‘అస్త్రం’తో ట్రాఫిక్ సమస్యలకు అడ్డుకట్ట
ABN, Publish Date - Jun 09 , 2025 | 01:20 AM
నగరంలో ట్రాఫిక్ సమస్యలను వాహనచోదకులు అధిగమించేందుకు ‘అస్తం’ మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన హోంమంత్రి అనిత
బెంగళూరు తరువాత విశాఖలోనే వాహనదారులకు అందుబాటులోకి యాప్: సీపీ శంఖబ్రత బాగ్చి
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ట్రాఫిక్ సమస్యలను వాహనచోదకులు అధిగమించేందుకు ‘అస్తం’ మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు పోలీసులు రూపొందించిన ‘అస్తం’ మొబైల్ యాప్‌ను ఆదివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలో ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలతోపాటు ప్రముఖల పర్యటనలు పెరుగుతున్నాయన్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని అధిగమించాలనే లక్ష్యంతో సీపీ శంఖబ్రత బాగ్చి చొరవతో రహదారులపై ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందనేది పోలీసులతో పాటు ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసునేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు. టెలీగ్రామ్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే నగర రోడ్లపై ట్రాఫిక్ పరిస్థితి, ఎక్కడైనా ప్రమాదం జరిగి ట్రాఫిక్ జామ్ అవ్వడం, వీఐపీలు ఎవరైనా ఉంటే ఏ రూట్‌లో ప్రయాణిస్తున్నారనేది ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ 15 నిమిషాలకు సమాచారం అప్‌డేట్ అవుతుంది కాబట్టి రద్దీ మార్గాల్లో కాకుండా ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణించడం ద్వారా సమయం ఆదా చేసుకునేందుకు ఈ యాప్ ఉపకరిస్తుందని అనిత పేర్కొన్నారు.
సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ అస్త్రం యాప్ దేశంలో బెంగళూరు తరువాత విశాఖ నగరంలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. విజయవాడలో యాప్ ఉన్నప్పటికీ అది కేవలం పోలీసులకు మాత్రమే అందుబాటులో ఉందని, విశాఖలో మాత్రం ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ యాప్‌ను ప్రతీ 15 నిమిషాలకు అప్‌డేట్ చేయడం జరుగుతుందని, తద్వారా తాజా సమాచారం వాహనదారులకు లభిస్తుందని వెల్లడించారు. ఈ యాప్ వల్ల ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలను గుర్తించి పోలీసులు తక్షణమే క్లియర్ చేసేందుకు సహకరిస్తుందన్నారు. వెబ్ అప్లికేషన్ డేటా ఆధారంగా నెలవారీ నివేదికలను రూపొందించడం, ట్రాఫిక్ రద్దీ తరచూ ఎక్కువగా ఉండే జంక్షన్ల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై సూచనలను అందించడం వంటి అనేక ప్రయోజనాలు ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో యాప్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని సీపీ వివరించారు. యాప్‌ను అభివృద్ధి చేసిన తిరుమలరావు, శ్రీనివాస్‌లను ఆయన అభినందించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లను హోంమంత్రి చేతులమీదుగా పంపిణీ చేశారు. కార ్యక్రమంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, అజితా వేజెండ్ల, కృష్ణపాటిల్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 01:20 AM