పంచాయతీరాజ్ ఇష్టారాజ్యం
ABN, Publish Date - May 24 , 2025 | 11:22 PM
అల్లూరి జిల్లాలో పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కలెక్టర్ అనుమతులు లేకుండానే లగిశపల్లి రోడ్డు పనులను చేసేస్తున్నారు. అది కూడా ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండానే పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంఽధించిన వివరాలిలా ఉన్నాయి.
అనుమతి లేకుండానే లగిశపల్లి రోడ్డు పనులు
ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండానే...
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో
సీఎం పర్యటన రద్దు అయ్యే అవకాశం
అయినా కలెక్టర్ అనుమతి లేకుండా
రెండు రోజుల నుంచి రహదారి నిర్మాణం
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
ఈనెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాడేరు మండలం లగిశపల్లి పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఈక్రమంలో జిల్లా కేంద్రం పాడేరు నుంచి లగిశపల్లికి ఉన్న పంచాయతీరాజ్ రోడ్డు వెడల్పు చేసి కొత్తగా తారు వేసేందుకు జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయమని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు కలెక్టర్‌కు సమర్పించారు. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు, మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందడం వంటి ఘటనల నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఏజెన్సీలో పర్యటించడం సరికాదని హోం శాఖ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో సీఎం పర్యటన రద్దయ్యే అవకాశాలుండడంతో ఆ రోడ్డు పనికి సంబంధించిన ఫైల్‌పై జిల్లా కలెక్టర్ దృష్టి సారించలేదు. ఆ రోడ్డు పనికి కలెక్టర్ నుంచి శనివారం నాటికి అధికారికంగా ఎటువంటి అనుమతి లభించలేదు.
కలెక్టర్ అనుమతి లేకున్నా రూ.3 కోట్ల పనులు అప్పగింత
వాస్తవానికి ఎక్కడైనా ఒక పనికి సంబంధించి పూర్తి స్థాయిలో మంజూరు చేస్తేనే పనులు ప్రారంభిస్తారు. కాని లగిశపల్లి రోడ్డు విషయంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. కలెక్టర్ అనుమతి లేకుండానే ఒక కాంట్రాక్టర్‌కు పంచాయతీరాజ్ అధికారులు రోడ్డు పనులను అనధికారికంగా అప్పగించేశారు. ఇదే అదనుగా కాంట్రాక్టర్ శుక్రవారం నుంచే లగిశపల్లి రోడ్డు పనులు చేస్తున్నారు. ఆ పనుల వద్ద సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ కూడా లేదు. ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు కావడంతో ఇంజనీర్ల పర్యవేక్షణ మరింతగా ఉండాలి. కానీ అవేవీ లేకుండానే ఈ రోడ్డు పనులను కాంట్రాక్టర్ చేసేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల మధ్య ఉన్న సమన్వయానికి లగిశపల్లి రోడ్డు పనులే ఒక ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ సంపూర్ణ అనుమతి లేకుండా రూ.3 కోట్ల విలువైన రోడ్డు పనులు చేపట్టడడం ఇంజనీరింగ్ అధికారులు ఇష్టారాజ్యానికి తార్కాణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖలో ఏం జరుగుతుందో జిల్లా కలెక్టర్ గుర్తించాలని, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - May 24 , 2025 | 11:22 PM