ముసురు
ABN, Publish Date - Jun 26 , 2025 | 01:12 AM
బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం ముసురు వాతావరణం నెలకొంది. గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందన్న వాతావరణ శాఖ సూచనలతో రానున్న రెండు రోజుల్లో జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశం వుంది. గురు, శుక్రవారాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జిల్లా అంతటా మోస్తరు వర్షం
రానున్న రెండు రోజుల్లో వర్షాలు పెరిగే సూచన
అన్ని రకాల పంటలకు మేలు చేస్తుందని రైతులు ఆశాభావం
అనకాపల్లి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి-న్యూస్ నెట్‌వర్క్): బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం ముసురు వాతావరణం నెలకొంది. గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందన్న వాతావరణ శాఖ సూచనలతో రానున్న రెండు రోజుల్లో జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశం వుంది. గురు, శుక్రవారాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా బుధవారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా వుంది. పలు మండలాల్లో దఫదఫాలుగా మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం తరువాత వర్షం తీవ్రత పెరిగింది. గత రెండు వారాల నుంచి వేడి వాతావరణం, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు, వర్షంతో వాతావరణం చల్లబడడంతో ఉపశమనం చెందారు. అనకాపల్లి పట్టణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. పరవాడ, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి జల్లులు పడుతున్నాయి. కూరగాయల పంటలకు ఈ వర్షం ఊపిరి పోసిందని రైతులు చెబుతున్నారు. అయితే గ్రామాలకు వెళ్లే మెటల్, మట్టి రోడ్లు చిత్తడిగా తయారై, రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. చోడవరంలో రోజంతా చిరుజల్లులు పడుతూనే వున్నాయి. మాడుగుల మండలంలో ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దఫదఫాలుగా జల్లులు పడుతునే ఉన్నాయి. ఉపాధి పనులకు ఆటంకం ఏర్పడింది. ఆకుమడుల్లో వరి విత్తనాలు చల్లడానికి ఈ వర్షం ఉపయోగపడుతుంది. ఇటీవల వేసిన సరుగుడు నాట్లు, కూరగాయ తోటలకు ఈ వర్షం మేలు చేస్తుందని గొలుగొండ మండల రైతులు చెబుతున్నారు. పాయకరావుపేట మండలంలోబుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చెదురుమదురుగా వర్షం పడుతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అచ్యుతాపురంలో మండలంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రారంభమైన వర్షం బుదవారం రాత్రి వరకు కురుస్తునే ఉంది. అమావాస్య కారణంగా సముద్రంలో అలల తాకిడి అధికంగా వుండడంతోపాటు వర్షం కురుస్తుడడంతో పలువురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేకపోయారు. కోటవురట్ల మండలంలో మంగళవారం రాత్రి బుధవారం సాయంత్రం వరకు అదపాదడపా వర్షం కురుస్తూనే వుంది. సరుగుడు, నువ్వు, కూరగాయ పంటలకు మేలు చేస్తుందని రైతులు అంటున్నారు. నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు చిరుజల్లులతో వర్షం కురిసింది. సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. మట్టి రోడ్డు బురదమయం అయ్యాయి. ఖరీఫ్ వ్యసాయ పనులకు ఈ వర్షం దోహదం చేస్తుందని రైతులు చెబుతున్నారు.
Updated Date - Jun 26 , 2025 | 01:12 AM