యోగాకు ముమ్మర ఏర్పాట్లు
ABN, Publish Date - Jun 19 , 2025 | 01:16 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 21వ తేదీ ఉదయం బీచ్‌రోడ్డులో నిర్వహించనున్న కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మందిని సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రులు, ఉన్నతాధికారులు నగరంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
బీచ్‌రోడ్డు పొడవునా పచ్చటి మ్యాట్లు
ఇరువైపులా బారీకేడ్లు
ఎక్కడికక్కడ ఫ్లడ్ లైట్లు, భారీ స్ర్కీన్లు
ఆర్కే బీచ్‌రోడ్డులో ప్రధాన వేదిక నిర్మాణం
కీలక ప్రాంతాల్లో ఎస్‌పీజీ తనిఖీలు
ఏయూలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు
ప్రధాన కూడళ్ల వద్ద విద్యుద్దీపాలంకరణ
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 21వ తేదీ ఉదయం బీచ్‌రోడ్డులో నిర్వహించనున్న కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మందిని సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రులు, ఉన్నతాధికారులు నగరంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీచ్‌రోడ్డులో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే పచ్చటి మ్యాట్లు వేయడం ప్రారంభించారు. కొన్నిచోట్ల ఇరువైపులా, మరికొన్నిచోట్ల ఒక వైపు మ్యాట్లు వేశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ బీచ్‌రోడ్డు పొడవునా 268 కంపార్టుమెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి కంపార్టుమెంటులో ఒక వేదిక నిర్మించారు. కంపార్టుమెంటులో ఉండే వారితో వేదికపైనుండే శిక్షకుడు యోగాసనాలు వేయిస్తారు.
ప్రధాన వేదికను ఆర్కే బీచ్‌రోడ్డులో కాళీమాత ఆలయ సమీపంలో ఏర్పాటుచేస్తున్నారు. వర్షం వచ్చినా యోగా ప్రదర్శనకు అంతరాయం లేకుండా వాటర్ ఫ్రూఫ్ టెంట్లు వేశారు. ఫ్లడ్ లైట్లు, భారీ స్ర్కీన్లు అమర్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ సహా 175 దేశాల ప్రతినిధులు యోగా కార్యక్రమంలో పాల్గొంటారని బుధవారం ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎస్‌పీజీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆ ప్రాంతం పోలీసుల ఆధీనంలో ఉంది.
ఆర్కే బీచ్‌రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25 వేల మంది పాల్గొనేలా మరో వేదిక నిర్మించారు. ఇక్కడ కూడా వర్షం పడినా ఇబ్బందిలేకుండా జర్మన్ హ్యాంగర్స్‌తో వాటర్‌ఫ్రూఫ్ రేకులతో భారీ హాళ్లు ఏర్పాటుచేశారు. సుమారు 25 వేల మంది గిరిజన యువతీయువకులు యోగాతోపాటు సూర్య నమస్కారాలు చేయనున్నారు. కాగా యోగా దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను బుధవారం సాయంత్రం హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వినియోగించాలని ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అనగాని సత్యప్రసాద్, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, బీసీ జనార్దనరెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించి, జన సమీకరణ, రవాణా సదుపాయాలపై సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి జనాల తరలింపునకు టార్గెట్లు ఇచ్చారు. ఇదిలావుండగా యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన కూడళ్లతో పాటు ఆర్కే బీచ్‌రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో సీఎం బస
టీడీపీ కార్యాలయంలో లోకేశ్...
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఈనెల 20వ తేదీన నగరానికి రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలెక్టరేట్ ఆవరణలో బస్సులో బస చేయనున్నారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బసచేస్తారు. హుద్‌హుద్ తుఫాన్ అనంతరం నగరానికి వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు వారం రోజులపాటు కలెక్టరేట్ ప్రాంగణంలో బస్సులోనే ఉన్నారు.
20, 21 తేదీల్లో పాఠశాలలకు సెలవు
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో 20, 21 తేదీల్లో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు కాంపిన్సెటరీ సెలవులు ప్రకటించామని విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. అయితే 20, 21 తేదీల్లో ఉదయం పూట పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లు యోగా కార్యకలాపాలు నిర్వహించి ‘లీప్’ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
Updated Date - Jun 19 , 2025 | 01:16 AM