సింహగిరి కిటకిట
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:58 AM
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం తరలివచ్చిన భక్తులతో సింహగిరి కిటకిటలాడిందది.
అప్పన్న స్వామిని దర్శించేందుకు తరలివచ్చిన భక్తజనం
ఒక్క రోజులో దేవస్థానం ఖజానాకు రూ.50 లక్షల ఆదాయం
సింహాచలం, జూన్ 7(ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం తరలివచ్చిన భక్తులతో సింహగిరి కిటకిటలాడిందది. చందన యాత్రను తలపించేలా సింహగిరి అంతటా భక్తులు, వారి రాకపోకలకు వినియోగించన ద్విచక్ర వాహనాలు, కార్లతో పార్కింగ్ ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ఒక దశలో కార్ల పార్కింగ్ సుమారు కిలోమీటరు దూరాన గల సింహగిరి హిల్‌టాప్ రోడ్డుకు చేరింది. భక్తుల రద్దీని గమనించిన దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ప్రధాన రాజగోపురం వద్ద గల క్యాంపు కార్యాలయంలో కూర్చుని కేశఖండనశాల, ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద, దర్శనాల క్యూలలో భక్తుల రద్దీ నియంత్రణకు ఎప్పటికప్పుడు తగిన సూచనలను అధికారులకు ఇచ్చారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు తాగునీరు, చిన్నారులకు పాలు, బిస్కట్లు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు. భక్తజనం అధిక సంఖ్యలో రావడంతో దేవస్థానం ఖజానాకు శనివారం ఒక్కరోజే సుమారు రూ.50,93,115 లక్షల ఆదాయం సమకూరినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆదాయంలో సింహభాగం శ్రీఘ్రదర్శనం రూ.100, అతి శ్రీఘ్రదర్శనం రూ.300 టికెట్ల విక్రయాల ద్వారా రూ. 28,64,200 సమకూరగా, రూ.15 లడ్డూ ప్రసాదం, రూ.10 పులిహోర ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.13,72,960 ఆదాయం లభించింది. ప్రసాదాలు, దర్శనాల టికెట్లతోపాటు భక్తులు సమర్పించిన తలనీలాల టికెట్లు రూ.40 విక్రయాల ద్వారా రూ.3,98,960, విరాళాల రూపంలో రూ.2,25,008, నిత్య కల్యాణం, స్వర్ణతులసీ దళార్చన వంటి ఆర్జిత సేవల టికెట్ల అమ్మకాల ద్వారా రూ.94,480, వసతి, రవాణా విభాగాలతో కలిపి మొత్తం రూ.50,93,115 ఆదాయం సమకూరింది.
స్పెషల్ బ్రాంచిలో చక్రం తిప్పుతున్న సీఐ
సదరు అధికారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సీపీ వరకూ చేరనివ్వని పైఅధికారులు
తాత్కాలిక వీసా జారీ విషయంలో ఇటీవల ఆరోపణలు
అయినా కానరాని చర్యలు
విశాఖపట్నం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్‌లో అత్యంత కీలకంగా భావించే స్పెషల్‌బ్రాంచి విభాగంలో ఏం జరుగుతోందనే దానిపై అధికారులతోపాటు సిబ్బందిలో తీవ్ర చర్చ జరుగుతోంది. నగరంలో జరిగే అన్నిరకాల కార్యక్రమాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల పనితీరు, వారిపై వచ్చే ఆరోపణలతోపాటు పోలీస్ శాఖలో అధికారులు, సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి సీపీకి అందజేయాల్సిన బాధ్యత స్పెషల్‌బ్రాంచిపై ఉంటుంది. అంతటి కీలకమైన స్పెషల్ బ్రాంచిలో పనిచేయడాన్ని అధికారులు, సిబ్బంది కొన్నాళ్ల కిందటి వరకు ప్రతిష్టాత్మకంగా భావించేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా స్పెషల్‌బ్రాంచి ప్రతిష్ట మసకబారుతోందనే అభిప్రాయం పోలీస్ శాఖలోనే వ్యక్తమవుతోంది. అవినీతిపై నిఘా పెట్టాల్సిన స్పెషల్‌బ్రాంచే ఆరోపణలకు నిలయంగా మారుతోంది. ప్రధానంగా స్పెషల్ బ్రాంచి విభాగంలో పనిచేస్తున్న ఒక కిందిస్థాయి అధికారి ఆ విభాగం ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని, తన గుప్పిట్లో పెట్టుకున్నారంటున్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్ చేసే కానిస్టేబుళ్లకు సైతం ఏదో ఒక పేరుతో ఆయన నిత్యం ఇండెంట్‌లు పెడుతుంటారని, కొద్దిరోజుల కిందటివరకు పోర్టుకు వచ్చే విదేశీయులకు తాత్కాలిక వీసాల జారీకి తనకు లేని అధికారాన్ని చలాయించి ఏజెంట్ల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని సిబ్బందే ఆరోపిస్తున్నారు. దీనిపై సీపీకి సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. అలాగే విదేశీ పౌరసత్వం కలిగిన ఒక ఎన్‌ఆర్‌ఐ కుటుంబం ఇటీవల నగరానికి రాగా, తాత్కాలిక వీసా కోసం ఆయన డబ్బులు డిమాండ్ చేసినట్టు ఎంబసీ ద్వారా సీపీకి ఈ-మెయిల్‌లో ఫిర్యాదు అందినట్టు పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతోంది. దీనిపై సీపీ చర్యలు తీసుకుంటారని అంతా భావిస్తూ వచ్చారు. అయితే స్పెషల్ బ్రాంచిలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలను నాలుగు రోజుల క్రితం అంతర్గతంగా బదిలీ చేసిన సీపీ...ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి స్పెషల్‌బ్రాంచిలోనే కీలకమైన బాధ్యతలు అప్పగించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అసలు స్పెషల్‌బ్రాంచిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అధికారులు, సిబ్బంది అంటున్నారు. ఉన్నతాధికారులను సదరు అధికారి ప్రసన్నం చేసుకున్నారని, అందుకే అతని వ్యవహారాలను సీపీ దృష్టికి చేరకుండా వారంతా కాపాడడమే కాకుండా ఇతర అధికారులపై నెట్టేస్తున్నారని స్పెషల్ బ్రాంచి అధికారులు, సిబ్బంది వాపోతున్నారు.
