రేషన్ ఈకేవైసీ కోసం పాట్లు
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:40 PM
మండలంలోని శివారు గ్రామాలకు సెల్ సిగ్నల్స్ అందక, రహదారి సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. గురువారం నడవలేని స్థితిలో ఉన్న ఓ గిరిజనుడిని రేషన్ ఈకేవైసీ చేయించేందుకు స్థానికులు మంచంపై కొండపైకి తీసుకు వెళ్లాల్సి వచ్చింది.
సెల్ సిగ్నల్స్ అందక గిరిజనుడిని కొండపైకి తీసుకు వెళ్లిన వైనం
ప్రభుత్వ పథకాలు పొందేందుకు గుర్రాళ్లగొంది గ్రామస్థులకు తప్పని అవస్థలు
గూడెంకొత్తవీధి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శివారు గ్రామాలకు సెల్ సిగ్నల్స్ అందక, రహదారి సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. గురువారం నడవలేని స్థితిలో ఉన్న ఓ గిరిజనుడిని రేషన్ ఈకేవైసీ చేయించేందుకు స్థానికులు మంచంపై కొండపైకి తీసుకు వెళ్లాల్సి వచ్చింది.
మండలంలోని రింతాడ పంచాయతీ పరిధి గుర్రాళ్లగొంది గ్రామానికి చెందిన పాంగి సోమరాజు మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యాడు. నడవలేని స్థితిలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. రేషన్ ఈకేవైసీ చేయించుకునేందుకు గడువు ముగుస్తున్నప్పటికి సోమరాజు ఈకేవైసీ చేయించుకోలేదు. దీంతో గురువారం ఉప సర్పంచ్, టీడీపీ నాయకుడు సోమేశ్ కుమార్, గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ చిన్నారావు సోమరాజుకు ఈకేవైసీ చేయించేందుకు గుర్రాళ్లగొంది వెళ్లారు. అయితే ఆ గ్రామంలో సెల్ సిగ్నల్స్ అందలేదు. గ్రామ శివారు కొండపై సెల్ సిగ్నల్స్ వస్తున్నాయని స్థానికులు చెప్పారు. దీంతో సోమరాజును స్థానికుల సహాయంతో సెల్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చే ప్రాంతానికి మంచంపై మోసుకు వెళ్లారు. ఈకేవైసీ చేయించి తిరిగి ఇంటికి చేర్చారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు సెల్ టవర్లు, రహదారుల సదుపాయం కల్పిస్తే ఆదివాసీలు ప్రభుత్వ పథకాలు పొందేందుకు అనువుగా వుంటుందని చెప్పారు.
Updated Date - Jun 05 , 2025 | 11:40 PM