ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వర్‌తో సమస్యలు

ABN, Publish Date - May 26 , 2025 | 12:14 AM

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గందరగోళంగా మారింది.

- ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తుల స్వీకరణలో గందరగోళం

- ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దరఖాస్తుల మధ్య వ్యత్యాసం

- సర్వీస్‌ పాయింట్ల కేటాయింపులో తికమక

- స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల దరఖాస్తుకు గడువు పెంచాలి: టీచర్లు

విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గందరగోళంగా మారింది. దరఖాస్తు చేసేటప్పుడు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కొన్నిసార్లు ఆన్‌లైన్‌ సర్వర్‌ మొరాయిస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సమస్యతో ఆన్‌లైన్‌లో దరఖాస్తును డీఈవో తిరస్కరిస్తే అది సంబంధిత మండల విద్యాశాఖాధికారికి వెళ్లాల్సి ఉండగా.. నేరుగా ఉపాధ్యాయుడికి వస్తోందని, కొన్ని సందర్భాల్లో హోల్డ్‌లో ఉండిపోతుందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సర్వీస్‌ పాయింట్ల కేటాయింపులో ఇబ్బందులు వస్తున్నాయని, స్పౌజ్‌ సదుపాయం వినియోగించడంలో సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. కాగా ఉమ్మడి విశాఖ జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో బదిలీకి దరఖాస్తు చేయడానికి ఆదివారంతో గడువు ముగిసింది. అయితే చాలామంది స్కూల్‌ అసిస్టెంట్ల దరఖాస్తులు అప్‌లోడ్‌ కానందున గడువు పెంచాలని వారు కోరుతున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని కేటగిరీలకు కలిపి 4,811 మందికి స్థానచలనం కలుగుతుందని విద్యాశాఖ ఐదారు రోజుల క్రితమే ప్రకటించింది. దీని ప్రకారం 88 హెచ్‌ఎం పోస్టులకు 123 మంది ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేశారు. వీరి దరఖాస్తులను పరిశీలించి అప్‌లోడ్‌ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో సుమారు 2,200 ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే బదిలీలకు దరఖాస్తు చేసే టీచర్లకు సర్వీస్‌ పాయింట్ల కేటాయింపులో గందరగోళం ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్‌ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు/స్కూల్‌ అసిస్టెంట్ల నియామకంపై ఇంకా తగిన ఆదేశాలు రానందున బదిలీ దరఖాస్తుపై కొంత గందరగోళం నెలకొంది. మోడల్‌ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా నియమించేటప్పుడు స్కూల్‌ అసిస్టెంట్లలో సబ్జెక్టు వారీగా నిష్పత్తి ఎంత అనేది ఇంతవరకు చెప్పలేదు. సర్దుబాటు ద్వారా మిగులుగా చూపించిన స్కూల్‌ అసిస్టెంట్లను మాత్రమే మోడల్‌ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా నియమిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. ఒకేచోట ఎనిమిదేళ్ల సర్వీస్‌ పూర్తి కావాలన్న నిబంధన మేరకు 2017 ఆగస్టు 31 తేదీని ప్రామాణికంగా తీసుకున్నారు. దీంతో ఆ మరుసటి రోజు అంటే 2017 సెప్టెంబరు ఒకటిన పాఠశాలల్లో చేరిన టీచర్లకు ఎనిమిదేళ్ల సర్వీస్‌ పాయింట్లు వర్తించవని విద్యాశాఖ మార్గదర్శకాలు ఇవ్వడంతో అప్పట్లో పలు కారణాలతో ఒకరోజు ఆలస్యంగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు పూర్తిగా సర్వీస్‌ పాయింట్లు రావడం లేదని గుర్తు చేస్తున్నారు.

అదేవిధంగా 2017లో జరిగిన బదిలీల్లో ఒక పాఠశాలకు వచ్చిన టీచర్లు కొందరు 2023లో అమలులోకి వచ్చిన జీవో నంబర్‌-117 మేరకు మరోచోటకు బదిలీ కావాల్సి వచ్చింది. 2023 నుంచి ఇప్పటివరకు అదే స్కూల్‌లో పనిచేస్తున్న వారంతా జీవో నంబర్‌-117 రద్దుతో సర్దుబాటుకు గురయ్యారు. దీంతో సర్వీస్‌ పాయింట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు. బదిలీకి తొలుత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి దాని ప్రతిని సంబంధిత ఎంఈవోకు అందజేయాలి. అయితే ఆఫ్‌లైన్‌లో ఉన్న దరఖాస్తును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే దరఖాస్తుతో పోల్చిన తరువాతే అప్‌లోడ్‌ చేయాలి. అయితే ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తుల మధ్య కొన్ని పాయింట్లు తేడా వస్తోందని, దీనిపై సంబంధిత టీచర్‌ను పిలిచి మళ్లీ సవరిస్తున్నారు. స్పౌజ్‌ పాయింట్లు కొందరికి ఆన్‌లైన్‌లో కనిపించడం లేదంటున్నారు.

ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో హెల్ప్‌ డెస్క్‌

బదిలీల దరఖాస్తుల స్వీకరణ నేపథ్యంలో నగరంలోని సీతమ్మధార ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో పలు మండలాల విద్యాశాఖాధికారులు, ఇతర సిబ్బంది ఇక్కడ సేవలందిస్తున్నారు. టీచర్లు పెట్టుకునే ఆన్‌లైన్‌ దరఖాస్తులతో ఎంఈవోల ద్వారా తెచ్చుకున్న ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ నేతృత్వంలో దరఖాస్తుల పరిశీలన కొనసాగింది. దరఖాస్తు చేసేటప్పుడు తలెత్తే ఇబ్బందుల గురించి పలువురు ఉపాధ్యాయులు ఇక్కడకు వచ్చి డీఈవోకు వివరించారు.

ప్రభుత్వ టీచర్లకు గడ్డు పరిస్థితి

గతంలో ఏజెన్సీ నుంచి పలువురు ఉపాధ్యాయులు బదిలీపై మైదాన ప్రాంతానికి రాక

జడ్పీ, మునిసిపల్‌ పాఠశాలల్లో విధులు నిర్వహణ

తాజాగా ఉపాధ్యాయ బదిలీలు చేపట్టిన ప్రభుత్వం

ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయితే బదిలీ తప్పనిసరి నిబంధన

ప్రభుత్వ టీచర్లు సొంత యాజమాన్య స్కూళ్లకు వెళ్లిపోవాలని ఆదేశాలు

దిక్కుతోచని స్థితిలో పలువురు ఉపాధ్యాయులు

విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేస్తున్న ఆదేశాలతో ఉమ్మడి విశాఖ జిల్లాలో జడ్పీ, మునిసిపల్‌ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి అయోమయంగా మారింది. ఒకేచోట ఎనిమిది సంవత్సరాల సర్వీసు దాటిన ఉపాధ్యాయులు తమ సొంత మేనేజ్‌మెంట్‌ స్కూళ్లకే వెళ్లాలంటూ ఇచ్చిన ఆదేశాలతో మైదాన ప్రాంతంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళంగా తయారైంది.

తెలుగుదేశం పార్టీ గతంలో (2014-19) అధికారంలో వున్నప్పుడు ఏ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యాయులైనా తమకు నచ్చిన యాజమాన్య పాఠశాలలకు బదిలీ అయ్యే వెసులుబాటు కల్పించింది. దీంతో ఏజెన్సీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు మైదాన ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారు. వీరు జడ్పీ, మునిసిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఆయా పాఠశాలల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొంతమంది ఉపాధ్యాయులు ఒకేచోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారు. బదిలీల నిబంధనల ప్రకారం వీరికి కచ్చితంగా స్థాన చలనం వుంటుంది. ప్రస్తుతం విద్యా శాఖ అధికారులు ప్రస్తుతం చేపట్టిన బదిలీల్లో భాగంగా వీరు తప్పనిసరిగా బదిలీ కోసం దరఖాస్తు చేయాలి. తమకు అనుకూలమైన ప్రాంతాల్లోని పాఠశాలలను ఆప్షన్స్‌గా ఇవ్వొచ్చు. కానీ విద్యా శాఖ అధికారులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలలకు నియమితులై, అనంతరం కాలంలో జడ్పీ, మునిసిపల్‌ పాఠశాలలకు బదిలీ అయి, ఒకేచోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులంతా తమ సొంత యాజమాన్యమైన ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ కావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఏజెన్సీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ మైదాన ప్రాంతంలోని జడ్పీ, మునిసిపల్‌ పాఠశాలలకు బదిలీ అయిన వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ప్రభుత్వ యాజమాన్య ప్రాఽథమిక పాఠశాలలు చాలా తక్కువ వున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అల్లూరి సీతారామరాజు జిల్లాకు తప్పనిసరిగా బదిలీ కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఆయా ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో సంవత్సరాల తరబడి పనిచేసి, మైదాన ప్రాంతానికి వచ్చిన ఉపాధ్యాయులు మళ్లీ ఏజెన్సీకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ఉపాధ్యాయ సంఘాలు కూడా స్పందించాలని కోరుతున్నారు.

గందరగోళంగా టీచర్ల బదిలీల ప్రక్రియ

ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు

నర్సీపట్నం: ఉపాధ్యాయ బదీలల ప్రక్రియ గందరగోళంగా తయారైందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రేషనలైజేషన్‌తో ముడి పెట్టడం వల్ల టీచర్ల బదిలీల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని అన్నారు. ఒకసారి రేషనలైజేషన్‌ అయిన తర్వాత కనీసం ఐదు సంవత్సరాల వరకు ఉపాధ్యాయులను కదపకూడదని అన్నారు. ఇలా అయితేనే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుందని అన్నారు. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు రెండేళ్లకు రెండు పాయింట్లు అదనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2021లో బదిలీపై వచ్చి 2025లో రేషనలైజేషన్‌ అయిన ఉపాధ్యాయులకు పాత స్టేషన్‌ పాయింట్లు ఇవ్వాలన్నారు. బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్‌లో తలెత్తిన సమస్యలన తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీనాథ్‌, నేతలు కురచా వెంకటరమణ, జీపీఎస్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 12:14 AM