సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:37 PM
మన్యంలో గిరిజన రైతుల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ అన్నారు.
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ
‘అరకు బ్రాండింగ్’ ఏర్పాటుతో గిరి ఉత్పత్తులకు అదనపు విలువ పెంచుతామని వెల్లడి
పాడేరు, జూలై 16(ఆంధ్రజ్యోతి): మన్యంలో గిరిజన రైతుల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సేంద్రీయ వ్యవసాయం, ఉద్యానవన సాగు, మార్కెటింగ్ సదుపాయాలపై డివిజన్ స్థాయి అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన అధికారులు గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలన్నారు. అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలు జోడించి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. గిరిజన ఉత్పత్తులకు ‘మేడ్ ఇన్ అరకు’ బ్రాండింగ్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేస్తామని ఆయన ప్రకటించారు. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలను గిరిజన రైతులు సాగు చేయాలన్నారు. చిరు ధాన్యాల వినియోగం పెరిగిందని, ఆ సాగును మరింత పెరగాలన్నారు. పలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు గిరిజన ఉత్పత్తులను గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాయన్నారు. గిరిజనులు పాలు నిత్యావసరంగా వినియోగించే సంప్రదాయం లేదని, కానీ పాల వినియోగం, పాడి పశువుల పెంపకంపై గిరిజన రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన ఉత్పత్తులైన కాఫీ, రాగులు, పసుపు, అల్లం, సామలు, కొర్రలు వంటి పంటలకు మంచి గిట్టుబాటు లభించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఈ-మార్కెటింగ్‌తో రైతులకు మరింత లాభం
గిరిజన ఉత్పత్తులకు ఈ-మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే రైతులకు మరింత లాభం చేకూరుతుందని అభిషేక్‌గౌడ అన్నారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ఈ-మార్కెటింగ్ సదుపాయాలు అవసరమన్నారు. అలాగే దీనిపై వివిధ రైతు ఉత్పత్తి సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎరువుల వినియోగం తగ్గించాలని, రైతుల వార్షిక ఆదాయం పెరగాలన్నారు. రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కల్పిస్తున్న మార్కెటింగ్ సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. దళారీ వ్యవస్థను అరికట్టాలని, దాని వల్ల గిరిజన రైతులు నష్టపోతున్నారన్నారు. జిల్లా ఉద్యానవనాధికారి ఎ.రమేశ్‌కుమార్‌రావు మాట్లాడుతూ సేంద్రీయ విధానంలోనే గిరిజన రైతులు ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారని తెలిపారు. ఏజెన్సీలో పసుపు సాగు చేస్తున్న రైతులు తమ పంటలకు బీమా చేసుకోవాలన్నారు. రైతులకు బీమా సదుపాయాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎకరా పసుపు పంటకు రూ.1,336 చెల్లించి ఈ నెల 31వ తేదీ లోపు బీమా చేసుకోవాలని ఆయన సూచించారు. బీమా చేసుకున్న పసుపు పంటకు నష్టం వాటిల్లితే ఎకరాకు రూ.88 వేల నష్టపరిహారం వస్తుందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పరిధిలో 35 వేల మంది రైతులకు గానూ 14 వేల మంది రైతులు పూర్తి స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు .గిరిజన రైతులు 40 వేల హెక్టార్లలో వరి, 16 వేల హెక్టార్లలో రాగులు పండిస్తున్నారన్నారు. జిల్లాలో రసాయన ఎరువులు, పురుగుల మందులను గిరిజన రైతులు పంటలకు వినియోగించడం లేదన్నారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయంగా బ్యాంకు రుణాలు అందిస్తే దళారులను నియంత్రించవచ్చని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు బ్యాంకులు ఆర్థిక సహకారం అందించాలని పలు సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ వర్క్‌షాప్‌లో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటసాహిత్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు ఎల్.భాస్కరరావు, వి.రామమోహనరావు, కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ హెచ్.మురళీధర్, జిల్లా సెరీకల్చర్ అధికారి కె.అప్పారావు, ఐటీడీఏ ఉద్యానవనాధికారి ఎ.రాజశేఖరం, పలువురు వ్యవసాయ, ఉద్యాన వనాధికారులు, రైతులు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 11:37 PM