పాలిటెక్నిక్ విద్యార్థుల పొలం బాట
ABN, Publish Date - May 19 , 2025 | 11:23 PM
ఆర్గానిక్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పొలం బాట పట్టారు. మూడో సెమిస్టర్ ప్రాక్టికల్స్‌లో భాగంగా విద్యార్థులు పంటలు పండించాల్సి వుంది. ఈ మేరకు ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకుని ద్వితీయ సంవత్సరంలో అడుగుపెట్టిన విద్యార్థులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.
చింతపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆర్గానిక్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పొలం బాట పట్టారు. మూడో సెమిస్టర్ ప్రాక్టికల్స్‌లో భాగంగా విద్యార్థులు పంటలు పండించాల్సి వుంది. ఈ మేరకు ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకుని ద్వితీయ సంవత్సరంలో అడుగుపెట్టిన విద్యార్థులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. సోమవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విద్యార్థులు కూరగాయల సాగులో భాగంగా కలుపు తొలగింపు, సేంద్రీయ ఎరువులు తయారీ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీచింగ్ అసోసియేట్ కె.బాబూజినాయుడు మాట్లాడుతూ విద్యార్థులు ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారన్నారు. విత్తనాలు నాటిన నాటి నుంచి పంట తీసుకునే వరకు విద్యార్థులే వివిధ రకాల పనులు నిర్వహించాల్సి వుంటుందన్నారు. విద్యార్థులు పంటలకు అవసరమైన ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, వివిధ కషాయాలు స్వయంగా తయారు చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు విద్యాభ్యాసం దశలోనే స్వయంగా పంటలు పండిస్తారని చెప్పారు. దీని వల్ల విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ అసిస్టెంట్ ఎస్.శ్వేత పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2025 | 11:23 PM