ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్కులు కబ్జా!

ABN, Publish Date - May 28 , 2025 | 01:03 AM

నగరంలోని ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే పార్కులను కొందరు కబ్జా చేసి వారి నివాసంగా మార్చుకున్నారు.

నివాసానికి అనుకూలంగా నిర్మాణాలు

దైవ సేవ పేరుతో స్వాధీనం

ఇప్పుడు స్థానికులు రాకుండా అడ్డుకుంటున్న వైనం

విలువ రూ.20 కోట్లపైనే...

జీవీఎంసీకి కాలనీ అసోసియేషన్‌ ఫిర్యాదు

నెల రోజులైనా చర్యలు శూన్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే పార్కులను కొందరు కబ్జా చేసి వారి నివాసంగా మార్చుకున్నారు. సాయిబాబా సేవ పేరుతో దశాబ్ద కాలంగా వాటిలోనే ఇళ్లు కట్టుకొని నివాసం ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో ఆంధ్ర యూనివర్సిటీ కో-ఆపరేటివ్‌ సొసైటీ 1969లో లేఅవుట్‌ వేసి అందులో సభ్యులకు ప్లాట్లు కేటాయించింది. సామాజిక అవసరాల కోసం అక్కడక్కడా ఖాళీ స్థలాలను విడిచి పెట్టింది. కాలక్రమంలో ఒక స్థలంలో సాయిబాబా ఆలయం నిర్మించారు. మరొక స్థలంలో కేడీపీఎం హైస్కూల్‌ నిర్మించారు. సాయిబాబా ఆలయానికి సమీపానే ఒక మార్గంలో రోడ్డుకు ఎదురెదురుగా 1,500 గజాలు, 600 గజాల విస్తీర్ణంలో పార్కులు నిర్మించారు. వాటిని నిర్వహణ కోసం జీవీఎంసీకి అప్పగించారు. అయితే సాయిబాబా ఆలయ నిర్వాహకుల్లో ఒకరు బాబా పూజకు అవసరమైన మొక్కలు పెంచుతామంటూ ఒక పార్కును తన ఆధీనంలోకి తీసుకున్నారు. మరికొన్నాళ్లకు సాయిబాబాను సాయంత్రం వేళ పల్లకీలో తీసుకువచ్చి భక్తుల కోసం అందుబాటులో ఉంచుతామని చెప్పి రెండో పార్కును కూడా హస్తగతం చేసుకున్నారు. వాటిలో ఒక దానికి ‘లెండీ వనం’ అని, మరొక దానికి ‘సాయిబాబా చావిడి’ అని నామకరణం చేశారు. లెండీ వనంలో కొంత భాగాన్ని పక్కనే ఉన్న ఓ రాజకీయ నాయకుడు ఆక్రమించారు. బాబా సేవ పేరుతో పార్కులో తిష్ఠ వేసిన సేవకుడు ప్రస్తుతం స్థానికులు రాకుండా గేట్లను వేసేస్తున్నారు. పార్కు లోపల ఏమి జరుగుతున్నదో బయటకు కనిపించకుండా ఆరు అడుగుల ఎత్తుకు మించి ప్రహరీ నిర్మించారు. అన్ని పార్కులకు రెండు అంతకంటే ఎక్కువ గేట్లు ఉంటాయి. ఇక్కడ ఒకే ఒక గేటు ఉంచి, మిగిలిన వాటిని మూసేశారు. సాయిబాబా చావిడిలో ఏకంగా ఒక కుటుంబం నివాసం ఉండడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టారు. పార్కులో బాత్‌రూమ్‌లు, వంట గదుల నిర్మాణాలు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తే...మీకు సంబంధం లేదంటూ వారిని బయటకు పంపించేస్తున్నారు. ఇవన్నీ గమనించిన ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారితో సంప్రతింపులు జరిపి, పార్కులను తమకు అప్పగిస్తే అందరికీ ఉపయోగపడేలా నిర్వహిస్తామని కోరింది. దానికి వారు నిరాకరించడంతో అసోసియేషన్‌ ప్రతినిధులు జీవీఎంసీలో ఉద్యానవనాలు పర్యవేక్షించే అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు చేపడతామని చెప్పినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో వారంతా కలిసి గత నెల 21వ తేదీన జీవీఎంసీ ప్రజా స్పందనలో ఫిర్యాదు చేశారు. నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని వారు రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే నెల పూర్తయినా ఒక్కరోజు కూడా అధికారులు వచ్చి ఏమి జరుగుతున్నదో పరిశీలించలేదని, సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పార్కుల స్థలం అందరికీ ఉపయోగపడాలని, అందులో నిర్మాణాలు తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

శాశ్వతంగా ఉండిపోవాలనే కుట్ర

వైవీ నరసింగరావు, ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ

బాబా సేవ పేరుతో పార్కును తీసుకొని అందులో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. స్థానికులను రానీయడం లేదు. తాళం వేసేస్తున్నారు. అది కాలనీకి చెందిన ఆస్తి. ఒక్కరి స్వాధీనంలో ఉంచడం అన్యాయం. దీనిపై జీవీఎంసీ అధికారులు వెంటనే స్పందించాలి.

Updated Date - May 28 , 2025 | 01:03 AM