అల్లం, పసుపుపై తెగుళ్ల దాడి
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:48 PM
జిల్లాలో గిరిజన రైతులు సాగుచేస్తున్న అల్లం, పసుపు పంటలో దుంపకుళ్లు, ఆకు మచ్చ (ఫిల్లోస్టిక్టా) తెగుళ్ల ఉధృతి కనిపిస్తోంది. ఈ తెగుళ్లను రైతులు సకాలంలో గుర్తించి నివారించుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే మొక్కలు చనిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు తెలిపారు.
దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లతో రైతులు సతమతం
సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన
చింతపల్లి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన రైతులు సాగుచేస్తున్న అల్లం, పసుపు పంటలో దుంపకుళ్లు, ఆకు మచ్చ (ఫిల్లోస్టిక్టా) తెగుళ్ల ఉధృతి కనిపిస్తోంది. ఈ తెగుళ్లను రైతులు సకాలంలో గుర్తించి నివారించుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే మొక్కలు చనిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు తెలిపారు.
పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో పసుపు పంటను ఎనిమిది వేల హెక్టార్లు, అల్లం 586 హెక్టారుల్లో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్నారు. అనధికారంగా మరో 600 హెక్టారుల్లో ఈ రెండు పంటలను సాగుచేసుకుంటున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి జూన్ మొదటి పక్షం వరకు రైతులు పసుపు, అల్లం నాట్లను వేసుకున్నారు. ప్రస్తుతం అల్లం, పసుపు మొక్కలు 1-1.5 ఎత్తులో ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా అల్లం, పసుపు పంటల్లో దుంపకుళ్లు , ఆకు మచ్చ తెగులు అధికంగా వ్యాప్తి చెందుతున్నది. రైతులు ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
దుంపకుళ్లు నివారణ ఇలా..
పసుపు, అల్లం పంటలో ఆకులు పాలిపోయి మొక్క కుళ్లిపోయినట్టు కనిపిస్తే దుంపకుళ్లు ఆశించిందని భావించాలి. ఈ తెగులును సేంద్రీయ పద్ధతిలో నివారించుకోవచ్చు. ఈ తెగులు నివారణకు ఒక కిలో ట్రైకోడెర్మావిరిడి జీవశిలింధ్రనాసిని 95 కిలోల పశువుగెత్తం, 5 కిలోల వేపపిండిలో కలుపుకోవాలి. వారం రోజులు విడతలవారీగా ఈ మిశ్రమాన్ని కలుపుకుని ఎకరానికి 100 కిలోలు సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొక్కల మొదళ్లలో వేసుకోవాలి. ఒకవేళ దుంపకుళ్లు ఉధృతి అధికంగా ఉంటే రసాయన పద్ధతిలో కాపర్‌ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలుపుకుని మొక్క మొదలులో వేసుకోవాలి.
ఆకుమచ్చ(ఫిల్లోస్టిక్టా) తెగులు నివారణకు..
ఆకుల్లో మచ్చలు కనిపిస్తే ఫిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులుగా గుర్తించాలి. జూలై నెలాఖరు నుంచి అక్టోబరు మాసం వరకు ఈ తెగులు ఆశించే అవకాశముంది. వాతావరణంలో తేమ అధికంగా ఉంటే ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు సేంద్రీయ పద్ధతిలో ఒక శాతం బోర్డు మిశ్రమం ఆకుల్లో పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయ సున్నం, మైలుతుత్తం(కాపర్‌సల్ఫేట్) సమపాళ్లలో ఐదు కిలోల చొప్పున తీసుకొని వంద లీటర్లలో వ్యవసాయ సున్నం, మరో వంద లీటర్లలో మైలుతుత్తం కలుపుకుని, ఈ రెండు కలుపుకుని బోర్డు మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ బోర్డు మిశ్రమాన్ని ఆకులపై పిచికారీ చేసుకోవాలి. రసాయన పద్ధతిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటరు నీటిలో కలుపుకుని ఆకులపై పిచికారీ చేసుకోవాలి.
Updated Date - Aug 04 , 2025 | 11:48 PM