తగ్గిన ఉక్కు ఉత్పత్తి
ABN, Publish Date - May 29 , 2025 | 01:42 AM
కాంట్రాక్టు కార్మికులను కుదించినప్పటికీ, ఉత్పత్తి తగ్గకుండా చూడాలనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం ప్రయత్నాలు నెరవేరేలా కనిపించడం లేదు. వచ్చే నెల మూడో వారంలో మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చైనా నుంచి తెప్పించిన కూలింగ్ ప్లేట్లను మూడు రోజుల క్రితమే బ్లాస్ట్ ఫర్నేస్-3లో అమర్చారు. మిగిలిన పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళుతున్నారు. మరోవైపు ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూడు వేల మందిని ఆపేసింది.
కాంట్రాక్టు కార్మికుల సమ్మె మొదలుకాకముందు
రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా 14 వేల టన్నులు ఉత్పత్తి
ప్రస్తుతం 10 వేల నుంచి 11 వేల టన్నులు మాత్రమే...
ఇటువంటి పరిస్థితుల్లో
మూడో బ్లాస్ట్ ఫర్నేస్ నడపడం కష్టమే
స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఆరా
ముఖ్యమంత్రిని కలిసేందుకు కడప వెళ్లిన సీఎండీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కాంట్రాక్టు కార్మికులను కుదించినప్పటికీ, ఉత్పత్తి తగ్గకుండా చూడాలనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం ప్రయత్నాలు నెరవేరేలా కనిపించడం లేదు. వచ్చే నెల మూడో వారంలో మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చైనా నుంచి తెప్పించిన కూలింగ్ ప్లేట్లను మూడు రోజుల క్రితమే బ్లాస్ట్ ఫర్నేస్-3లో అమర్చారు. మిగిలిన పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళుతున్నారు. మరోవైపు ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూడు వేల మందిని ఆపేసింది. మరో రెండు వేల మందితో జాబితా తయారుచేసింది. వారికి గేటుపాస్‌లు ఇవ్వలేదు. అంటే వారిని కూడా తొలగించినట్టే. యాజమాన్యం తాను అనుకున్నట్టుగా ఐదు వేల మందిని తగ్గించినట్టే. మిగిలిన ఎనిమిది వేల మందితోనే మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడిపిస్తామని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెబుతోంది. అయితే ఇప్పుడు రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు మాత్రమే నడుస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికుల సమ్మె మొదలు కాకముందు రోజుకు 14 వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేశారు. సమ్మె మొదలైన తరువాత అది 10-11 వేల టన్నులు మాత్రమే వస్తోంది. ప్రస్తుతం శాశ్వత ఉద్యోగులతో 12 గంటల డ్యూటీ చేయిస్తున్నారు. తీసేసిన కార్మికులు మాత్రమే బయట సమ్మె చేస్తున్నారు. మిగిలిన ఎనిమిది వేల మంది విధులకు హాజరవుతున్నారు. వారితో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌ల నుంచి పూర్తి ఉత్పత్తి (14 వేల టన్నులు) తీయడమే కష్టంగా ఉంటే...మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభిస్తే అక్కడ పనులు ఎవరు చేస్తారని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నాళ్లు శాశ్వత ఉద్యోగులతో 12 గంటల డ్యూటీ చేయిస్తారని నిలదీస్తున్నారు.
కార్మికులపై అసత్య ప్రచారం
స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. జిల్లా కలెక్టర్ మంగళవారం రాత్రి సీఎండీని, ఇతర ఉన్నతాధికారులను పిలిచి ప్లాంటులో పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంటులో జరుగుతున్న ప్రమాదాల గురించి ప్రస్తావన రాగా కార్మికులే కావాలని ప్లాంటు పరికరాలకు నష్టం కలిగిస్తున్నారంటూ అధికారులు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కడపలో మహానాడులో ఉన్న సీఎం చంద్రబాబునాయుడును కలిసి ప్లాంటు పరిస్థితి వివరించేందుకు సీఎండీ, ఇతర ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లారు.
పోలీసులు అంతా అక్కడే
స్టీల్‌ప్లాంటు గేటు వద్ద కాంట్రాక్టు కార్మికుల ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతోంది. తమకు ఉపాధి పోయిందని, కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలనా భవనం లోపలకు వెళ్లడానికి యత్నిస్తున్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు భీమిలి, సిటీ పోలీసు అధికారులందరినీ స్టీల్ ప్లాంటుకే తరలించారు.
Updated Date - May 30 , 2025 | 03:06 PM