారు. అక్విడక్టుకు మరమ్మతు పనులు చేపట్టారు. ఇరిగేషన్ ఏఈ డి.సూర్య పర్యవేక్షణలో పనులు శరవేగంగా జరిగాయి. దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం 460 అడుగులు కాగా సోమవారంనాటికి 451.02 అడుగులు వుంది. రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఆశించినంతగా వర్షాలు పడకపోవడంతో ప్రస్తుతం ఉన్న నీరు2,500 ఎకరాల మేర దమ్ము పనులకే సరిపోతుందని ఏఈ తెలిపారు. ఏటా ఆగస్టు ఐదు నుంచి పదో తేదీలోగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేవారమని, అయితే ఈ ఏడాది వరి ఆకు మడుల పోత ఆలస్యం కావడంతో నారు ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. రైతుల డిమాండ్ మేరకు ఆగస్టు 15వ తేదీ తరువాత ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
Updated Date - Jul 29 , 2025 | 01:31 AM