ఎన్టీఆర్ ఆస్పత్రిలో అక్రమాలపై శీఘ్ర విచారణ
ABN, Publish Date - Jul 28 , 2025 | 12:32 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో కొంతమంది వైద్య సిబ్బంది చేసిన అవినీతి, అక్రమాలపై ప్రస్తుత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శీఘ్ర విచారణకు ఆదేశించారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు
వైసీపీ హయాంలో వైద్యాలయంలో అవినీతి, అక్రమాలు
ఫిర్యాదులు రావడంతో ఏసీబీ తనిఖీలు
వాస్తవమని నిర్ధారిస్తూ 2020లో అప్పటి ప్రభుత్వానికి నివేదిక
బుట్టదాఖలు చేసిన వైసీపీ పాలకులు
తాజాగా మంత్రి దృష్టికి రావడంతో విచారణకు ఆదేశాలు
అనకాపల్లి రూరల్, జూలై 27 (ఆంఽఽధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో కొంతమంది వైద్య సిబ్బంది చేసిన అవినీతి, అక్రమాలపై ప్రస్తుత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శీఘ్ర విచారణకు ఆదేశించారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యాలయంలో పలు అక్రమాలు జరిగాయి. ఇన్‌పెషేంట్ల తప్పుడు లెక్కలు, మందుల వినియోగాన్ని రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయకపోవడం, లెసెన్సు లేకుండా క్యాంటీన్ నిర్వహణ, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న రోగులకు అందించే భోజనాల వివరాలు తెలపకపోవడం, రోగులకు సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు సివిల్ పనులు కట్టబెట్టడం వంటి ఆరోపణలు వచ్చాయి. వీటిపై అందిన ఫిర్యాదుల మేరకు 2020 ఫిబ్రవరిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. అప్పటి డీసీహెచ్‌ఎస్‌తోపాటు తొమ్మిది మంది వైద్యులు, 12 మంది హెడ్ నర్సులు/ స్టాఫ్ నర్సులు కలిపి అవినీతి, అక్రమాలకు పాల్పిడినట్టు ఏసీబీ అధికారుల బృందం గుర్తించింది. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అయితే తరువాత నాలుగేళ్లపాటు అధికారంలో వున్న వైసీపీ ప్రభుత్వం.. అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా, ఏసీబీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గతంలో ఏసీబీ అధికారులు సమర్పించిన నివేదికను బయటకు తీయించి పరిశీలించారు. ఈ వ్యహారంపై శ్రీఘ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి పేషీ నుంచి ఆదివారం ఒక ప్రకటన వెలువడింది. ఈ విషయం తెలుసుకున్న నాటి అక్రమాలు బెంబేలెత్తిపోతున్నారు.
Updated Date - Jul 28 , 2025 | 12:32 AM