ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శాస్త్రీయ పద్ధతుల్లోనే పసుపు తయారీ

ABN, Publish Date - May 04 , 2025 | 10:47 PM

ఆదివాసీ రైతులు నాణ్యమైన పసుపు తయారీకి శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే గరిష్ఠ ధర పొందవచ్చునని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు ఎన్నో ఏళ్లగా పసుపు సాగు చేస్తున్నప్పటికి ఆశించిన ఆర్థిక ప్రగతి సాధించలేకపోతున్నారు.

చౌడుపల్లిలో ఉడికించేందుకు సిద్ధం చేసిన పసుపు కొమ్ములు

అలా చేస్తే అధిక ఆదాయం

బాయిలర్లు, పాలిషర్లు ఉపయోగిస్తే మెరుగైన ఛాయ

ఆదివాసీ రైతులకు ఉద్యాన శాస్త్రవేత్తల సూచన

చింతపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు నాణ్యమైన పసుపు తయారీకి శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే గరిష్ఠ ధర పొందవచ్చునని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు ఎన్నో ఏళ్లగా పసుపు సాగు చేస్తున్నప్పటికి ఆశించిన ఆర్థిక ప్రగతి సాధించలేకపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో గరిష్ఠ ధర లభిస్తున్నప్పటికీ గిరిజన రైతులు ఇప్పటికీ పసుపు తయారీలో పురాతన పద్ధతులను పాటించడం వల్ల లాభాలను పొందలేకపోతున్నారు. ప్రస్తుతం రైతులు పంట సేకరించుకుని ప్రాసెసింగ్‌ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ మేరకు పసుపు పంట సాగు, ప్రాసెసింగ్‌లో ఆధునిక పద్ధతులు పాటిస్తే ఆశించిన ఫలితాలను సాధించవచ్చునని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ఎండు పసుపు రూ.200పైగా ఉన్నప్పటికి గిరిజన ప్రాంతంలో సరైన పద్ధతిలో ప్రాసెసింగ్‌ చేయకపోవడం వల్ల రూ.140-150 ధర లభిస్తుంది.

రెండేళ్ల సాగు విధానాన్ని విరమించాలి

ప్రధానంగా గిరిజన రైతులు పసుపు సాగును రెండేళ్ల పంటగా సాగు చేస్తున్నారు. పసుపు 8- 9 నెలల పంట కాలంగా రైతులు సాగుచేసుకోవాలి. దేశవాళి రకాలను రైతులు మొదటి ఏట నాట్లు వేసి రెండో ఏడాది పంటను సేకరిస్తున్నారు. దీని వల్ల కాలం వృఽథా కావడం మినహా ఫలితం ఏమి వుండదని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిరూపించారు. గిరిజన ప్రాంతానికి రోమా, ప్రగతి రకం పసుపు రకాలు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తాజాగా కొత్తబంధ గిరిజనులు రోమా రకం పసుపు సాగుచేసి ఉత్తమ ఫలితాలు సాధించారు. హెక్టారుకు 20.7 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఈ ఏడాది చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల మండలాల ఆదివాసీ రైతులు ప్రగతి రకం పసుపును సాగుచేసుకుని అత్యధిక దిగుబడి సాధించారు. పసుపు ఛాయ కూడా బాగుంది. పసుపును అడుగు ఎత్తు కలిగిన బెడ్స్‌ను ఏర్పాటు చేసుకుని నాట్లు వేసుకోవడం మంచిది.