సప్లిమెంటరీలోనూ వెనుకంజ
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 46 శాతం ఉత్తీర్ణత
ద్వితీయ సంవత్సరంలో 63 శాతం
ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత మరీ దారుణం
మద్దిలపాలెం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి):
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు వెనకబడ్డారు. వార్షిక ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రైవేటు కళాశాలలు సైతం సప్లిమెంటరీలో చతకిలబడ్డాయి. ఫెయిలవ్వడంలో ప్రభుత్వ కళాశాలలతో పోటీపడ్డాయి. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం దారుణంగా పడిపోయింది. ప్రథమ సంవత్సర ఫలితాల్లో 46 శాతంతో పదో స్థానం, ద్వితీయ సంవత్సరంలో 63 శాతంతో 12వ స్థానానికి దిగజారింది. శనివారం విడుదలైన ఫలితాల ప్రకారం ప్రథమ సంవత్సర పరీక్షలకు 7,388 మంది విద్యార్థులు హాజరవ్వగా కేవలం 3,414 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఫలితంగా ఉత్తీర్ణత 46 శాతంగా నమోదైంది. వొకేషనల్ గ్రూపులకు సంబంధించి 456 మంది పరీక్షలు రాయగా 243 మంది ఉత్తీర్ణులై 53 శాతంతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచారు. జిల్లాలోని 154 ప్రైవేటు కళాశాలల నుంచి 6,241 మంది పరీక్షలకు హాజరవ్వగా కేవలం 48.69 శాతంతో 3,039 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాఽధించారు.
ద్వితీయ సంవత్సర ఫలితాలు
జిల్లా నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 6,187 మంది హాజరవ్వగా 63 శాతంతో 3,920మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ గ్రూపుల నుంచి 361 మంది పరీక్షలు రాయగా 76 శాతంతో 274 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితంగా రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచారు. కాగా 141 ప్రైవేటు కాలేజీల నుంచి 5,180 మంది పరీక్షలకు హాజరవ్వగా 65.56 శాతంతో 3,396 మంది ఉత్తీర్ణులయ్యారు. వార్షిక ఫలితాల్లో ప్రైవేటు కళాశాలలు 84 శాతం ఉత్తీర్ణత సాధించగా, సప్లిమెంటరీలో 63 శాతానికే పరిమితమయ్యాయి. దీంతో జిల్లా స్థానం రాష్ట్ర స్థాయిలో కిందకు పడిపోయింది.
తీరు మారని ప్రభుత్వ కళాశాలలు
వార్షిక ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వెనకబడడంతో రాష్ట్ర ప్రభుత్వం సప్లిమెంటరీపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. వేసవి సెలవుల్లో సైతం ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ 14 నుంచి మే 10వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వార్షిక ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 34.17 శాతం, ద్వితీయ సంవత్సరంలో 55 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ ఫలితాలపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమావేశం నిర్వహించి జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు, ప్రిన్సిపాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అయినప్పటికీ సప్లిమెంటరీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు దారుణమైన ఫలితాలు సాధించాయి. 9 జూనియర్ కళాశాలల నుంచి 856 మంది పరీక్షలు రాయగా 30.49 శాతంతో 261 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 7 హైస్కూళ్ల ప్లస్ నుంచి 132 మంది పరీక్షలకు హాజరవ్వగా 21.97 శాతంతో 29 మందే పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 772 మంది పరీక్షలు రాయగా 52.72 శాతంతో 407 మంది ఉత్తీర్ణులయ్యారు. 6 హైస్కూల్స్ ప్లస్ నుంచి 79 మంది పరీక్షలు రాయగా 34.18 శాతంతో 27 మంది ఉత్తీర్ణత సాఽదించారు. కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ కళాశాలలు కాస్త మెరుగైన ఫలితాలు సాధించాయి.
Updated Date - Jun 08 , 2025 | 12:58 AM