ప్లాస్టిక్ భూతం
ABN, Publish Date - May 11 , 2025 | 11:39 PM
నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ సమస్య నానాటికీ తీవ్రతరం అవుతున్నది. ఇది పర్యావరణానికే కాకుండా మనుషులకు, పశువులకు ప్రాణాంతకంగా మారింది. గ్రామాల్లో పారిశుధ్య సమస్య పెరిగిపోతున్నది. డ్రైనేజీల్లో ప్లాస్టక్ వ్యర్థాలు పేరుకుపోయి, మురుగునీటి ప్రవాహనానికి ఆటంకంగా మారుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సైతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు ఇదో పెద్ద సమస్యగా తయారైంది.
గ్రామాల్లో పెరిగిపోతున్న వ్యర్థాలు
డ్రైనేజీల్లో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం
పెరిగిపోతున్న దోమలబెడద
ఖాళీ స్థలాలు, చెరువులు, పొలాల్లో సైతం పాలిథిన్ వ్యర్థాల సమస్య
ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేయడంలో అధికారులు విఫలం
పరవాడ, మే 11 (ఆంధ్రజ్యోతి) : నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ సమస్య నానాటికీ తీవ్రతరం అవుతున్నది. ఇది పర్యావరణానికే కాకుండా మనుషులకు, పశువులకు ప్రాణాంతకంగా మారింది. గ్రామాల్లో పారిశుధ్య సమస్య పెరిగిపోతున్నది. డ్రైనేజీల్లో ప్లాస్టక్ వ్యర్థాలు పేరుకుపోయి, మురుగునీటి ప్రవాహనానికి ఆటంకంగా మారుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సైతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు ఇదో పెద్ద సమస్యగా తయారైంది. కాలువల నిర్వహణ సరిగా లేక, పూడికతీత పనులు చేపట్టక దుర్వాసన, దోమలతో ప్రజలు ఇబ్బందిపడుతుండగా.. ప్లాస్టిక్ సమస్య మరింత జటిలం చేస్తున్నది. గ్రామాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వీటి నిర్వహణ కోసం తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మండలంలోని అన్ని గ్రామాల్లో సాధారణ చెత్త కన్నా ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా ఉంటున్నాయి. పర్యావరణ పరిరక్షణపై పదే పదే అవగాహన కల్పిస్తున్నా, స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నా.. ప్రజల్లో మార్పు కనిపించడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో పేరుకుపోయి మురుగునీరు పారడంలేదు.
పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం
ప్లాస్టిక్ వ్యర్థాలు నివాస ప్రాంతాల్లోనే కాకుండా ఖాళీ స్థలాలు, పంట పొలాలు, సాగునీటి చెరువుల్లో కూడా పేరుకుపోతున్నాయి. పరవాడ పెదచెరువుకు ఆనుకొని ఉన్న పైడిమాంబ బంధ, కోనాం, తానాంలోని బంధ, పరవాడ ఎర్రకోనాం తదితర చెరువులు ప్లాస్టిక్ వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం వల్ల వాటిల్లోని నీటితోపాటు భూగర్భ జలాలు విషపూరితం అవుతున్నాయి. గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నది. శుభకార్యాలు జరిగితే తాగునీటి నుంచి భోజనాల వరకు అన్నీంటికీ ప్లాస్టిక్ వస్తువులే వాడుతున్నారు. ప్లాస్టిక్ గ్లాస్లులు, వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. రహదారులపై చెత్తను తొలగించే పారిశుధ్య కార్మికులు డ్రైనేజీల కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలేదు. దీంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు.
ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలను అరికడతాం
కె.ధర్మారావు, పంచాయతీ విస్తరణాధికారి
దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను అరికడతాం. వీటి వినియోగం వల్ల కలిగే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇళ్లలో వినియోగించే ప్లాస్టిక్ వ్యర్థాలను మురుగు కాలువల్లో వేస్తే చర్యలు తీసుకుంటాం. ప్లాస్టిక్ వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ప్లాస్టిక్ వినియోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి.
Updated Date - May 11 , 2025 | 11:39 PM