ప్రాథమిక పాఠశాలలు వెలవెల
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:19 AM
మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో అరకొరగా విద్యార్థులు వున్నారు. కన్నంపేట శివారు శ్రీరామనగర్ పాఠశాలలో ఒకరు, రావికమతం అంబేడ్కర్ కాలనీ, గుడ్డిప కొత్తూరు పాఠశాలలో ముగ్గురేసి విద్యార్థులు మాత్రమే వున్నారు. మొత్తం మీద 11 పాఠశాలల్లో పది మందికన్నా తక్కువ విద్యార్థులు వున్నారు.
పలు గ్రామాల్లో 1, 2 తరగతులకే పరిమితమైన స్కూళ్లు
రావికమతం మండలంలో 11 పాఠశాలల్లో పది మందికన్నా తక్కువ విద్యార్థులు
వైసీపీ ప్రభుత్వం అమలుచేసిన విధానాలే కారణమని ప్రజలు ఆరోపణ
రావికమతం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో అరకొరగా విద్యార్థులు వున్నారు. కన్నంపేట శివారు శ్రీరామనగర్ పాఠశాలలో ఒకరు, రావికమతం అంబేడ్కర్ కాలనీ, గుడ్డిప కొత్తూరు పాఠశాలలో ముగ్గురేసి విద్యార్థులు మాత్రమే వున్నారు. మొత్తం మీద 11 పాఠశాలల్లో పది మందికన్నా తక్కువ విద్యార్థులు వున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన విద్యా విధానం అమలు పేరుతో పలు ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ పాఠశాలలు అరకొర విద్యార్థులతో కొనసాగుతున్నాయి. మండలంలో ఈ ఏడాది మొత్తం 53 ప్రాథమిక పాఠశాలలు వున్నాయి. కన్నంపేట శివారు శ్రీరామనగర్ (ఎస్‌ఎన్ కాలనీ) ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి వున్నాడు. ఇతని పాఠాలు బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు, మధ్యాహ్న భోజనం వండి వడ్డించడానికి నిర్వాహకురాలు వున్నారు. ఈ కాలనీకి చెందిన పలువురు ఉపాధి నిమిత్తం కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు వలసపోవడమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. అలాగే రావికమతం అంబేడ్కర్ కాలనీ పాఠశాలలో ముగ్గురు, గుడ్డిప కొత్తూరు పాఠశాలలో నలుగురు విద్యార్థులు వున్నారు. తట్టబంద పంచాయతీ శివారు ఎల్‌ఎన్ పురంలో ఐదుగురు, గర్నికం శివారు కానాడ పాఠశాలలో ఏడుగురు, తట్టబంద శివారు కశిరెడ్డిపాలెం, కన్నంపేట పాఠశాలల్లో ఎనిమిదేసి మంది, కవ్వగుంట పంచాయతీ శివారు బుడ్డిబంద, మత్సవానిపాలెం, అంట్లంపాలెం, గుడ్డిప పాఠశాలల్లో తొమ్మిది మంది చొప్పున విద్యార్థులు వున్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:19 AM