పసుపు తయారీలో నూతన పద్ధతులు పాటించాలి

ఆదివాసీ రైతులు పసుపు తయారీ(ప్రాసెసింగ్‌)లో నూతన పద్ధతులు పాటించాల్సిన అవసరం వుంది. రైతులు పురాతన పద్ధతులు పాటించడం వల్ల మార్కెట్‌లో లభించే అధిక ధరను పొందలేకపోతున్నారు. ప్రధానంగా రైతులు పంట పొలాల నుంచి సేకరించిన పసుపును నీళ్లతో కలిపి నేరుగా ఉడికిస్తున్నారు. ఈ విధంగా ఉడికించడం వల్ల పసుపు అంతా సమానంగా ఉడికే పరిస్థితి వుండదు. కొన్ని అధికంగా ఉడికిపోగా, మరికొన్ని పాక్షికంగా ఉడుకుతాయి. ఈ విధంగా నీళ్లతో నేరుగా ఒక టన్ను పసుపు ఉడికించేందుకు రెండు టన్నుల కలప, 4 వేల లీటర్ల నీరు అవసరం. నీళ్లతో ఉడికించిన పసుపు బరువు కూడా భారీగా తగ్గిపోతోంది. 100 కిలోల పసుపు ఉడికిస్తే ఎండు పసుపు 15-16 కిలోలు మాత్రమే వస్తుంది. 100 కిలోలు ఉడికించేందుకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఉడికించిన పసుపును పాలిష్‌ చేసినప్పటికీ ఆకర్షణీయమైన ఛాయ కూడా రాదు. అలాగే ఆదివాసీ రైతులు ఎండిన పసుపును పాలిషింగ్‌ చేసేందుకు నాటు పద్ధతులను పాటిస్తున్నారు. గోనె సంచుల్లో ఎండు పసుపును నింపి బండపై కొడుతూ పాలిష్‌ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల సరైన ఛాయ రాకపోగా కొమ్ములు విరిగిపోయి పరిమాణం తగ్గిపోతోంది. మరికొంత మంది రైతులు గోనె సంచుల్లో కొమ్ములను వేసి కాళ్లతో తొక్కుతున్నారు. రైతులు పసుపు పాలిషింగ్‌ చేసేందుకు పాటిస్తున్న ఈ రెండు పద్ధతుల వల్ల కొమ్ముల్లో ఛాయ కనిపించడం లేదు. ఈ కారణంగా రైతులు పండించిన పసుపును వర్తకులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఈ పాత పద్ధతులను పూర్తిగా విడిచిపెట్టాలి.

యంత్రాల వినియోగంతో మెరుగైన ఛాయ

రైతులు శ్రమించి పండించిన పసుపును యంత్రాలను ఉపయోగించి ప్రాసెసింగ్‌ చేసుకోవడం వల్ల ఛాయ మెరుగు పడుతుంది. తద్వారా మార్కెట్‌లో లభిస్తున్న గరిష్ఠ ధరను రైతులు పొందే అవకాశముంది. పసుపును కేవలం స్టీమ్‌(ఆవిరి) బాయిలర్‌లతోనే ఉడికించాలి. ఈ విధంగా ఉడికించే యంత్రాలు మార్కెట్‌లో అందుబాటులో వున్నాయి. స్పైస్‌ బోర్డు ద్వారా రైతులకు ఆవిరితో పసుపును ఉడికించే బాయిలర్లను పంపిణీ చేసింది. ఆవిరితో ఉడికించడం వల్ల పసుపు కొమ్ములు అన్నీ సమానంగా ఉడుకుతాయి. 8-9 నిమిషాలకు 150 కిలోల పసుపును యంత్రాల ద్వారా ఉడికించుకోవచ్చు. టన్ను పసుపును కేవలం గంట సమయంలోనే ఉడికించుకోవచ్చు. టన్ను పసుపు ఉడికించేందుకు 150- 200 కిలోల కలప సరిపోతుంది. 100 కిలోల పసుపును ఆవిరి ద్వారా ఉడికిస్తే 22-25 కిలోల ఎండు పసుపు దిగుబడి వస్తుంది. పసుపును పాలిష్‌ చేసేందుకు కూడా యంత్రాలు అందుబాటులో వున్నాయి. ఈ యంత్రాల ద్వారా పసుపును పాలిష్‌ చేయడం వల్ల పసుపు ఛాయ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 600 కిలోల పసుపును 45 నిమిషాల్లో పాలిష్‌ చేయవచ్చు. ఈ పసుపును విక్రయించుకుంటే మార్కెట్‌ గరిష్ఠ ధర లభిస్తోంది. పసుపు పాలిషర్లను సైతం ఎఫ్‌పీవోలకు స్పైస్‌ బోర్డు రాయితీపై పంపిణీ చేసింది.

Updated Date - May 04 , 2025 | 10:47 PM