మురుగుతున్న కాలుష్య నియంత్రణ నిధులు
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:49 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపంతో నగరంలో కాలుష్య నియంత్రణ పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదు.
2023-24 వరకు రూ.129.25 కోట్లు మంజూరు
వినియోగించింది రూ.39.53 కోట్లు మాత్రమే బిల్లులు మంజూరు కాకపోవడంతో
పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ల విముఖం
రెండేళ్లుగా కేంద్రం నుంచి నిధులు నిలిపివేత
గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపంతో నగరంలో కాలుష్య నియంత్రణ పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదు. నిధులు ఉన్నా వాటిని గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేదు. దాంతో పనులు ఆగిపోయాయి. ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేదని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు నిలిపివేసింది. చేసిన పనులకు బిల్లులు అందకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులకు ముందుకురావడం లేదు. ఇదీ నగరంలో కాలుష్య నియంత్రణ తీరు.
రాష్ట్రంలో ఏకైక పారిశ్రామిక నగరం విశాఖపట్నం. ఇక్కడ కాలుష్యం అధికం. విశాఖపట్నం పోర్టు ప్రధానంగా నగరాన్ని కాలుష్యమయం చేస్తోంది. ఇకపోతే గంగవరం పోర్టు, హెచ్‌పీసీఎల్, స్టీల్ ప్లాంటు కాలుష్యంలో మేమూ ఉన్నామంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటికి తోడుగా నిర్మాణ సంస్థలు, రహదారులపై తిరిగే వాహనాలు కాలుష్యం సృష్టిస్తున్నాయి. దీంతో ఇరవై ఏళ్ల క్రితమే విశాఖపట్నం కాలుష్యంలో దేశంలో తొమ్మిదో నగరంగా స్థానం దక్కించుకుంది. అప్పటి నుంచి కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు రూ.129.25 కోట్లు మంజూరు చేసింది. వీటిని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ అధికారులు కలిసి ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాలి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల వినియోగంపై సమీక్షించినప్పుడు విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు ఇచ్చిన నిధులను కేవలం 31 శాతమే వినియోగించుకున్నారని, నిధులు మురుగుపోతున్నాయని తేల్చింది. గణాంకాలు పరిశీలిస్తే ఇచ్చిన నిధుల్లో రూ.39.53 కోట్లు మాత్రమే వాడుకున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో 2024 ఏప్రిల్ నుంచి కొత్త నిధులు ఇవ్వడం మానేసింది. ఈ నిధులు వ్యయం కాకపోవడానికి అన్ని కారణాలు ఉన్నాయని అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి.
విశాఖపట్నంలో సింహభాగం కాలుష్యం పరిశ్రమలదే. విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, హెచ్‌పీసీఎల్, కోరమండల్, స్టీల్ ప్లాంటు ద్వారా వచ్చే కాలుష్యాన్ని వారే నియంత్రించాలి. ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దీనిని కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షించాలి. ఇక వాహనాలు, రహదారులు, భవనాల నిర్మాణం వచ్చే ధూళిని తగ్గించి గాలి నాణ్యత పెంపొందించాల్సి ఉంది. దీనికి ఎక్కడికక్కడ పరికరాలు పెట్టి అక్కడి గాలి నాణ్యత తెలిపే బోర్డులు ఏర్పాటుచేశారు. ఇవి సక్రమంగా పనిచేయడం లేదు.
ఇక నగరంలో వ్యర్థాలు కాలుష్యం సృష్టించకుండా జీవీఎంసీ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. దీనికి వారు వేస్ట్ ఎనర్జీ ప్లాంటు, ప్లాస్టిక్ రీసైక్లింగ్, బయో మైనింగ్ వంటి ప్రాజెక్టులు చేపట్టి కొంతవరకు ఫలితాలు సాధిస్తున్నారు. చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం సీఎంఎఫ్‌ఎస్ నుంచి సకాలంలో విడుదల కావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల నిధులు వాడేసుకోవడంతో వారికి అవసరమైనప్పుడు విడుదల చేయలేకపోయింది. దాంతో బిల్లులు అందక కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టడానికి ముందుకు రాలేదు. దాంతో ఆ తరువాత చేపట్టాలనకున్న పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సకాలంలో సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం ఆ తరువాత నిధులు ఇవ్వడం ఆపేసింది. వైసీపీ ప్రభుత్వం చేసిన పని వల్ల విశాఖకు కేటాయించిన నిధులు వినియోగించుకోలేని దుస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించకుండా స్థానిక అధికారుల అలసత్వంగా పేర్కొనడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించి విశాఖలో కాలుష్యం తగ్గించడానికి నిధులు విడుదల చేయాల్సి ఉంది.
Updated Date - Jul 02 , 2025 | 12:49 AM