ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కొనసాగింపు
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:53 AM
స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను యథావిధిగా కొనసాగించాలని, ఈ ఏడాది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని వ్యవసాయశాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడుకు కలెక్టర్ ఏఎన్ దినేశ్‌కుమార్ రాసిన లేఖ ఫలితాన్నిచ్చింది.
కలెక్టర్ లేఖకు స్పందించిన వ్యవసాయశాఖా మంత్రి అచ్చెన్నాయుడు
యథావిధిగా కొనసాగించాలని ఎన్‌జీ రంగా వర్సిటీ వీసీకి ఆదేశం
చింతపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి):
స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను యథావిధిగా కొనసాగించాలని, ఈ ఏడాది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని వ్యవసాయశాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడుకు కలెక్టర్ ఏఎన్ దినేశ్‌కుమార్ రాసిన లేఖ ఫలితాన్నిచ్చింది. ఈ లేఖపై స్పందించిన మంత్రి చింతపల్లి ఆర్గానిక్ అగ్రికల్చర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్.శారదను ఆదేశించారు. దీంతో ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ పీవీ సత్యనారాయణ సోమవారం స్థానిక ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామితో మాట్లాడారు. కళాశాల కొనసాగించేందుకు అనువైన పరిస్థితులు, విద్యార్థుల అడ్మిషన్లుపై ఏడీఆర్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. 2011లో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా అగ్రికల్చర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాటు చేశారు. 2016లో ఈ కళాశాలను ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌గా మార్పు చేశారు. రాష్ట్రంలో ఏకైక ఆర్గానిక్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల చింతపల్లిలో మాత్రమే ఉంది. ఈ కళాశాలలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలో 25 సీట్లు ఉండగా, ప్రతి ఏడాది 20 మందికి పైగా విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలు పొందుతున్నారు. అయితే మూడు రోజుల క్రితం ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు కళాశాలలో అడ్మిషన్లు తక్కువగా వున్నాయని, నిధుల కొరత ఉన్నందున చింతపల్లి, గుంటూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ ఏడాది చింతపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలను నిలిపివేశారు. దీంతో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ జిల్లాకు చింతపల్లి ఆర్గానిక్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అవసరమని, కళాశాలను రద్దు చేయడం వల్ల ప్రాంతీయ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయశాఖా మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని కళాశాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ లేఖ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల ఆందోళనలతో ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారుల్లో కదలిక వచ్చింది. కళాశాలను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు విశ్వవిద్యాలయం అధికారుల ద్వారా తెలిసింది.
Updated Date - Jul 15 , 2025 | 12:53 AM