విద్యార్థులకు కానుకలు సిద్ధం
ABN, Publish Date - May 01 , 2025 | 11:11 PM
జిల్లాలోని 2,913 పాఠశాలల్లోని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులతో పాటు 43 జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులతో కలిపి మొత్తం లక్షా 69 వేల 175 మందికి ఈ ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రా కిట్లు పేరిట విద్యా కానుకలను అందించేందుకు అధికారులు సిద్ధం చేశారు.
లక్షా 69 వేల 175 మందికి విద్యామిత్రా కిట్‌లు
జూన్ 12 నాటికి పంపిణీ చేసేందుకు సన్నాహాలు
జిల్లా వ్యాప్తంగా 22 స్టాక్ పాయింట్లు
జూనియర్ ఇంటర్ విద్యార్థులకూ పంపిణీ
(పాడేరు- ఆంఽధ్రజ్యోతి)
జిల్లాలోని 2,913 పాఠశాలల్లోని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులతో పాటు 43 జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులతో కలిపి మొత్తం లక్షా 69 వేల 175 మందికి ఈ ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రా కిట్లు పేరిట విద్యా కానుకలను అందించేందుకు అధికారులు సిద్ధం చేశారు. గతంలో పాఠశాలలు పునఃప్రారంభం అయిన కొన్ని రోజుల వరకు విద్యా కానుకలను అరకొరగా అందించే పరిస్థితులుండేవి. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా పాఠశాలలు పునఃప్రారంభం నాటికే అంటే జూన్ 12 నాటికే విద్యార్థులకు అవసరమైన విద్యామిత్ర కిట్‌లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే విద్యామిత్రా కిట్‌లను జిల్లా కేంద్రాలకు సరఫరా చేయగా, అక్కడి నుంచి మండల కేంద్రాలకు చేరవేసి, తద్వారా పాఠశాలల్లోని విద్యార్థులకు అందించేలా సమగ్ర శిక్ష అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు గానూ జిల్లా, డివిజన్, మండల, పాఠశాల స్థాయిల్లో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థికి విద్యామిత్ర కిట్‌లను పంపిణీ చేయనున్నారు.
ఇంటర్ విద్యార్థులకూ విద్యామిత్ర కిట్లు
ఈ ఏడాది ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ సర్వేపల్లి రాఽధాకృష్ణ విద్యామిత్రా కిట్‌లను అందిస్తామని సమగ్ర శిక్షా అదనపు పథక సమన్వయకర్త డాక్టర్ వీఏ స్వామినాయుడు తెలిపారు. గతంలో ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు కానుకలు పంపిణీ చేయగా, మిగిలిన వాటిని మాత్రమే ఇంటర్ విద్యార్థులకు పంపిణీ చేసేవారు. అయితే ప్రస్తుతం అందరికీ అవసరమైన విద్యామిత్రా కిట్లను అందిస్తున్నామన్నారు. వాటిని ప్రతి విద్యార్థికి అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ప్రస్తుతం జిల్లాకు వచ్చిన కానుకల వివరాలు
- బాలురు: 82,757
- బాలికలు : 86,418
- బ్యాగులు: 1,69,175
- నోట్ బుక్స్: 7,44,474
- టెస్ట్ బుక్స్: 25,50,151
- బూట్లు: 1,68,872
- బెల్ట్‌లు : 1,31,673
- డిక్షనరీలు: 32,128
- చొక్కాలు : 82,757
- నిక్కర్లు/ప్యాంట్‌లు: 82,757
- చుడీదార్‌లు, గౌన్లు: 86,418
Updated Date - May 01 , 2025 | 11:11 PM