వరుస చోరీలతో జనం బెంబేలు
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:51 AM
పట్టణంలో చైన్‌స్నాచింగ్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చోరులు రెచ్చిపోతున్నారు. పట్టపగలు ఆడవారి మెడల్లో నుంచి బంగారం గొలుసులు తెంచుకుని పారిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో మూడుచోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. మొత్తం ఎనిమిది తులాల వరకు బంగారం చోరీకి గురైంది. దీంతో పట్టణ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, యువతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఎలమంచిలిలో పెరిగిన దొంగతనాలు
ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్
పట్టపగలే బంగారు ఆభరణాలు తెంచుకుని పరారీ
ముందుగా రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్న ఆగంతకులు
ఎలమంచిలి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో చైన్‌స్నాచింగ్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చోరులు రెచ్చిపోతున్నారు. పట్టపగలు ఆడవారి మెడల్లో నుంచి బంగారం గొలుసులు తెంచుకుని పారిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో మూడుచోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. మొత్తం ఎనిమిది తులాల వరకు బంగారం చోరీకి గురైంది. దీంతో పట్టణ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, యువతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఎలమంచిలిలో టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్‌లు వున్నాయి. వీటిల్లో అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నారు. పట్టణంలో పలుకీలక ప్రదేశాల్లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా కొంతమంది వ్యాపారులు దుకాణాల బయట, నివాసితులు ఇళ్ల వెలుపల సీసీ కెమెరాలు బిగించుకున్నారు. అయినప్పటికీ పట్టపగలు దొంగలు రెచ్చిపోతున్నారు. కొద్ది రోజుల నుంచి పట్టణంతోపాటు మండలంలో కూడా చోరీలు పెరిగాయి. ప్రధానంగా ఒంటరిగా వున్న మహిళల మెడల్లో నుంచి బంగారం గొలుసులు, పుస్తెల తాళ్లు తెంచుకుని పరారయ్యే ముఠా సంచరిస్తున్నది. ఈ నెల 15వ తేదీ తులసీనగర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోడ్డులో పొలమరశెట్టి అరుణ మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కుని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. అంతకు వారం రోజుల ముందు ఎల్‌ఐసీ కార్యాలయానికి సమీపంలో పాన్‌షాపు వద్దకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కూల్ డ్రింక్ అడిగారు. షాపు యజమాని మేరీ కూల్ డ్రింగ్ సీసా ఇస్తుండగా.. ఆమె మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పారు.
గత నెలలో పట్టణంలోని బైపాస్ రోడ్డులో వున్న శ్రీరామచంద్రమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో పాన్‌షాపు నిర్వహించుకుంటున్న మరో మహిళ నుంచి ఇదే తరహాలో బంగారం గొలుసును లాక్కొని పరారయ్యారు. మార్చి 2వ తేదీన కొత్తలి గ్రామానికి సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి ఆపి, అతని వద్ద నుంచి సెల్‌ఫోన్, కొంత నగదు దోచుకున్నారు.
ఈ తరహాలో చిన్నాచితకా సంఘటనలు జరుగుతున్నప్పటికీ అవి పోలీసు స్టేషన్ వరకు చేరడం లేదు. ఆగంతకులు జన సంచారం అంతగా లేని ప్రదేశాలను ఎంచుకుని ముందుగా రెక్కీ నిర్వహిస్తున్నారని, మహిళలు ఒంటరిగా కనిపిస్తే మెరుపు దాడి చేసి మెడలో నుంచి బంగారం గొలుసులు తెంచుకుని పరారవుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి నిఘాను పెంచాలని, అదే విధంగా మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను పట్టుకుంటే ప్రజల్లో భయాందోళన తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Apr 19 , 2025 | 12:51 AM