శరవేగంగా ఏకలవ్య భవన నిర్మాణాలు
ABN, Publish Date - May 19 , 2025 | 11:32 PM
కొయ్యూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్‌ఎస్) భవన నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మండలంలోని బాలారం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఈ పాఠశాల భవన నిర్మాణాలు తుది దశకు చేరాయి. ఆగస్టు 15 నాటికి ఈ పాఠశాలను అందుబాటులోకి తేవాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు
కొయ్యూరు, మే 19(ఆంధ్రజ్యోతి): కొయ్యూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్‌ఎస్) భవన నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మండలంలోని బాలారం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఈ పాఠశాల భవన నిర్మాణాలు తుది దశకు చేరాయి. ఆగస్టు 15 నాటికి ఈ పాఠశాలను అందుబాటులోకి తేవాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మూడేళ్ల క్రితం మండలానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. బాలారం గ్రామ సమీపంలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు కేటాయించారు. రెండేళ్ల క్రితం నిధులు మంజూరైనా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభంకాలేదు. దీనికి తోడు పాఠశాలకు కేటాయించిన స్థలం వివాదంలో ఉండడంతో పనుల్లో జాప్యం జరిగింది. దీంతో పాఠశాల నిర్వహణ బాలికలకు సంబంధించి చింతపల్లి ఈఎంఆర్‌ఎస్‌లో, బాలురకు స్థానిక గురుకుల పాఠశాల రెండు గదుల్లో గత విద్యా సంవత్సరం వరకు నిర్వహిస్తూ వచ్చారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో వసతి సమస్య ఏర్పడింది. దీంతో కొయ్యూరు ఏకలవ్య పాఠశాల నిర్వహణ చింతపల్లి వైటీసీ భవనానికి తరలించి అక్కడ నిర్వహిస్తున్నారు.
రెండేళ్ల క్రితం పనులు ప్రారంభం
పాఠశాల భవన నిర్మాణ పనుల టెండర్‌ను సీఎన్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ దక్కించుకుని 2023 అక్టోబరులో పనులు ప్రారంభించింది. ముందుగా ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి చేసి ఆ తరువాత పాఠశాల భవన నిర్మాణాలు, వసతి గృహ నిర్మాణాలు(బాలురు, బాలికలకు వేర్వేరుగా), తరగతి గదుల భవనాలు, ప్రిన్సిపాల్, వార్డెన్ల నివాస గృహాలు, ఈఎస్‌ఎస్ బ్లాక్, మరుగుదొడ్లు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్ భవన నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రస్తుతం సిబ్బంది నివాస గృహాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి నిర్మాణాలు పూర్తి చేసి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇంజనీరింగ్ కన్సెల్టెంట్ సత్యనారాయణ, సైట్ ఇంజనీర్ పి.రమణ తెలిపారు.
Updated Date - May 19 , 2025 | 11:32 PM