పండుగలా పీటీఎం
ABN, Publish Date - Jul 11 , 2025 | 01:22 AM
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం పేరెంట్, టీచర్ సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. తల్లిదండ్రులు రాకతో పాఠశాలలు కోలాహలంగా మారాయి. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 1,388 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా, 1,371 పాఠశాలల్లో పేరెంట్, టీచర్ సమావేశాలు నిర్వహించారు.
జిల్లాలోని 1,371 పాఠశాలల్లో
పేరెంట్, టీచర్ మీటింగ్స్ నిర్వహణ
పాఠశాలల పనితీరు, ప్రగతిపై హెచ్‌ఎంల ప్రసంగాలు
ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు
పిల్లలతో కలిసి భోజనం
ఈ పర్యాయం ప్రైవేటు పాఠశాలల్లో కూడా సమావేశాలు
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం పేరెంట్, టీచర్ సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. తల్లిదండ్రులు రాకతో పాఠశాలలు కోలాహలంగా మారాయి. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 1,388 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా, 1,371 పాఠశాలల్లో పేరెంట్, టీచర్ సమావేశాలు నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో తల్లిదండ్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని పిల్లల చదువుల గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో పాఠశాలల నిర్వహణ, పనితీరు, ప్రగతిపై ప్రధానోపాధ్యాయులు నివేదికలు సమర్పించారు. వారితోపాటు పాఠశాల కమిటీ ప్రతినిధులు, కొందరు ఎంపిక చేసిన విద్యార్థులు, టీచర్లు మాట్లాడారు. అనంతరం గత విద్యా సంవత్సరంలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. అలాగే పలు పాఠశాలల్లో తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
కాగా పేరెంట్, టీచర్ సమావేశాలకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆహ్వానించారు. ఎంపీ ఎం.శ్రీభరత్ మధురవాడ సునీల్‌శర్మ కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాల, రైల్వేన్యూకాలనీలోని కేఎన్‌ఎం బాలికల పాఠశాల, ఎన్జీవో కాలనీలోని మునిసిపల్ ఉన్నత పాఠశాలల్లో సమావేశాలకు హాజరయ్యారు. విద్యార్థులతో ముచ్చటించి ఆయా తరగతులకు సంబంధించి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కేఎన్‌ఎం పాఠశాలలో విద్యార్థినులతో కలిసి ఎంపీ భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు తోటగరువులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్, టీచర్ సమావేశానికి హాజరయ్యారు. పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు గోపాలపట్నంలోని రెండు ఉన్నత పాఠశాలలకు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆనందపురం ఉన్నత పాఠశాలకు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అక్కిరెడ్డిపాలెం ఉన్నత పాఠశాలకు, ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు సీతమ్మధార, మాధవధార ఉన్నత పాఠశాలలకు వెళ్లి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మహారాణిపేట, డాబాగార్డెన్స్, ప్రకాశరావుపేట ఉన్నత పాఠశాలల్లో జరిగిన సమావేశాలకు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణశ్రీనివాస్, పెందుర్తిలో పలు పాఠశాలలకు మేయర్ పీలా శ్రీనివాసరావు, చినవాల్తేర్‌లోని కేడీపీఎం ఉన్నత పాఠశాలకు వీఎంఆర్‌డీఎ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, వాడపాలెం, ఎండాడ, పీఎం పాలెం, కొమ్మాది, చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలకు విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు బి.విజయభాస్కర్ హాజరయ్యారు. జిల్లాలో పేరెంట్, టీచర్ సమావేశాలు ప్రశాంతంగా, పండుగ వాతావరణంలో జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు.
Updated Date - Jul 11 , 2025 | 01:23 AM