ఓపెన్‌గా భూ దందా
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:30 AM
విశాఖలో పార్కులు /ఓపెన్‌స్పేస్‌లను గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేస్తున్నారు.
మొన్న మధురవాడ, ఇప్పుడు కోటనరవ
జీవీఎంసీ 88వ వార్డు పరిధిలో ఓపెన్‌స్పేస్ ధారాదత్తం
వైసీపీ హయాంలో ప్రతిపాదన
కూటమి హయాంలో ఆమోదం
ఈడబ్లూఎస్ లేఅవుట్ వెనుక 12 ఎకరాల భూమి
అందులో లేఅవుట్ వేసేందుకు కూటమి నేత ప్రణాళిక
ఆ భూమికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలుకు ఒప్పందం
ఆ భూమి ముందున్న ఓపెన్‌స్పేస్‌లో 180 గజాలు తమకు ఇస్తే తమ భూమిలో అంతేభూమిని
జీవీఎంసీకి బదలాయిస్తామంటూ రైతు ద్వారా దరఖాస్తు
ఈ ఏడాది మార్చిలో భూ మార్పిడికి ప్రభుత్వం అనుమతి
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
విశాఖలో పార్కులు /ఓపెన్‌స్పేస్‌లను గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేస్తున్నారు. వాటి వెనుక భూములు కలిగి వున్నవారు స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా పైరవీలు చేసుకుని విలువైన జీవీఎంసీ భూమిని చేజిక్కించుకుంటున్నారు. తద్వారా రహదారి సదుపాయం లేక నిరుపయోగంగా ఉన్న తమ భూములకు విలువ పెంచుకుని భారీగా లబ్ధిపొందుతున్నారు. మధురవాడ జోన్-2 బటర్‌ఫ్లై పార్కులోని 489 గజాల జీవీఎంసీ స్థలాన్ని ప్రైవేటువ్యక్తికి బదలాయించిన విషయం ఇటీవల బయటపడగా, తాజాగా 88వ వార్డు పరిధిలో జీవీఎంసీకి చెందిన ఓపెన్‌స్పేస్‌లోని 180 గజాలను ప్రైవేటు భూమికి రహదారి నిర్మాణం నిమిత్తం బదలాయించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక కూడా కూటమికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది.
జీవీఎంసీ జోన్-6 పరిధి కోటనరవలో సర్వే నంబరు 10-9బిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోసం 1981లో లేఅవుట్ వేశారు. లేఅవుట్‌లోని ప్లాట్లన్నింటిలోనూ భవన నిర్మాణాలు జరిగిపోయాయి. లేఅవుట్ మధ్య కోటనరవ నుంచి షీలానగర్ వెళ్లే రోడ్డు ఉంది. ఆ రోడ్డును ఆనుకుని సుమారు 450 గజాలను ఓపెన్‌స్పేస్ కింద విడిచిపెట్టారు. ఆ స్థలం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అందులో ఆక్రమణలు జరగడంతో పెందుర్తి తహశీల్దార్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. ఇదిలావుండగా లేఅవుట్‌కు ఉత్తరం వైపు సుమారు 20 ఎకరాల వ్యవసాయభూమి ఉంది. రైతులు ఆ భూముల్లోకి వెళ్లాలంటే ఓపెన్‌స్పేస్‌కు తూర్పు వైపున గల ఇళ్ల కోసం నిర్మించిన పది అడుగుల రహదారి ఒక్కటే మార్గం. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్‌తోపాటు నరవ-షీలానగర్ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాలన్నీ అభివృద్ధి చెందాయి. లేఅవుట్‌కు ఉత్తరభాగంలో ఉన్న వ్యవసాయ భూములు కూడా నివాసాలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఖాళీగా ఉండిపోయాయి. లేఅవుట్‌లో ఓపెన్‌స్పేస్‌గా కేటాయించిన స్థలంలో కొంతభూమిని తీసుకుని ప్రస్తుతం ఉన్న పది అడుగులు రోడ్డును 40 అడుగులకు విస్తరిస్తే వ్యవసాయ భూముల్లో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణానికి అవకాశం కలుగుతుంది.
వైసీపీ నేతతో వ్యవహారం
ఈ విషయాన్ని గుర్తించిన ఓ టీడీపీ నేత ...రైతుల భూములపై కన్నేశారు. కానీ అప్పటికి వైసీపీ అధికారంలో ఉంది. దాంతో వైసీపీకి చెందిన నేత ద్వారా వ్యవహారం నడిపించారు. లేఅవుట్ ఓపెన్‌స్పేస్‌లోని 180 గజాల స్థలాన్ని ఈడబ్ల్యూఎస్ లేవుట్‌లోని పది అడుగుల రోడ్డు విస్తరణకు కేటాయిస్తే, వెనుక భూములకు రోడ్డు సదుపాయం కలుగుతుందని, ప్రతిగా 180 గజాల భూమిని మిగిలిన ఓపెన్‌స్పేస్‌కు కలిసేలా ఇస్తామం టూ మళ్ల రమణ అనే వ్యక్తితో 2023 జూన్ 19న జీవీఎంసీకి దరఖాస్తు చేయించారు. దీనిపై తనకు సన్నిహితుడైన వైసీపీ నేత ద్వారా జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి చేసి, ప్రతిపాదనను కౌన్సిల్‌లో చర్చకు పెట్టకుండా అడ్డదారిలో ముందస్తు ఆమోదం పొంచి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అయితే ఎన్నికల హడావిడి మొదలవ్వడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదనను ఆమోదింపజేసే బాధ్యతను కూటమి నేత తీసుకున్నారు. పలుమార్లు సంబంధిత శాఖల అధికారులపై ఒత్తిడి చేయడంతో ఈ ఏడాది మార్చి ఐదున ఓపెన్‌స్పేస్‌లోని 180 గజాల స్థలాన్ని లేఅవుట్ వెనుక ఉన్న రైతుల భూముల్లో లేఅవుట్ వేసుకోవడానికి వీలుగా కేటాయించడంతోపాటు రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసేలా ఆదే శిస్తూ జీవీఎంసీకి మెమో జారీచేసింది. ఇందులో లొసుగులున్నాయనే భావనతో నాడు జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ఎంన్‌హరేంధిరప్రసాద్ జాప్యం చేయడంతో భూ బదలాయింపు ప్రక్రియ పూర్తికాలేదు. మధురవాడ జోన్-2 ఆరో వార్డు పరిధి బటర్‌ఫ్లై పార్కులోని 489 గజాల స్థలాన్ని వెనుకవున్న ప్రైవేటు వ్యక్తుల భూమికి బదలాయించినవిషయం ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటనరవలోని ఈడబ్ల్యూఎస్ లేఅవుట్‌లోని ఓపెన్‌స్పేస్‌ను కూడా అదే మాదిరిగా ప్రైవేటు వ్యక్తుల భూమికి బదలాయించారంటూ పలువురు ‘ఆంరఽధజ్యోతి’కి సమాచారం ఇచ్చారు. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారుల వద్ద ఆరా తీయగా ఏపీఎంఆర్‌యూడీఏ చట్టం-2016లోని సెక్షన్ 93 ప్రకారం జీవీఎంసీ భూమిని ప్రైవేటు భూమికి బదులుగా మార్పిడి చేసుకునే వెసులుబాటు ఉందని, దాని ప్రకారమే తాము ముందుకువెళ్లామని వివరణ ఇవ్వడం విశేషం.
Updated Date - Jul 07 , 2025 | 12:30 AM