రైల్వే జీఎంకు సౌత్ సెంట్రల్ బాధ్యతలు
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:32 AM
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్‌కు ఇటీవలె జనరల్ మేనేజర్‌గా నియమితులైన సందీప్ మాధుర్‌కు ఇప్పుడు అదనపు బాధ్యతలు అప్పగించారు.
మూడు నెలలు అక్కడ పనిచేయాల్సిందే...
ఆగస్టు నుంచి ఇక్కడ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం అనుమానమే
విశాఖ జోన్ పనులు ఆలస్యం కావడానికి ఒడిశా అధికారులు కావాలనే ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని రైల్వే వర్గాల ఆరోపణ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్‌కు ఇటీవలె జనరల్ మేనేజర్‌గా నియమితులైన సందీప్ మాధుర్‌కు ఇప్పుడు అదనపు బాధ్యతలు అప్పగించారు. సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తుండడంతో ఆ జోన్ బాధ్యతలు సందీప్ మాధుర్‌కు అప్పగిస్తూ రైల్వే బోర్డు డైరెక్టర్ రవీందర్ పాండే ఉత్తర్వులు జారీచేశారు. ఇది పేరుకు అదనపు బాధ్యతలే కానీ పూర్తి ఆపరేషన్‌లో ఉన్న ఆ జోన్‌ను సమర్థంగా నడిపించాల్సి ఉంటుంది. అందుకని కనీసం వారంలో నాలుగు రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇటు చూస్తే ఇక్కడ జోనల్ కార్యాలయం లేదు. నిర్మాణ పనులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయి ఆపరేషన్ ప్రారంభం కాలేదు. ఆగస్టు 15 నుంచి పూర్తిస్థాయిలో జోన్ పనిచేస్తుందని ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులకు ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చారు. ఇంకో రెండు నెలలే కదా?...అనుకున్నారు. ఇప్పుడు పక్క జోన్ బాధ్యతలు అప్పగించడంతో జీఎం సందీప్ మాధుర్ విశాఖపట్నం కంటే సికింద్రాబాద్‌లోనే ఎక్కువ కాలం ఉండాల్సి ఉంటుంది. అక్కడ కొత్త జీఎంను నియమించేంత వరకు కనీసం మూడు నెలలు అదనపు బాధ్యతలు నిర్వహించాలని రవీందర్ పాండే తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే సెప్టెంబరు నెలాఖరు వరకూ అక్కడే ఉండాలి. అప్పటికి కూడా కొత్త జీఎంను నియమించకపోతే ఇంకా కొనసాగాల్సి ఉంటుంది. ఈ అదనపు బాధ్యతలతో విశాఖ జోన్‌కు కొత్త జీఎంను నియమించారనే ఆనందం ఆవిరైపోయింది. ఒడిశా అధికారులు కావాలనే విశాఖ జోన్ పనులు ఆలస్యం కావడానికి ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని రైల్వే వర్గాలు ఆరోపిస్తున్నాయి. కొత్త జోన్‌ను ఒక మార్గంలో నడిపించడానికి పూర్తిస్థాయిలో పనిచేయాల్సిన జీఎంకు అత్యంత కీలకమైన జోన్ బాధ్యతలు అదనంగా అప్పగించడం ఏ విధంగాను సమంజసం కాదని రైల్వే ఉద్యోగులు వాదిస్తున్నారు. ఏదేమైనా జీఎం సందీప్ మాధుర్ విశాఖ జోన్‌ను నిర్లక్ష్యం చేయకుండా వారంలో కనీసం మూడు రోజులు ఇక్కడకు వచ్చి జోనల్ కార్యాలయం నిర్మాణ పనులతో పాటు ఇతర వ్యవహారాలను పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Jun 29 , 2025 | 12:32 AM