ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చదవడం, రాయడం రావడం లేదు

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:48 AM

‘ఉన్నత పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు కనీసం చదవడం, రాయడం రావడం లేదు.

ఆరో తరగతి విద్యార్థుల్లో 60 శాతం మందికి కనీస ప్రమాణాలు కరవు

ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధన పటిష్ఠంగా లేకపోవడమే కారణం

విద్యా శాఖ అప్రమత్తం

ఈ ఏడాది ఆరో తరగతిలో చేరిన విద్యార్థులకు ‘సంసిద్ధత’ కార్యకమం

ఒకటి నుంచి ఐదు తరగతుల పునశ్చరణ

వచ్చే నెల నాలుగో తేదీ నుంచి పరీక్షలు

విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):

‘ఉన్నత పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు కనీసం చదవడం, రాయడం రావడం లేదు. వారు చదివే తరగతి కాదు, కనీసం కింది తరగతుల పుస్తకాలు చదివి కూడా వివరించలేకపోతున్నారు. ఈ విధానం వల్ల విద్యార్థుల భవిష్యత్తులో నష్టపోతారు.’..

- జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సభ్యుల ఆందోళన.

ఆరో తరగతి విద్యార్థుల్లో కనీస విద్యా ప్రమాణాలు కొరవడ్డాయి. వారికి తగినంత సామర్థ్యం లేదని ‘అసర్‌’ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు) వెల్లడించింది. ఈ సర్వే మేరకు ఆరో తరగతిలోకి వచ్చే 60 శాతం మంది విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేవు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ ఉందని సర్వే గుర్తించింది. ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ పటిష్ఠమైన బోధన అందడం లేదనే వాదన వినిపిస్తోంది. ఉన్నత పాఠశాలలతో పోల్చితే ఎలిమెంటరీ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు తక్కువగా ఉంటున్నాయంటున్నారు. గ్రామాలు, నగరాల్లో స్థోమత ఉన్న కుటుంబాలు పిల్లలను ఒకటో తరగతి నుంచే ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నాయి. పేదవర్గాల పిల్లలు ప్రభుత్వ బడులకు వస్తున్నారు. వారిలో విద్యపై అవగాహన ఉన్న తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత పిల్లలను కూర్చోబెట్టి చదివిస్తుంటారు. లేనివారైతే పాఠశాలల్లో చెప్పిన పాఠాలకే పరిమితమవుతున్నారు.

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో మరింత సమస్య

జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కేవలం పది మంది విద్యార్థులు మాత్రమే ఉండడంతో ఒక్కరే టీచర్‌ ఉంటున్నారు. ఒక టీచరు ఉన్నచోట విద్యార్థుల్లో సామర్థ్యం ఉండడం లేదు. దీనికితోడు టీచర్లు కొందరు పాఠశాలకు వెళ్లామా..వచ్చామా అన్నట్టుగా పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాదికి 75 శాతం హాజరుశాతం ఉంటే పైతరగతికి ప్రమోట్‌ చేస్తుండడంతో ప్రాథమిక పాఠశాలల స్థాయిలో విద్యా ప్రమాణాలను పట్టించుకోవడం లేదు. ఐదు నుంచి ఆరో తరగతికి ప్రమోట్‌ చేస్తే తమ పని అయిపోయినట్టు టీచర్లు భావిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘సంసిద్ధత’ అమలు

ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో చేరిన విద్యార్థులకు సంసిద్థత (రెడీనెస్‌) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత ‘సంసిద్ధత’ కార్యక్రమం పేరిట లాంగ్వేజస్‌, నాన్‌ లాంగ్వేజస్‌ పుస్తకాలు అందజేశారు. గత నెల నుంచి ఇప్పటివరకూ (40 రోజులపాటు) ప్రతిరోజు ఆరో తరగతి విద్యార్థులకు సంసిద్ధత పుస్తకాలపైనే బోధన చేస్తున్నారు.

విశాఖ జిల్లాలో 112 యూపీ, ఉన్నత పాఠశాలల్లో సుమారు పది వేల మంది పిల్లలు ఆరో తరగతిలో చేరారు. తరగతిలో ప్రవేశం పొందిన రోజు నుంచి ఇప్పటివరకూ ఆరో తరగతి సిలబస్‌ బోధన చేయడం లేదు. దాని స్థానంలో ప్రభుత్వం ముద్రించిన సంసిద్ధత కార్యక్రమం పుస్తకాల్లో పాఠాలు చెబుతున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సిలబస్‌ మేరకు ఈ పుస్తకాలు రూపొందించారు. జిల్లాలో ఆరో తరగతిలో సుమారు 60 శాతం విద్యార్థులు సామర్థ్యం కంటే తక్కువలో ఉన్నారనే విషయం గుర్తించారు. తెలుగులో వర్ణమాల, ఇంగ్లీష్‌లో ఎ,బీ,సీ,డీ నుంచి పదాలు వరకు, గణితంలో ఎక్కాలు నుంచి కూడికలు, తీసివేతలు, చిన్నపాటి లెక్కలు బోధిస్తున్నారు. సంసిద్ధత పుస్తకాలపై పట్టు వచ్చేలా టీచర్లకు షెడ్యూల్‌ ఇచ్చారు. 40 రోజుల బోధన తరువాత వచ్చే నెల నాలుగు నుంచి ఆరో తేదీ వరకు ఆరో తరగతి విద్యార్థులకు సంసిద్ధత పుస్తకాలపైనే మాత్రమే పరీక్షలు (ఎఫ్‌ఎ-1) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ముగిసిన తరువాతే ఆరోతరగతి సిలబస్‌ బోధన చేస్తారు.

Updated Date - Jul 30 , 2025 | 12:48 AM