బెండ రైతు దిగాలు
ABN, Publish Date - May 14 , 2025 | 12:52 AM
బెండకాయ ధర ఒక్కసారిగా పడిపోయింది. మంగళవారం స్థానిక మార్కెట్‌లో సుమారు 12 కిలోలు వుండే క్రేట్ బెండకాయలను రూ.20కి కూడా కొనుగోలుచేసే వారు కరువయ్యారు. దీంతో కొంతమంది రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బెండకాయలను రోడ్డుపై పారబోసి ఖాళీ క్రేట్‌లతో ఇళ్లకువెళ్లిపోయారు.
దేవరాపల్లి మార్కెట్‌లో ఒక్కసారిగా పడిపోయిన ధర
12 కిలోల క్రేట్ బెండకాయలు రూ.20కి కూడా అమ్ముడుపోని దుస్థితి
రోడ్డుపై పారబోసి వెళ్లిపోయిన రైతులు
దేవరాపల్లి, మే 13 (ఆంధ్రజ్యోతి): బెండకాయ ధర ఒక్కసారిగా పడిపోయింది. మంగళవారం స్థానిక మార్కెట్‌లో సుమారు 12 కిలోలు వుండే క్రేట్ బెండకాయలను రూ.20కి కూడా కొనుగోలుచేసే వారు కరువయ్యారు. దీంతో కొంతమంది రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బెండకాయలను రోడ్డుపై పారబోసి ఖాళీ క్రేట్‌లతో ఇళ్లకువెళ్లిపోయారు. స్థానిక వనదేవీశ్వర ఆలయం వద్ద సోమవారం మినహా మిగిలిన అన్ని రోజులూ చుట్టుపక్కల గ్రామాల రైతులు కూరగాయలను తీసుకువచ్చి అమ్ముకుంటుంటారు. ప్రస్తుతం బెండ, ఆనప, బీర, బరబాటీలు అధికంగా వస్తున్నాయి. వేసవిలో బెండ కాపు ఆశాజనకంగా వుంటుంది. దీంతో దేవరాపల్లి మండలంతోపాటు పక్కనే వున్న కె.కోటపాడు, చీడికాడ, విజయనగరం జిల్లా వేపాడ మండలాల్లో ఎక్కువ మంది రైతులు బెండ సాగు చేపట్టారు. దీంతో స్థానిక మార్కెట్లు, సంతలకు పెద్ద మొత్తంలో బెండకాయలు తీసుకువస్తున్నారు. దీంతో డిమాండ్‌ను మించి సరకు రావడంతో ధర తగ్గిపోతున్నది. దేవరాపల్లిలో సోమవారం మార్కెట్ లేకపోవడంతో మంగళవారం పలువురు రైతులు పెద్ద మొత్తంలో బెండకాయలు తీసుకువచ్చారు. మార్కెట్‌లో ఎక్కడ చూసినా బెండకాయల క్రేట్లు కనిపిస్తుండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చిరువ్యాపారుల, దళారులు రేటు తగ్గించి అడగడం మొదలుపెట్టారు. తొలుత 12 కిలోల క్రేట్ కాయలు రూ.30 వరకు ధర పలికింది. తరువాత కొనుగోలుదారులు తగ్గిపోవడంతో రైతులు రేటు తగ్గించాల్సి వచ్చింది. చివరకు క్రేట్ బెండకాయలు రూ.20కి ఇస్తామన్నా.. కొనేవారు లేకపోయారు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన పలువురు రైతులు.. బెండకాయలను రోడ్డుపై పారబోసి, ఖాళీ క్రేట్‌లతో ఇంటిముఖం పట్టారు. ఇక ఆనపకాయ, బరబాటీల ధరలు కూడా బాగాతగ్గిపోయాయి.
Updated Date - May 14 , 2025 | 12:52 AM