ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొంగొత్తగా కైలాసగిరి

ABN, Publish Date - Jul 13 , 2025 | 01:01 AM

నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపైమరిన్ని ఆకర్షణీయమైన ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందించింది.

  • మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని వీఎంఆర్‌డీఏ ప్రణాళిక

  • రాత్రి బస చేసేందుకు ఎకో కాటేజీలు

  • పార్టీలకు రివాల్వింగ్‌ రెస్టారెంట్‌...బే వ్యూ కాఫీ షాప్‌

  • సింగపూర్‌లో మాదిరిగా లూజ్‌ గ్రావిటీ రైడింగ్స్‌

  • మరింత పొడవుగా రోప్‌వే

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపైమరిన్ని ఆకర్షణీయమైన ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఆసక్తి కలిగిన సంస్థల నుంచి వాటి నిర్మాణం, నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందులో ఎకో హైట్‌ కాటేజీలు, 360 డిగ్రీల కోణంలో తిరిగే రివాల్వింగ్‌ రెస్టారెంట్‌, కాఫీ షాపు, లూజ్‌ గ్రావిటీ రైడింగ్స్‌, కొత్త రోప్‌ వే ఉన్నాయి.

కైలాసగిరిపై సువిశాలమైన భూమి ఉన్నందున దానిని ఉపయోగించుకొని మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి పలు ప్రాజెక్టులు రూపొందించారు. ప్రస్తుతం కొండపైకి ఎవరైనా వెళ్లి కాసేపు సేదతీరి, వచ్చేయడమే జరుగుతోంది. అలా కాకుండా పర్యాటకులు రాత్రికి అక్కడే బస చేసేలా ‘ఎకో హైట్‌ కాటేజీలు’ నిర్మించనున్నారు. వాటిలో బస మరచిపోలేని అనుభూతిని ఇస్తుందని, సుమారు ఐదు నుంచి పది కాటేజీలు నిర్మించాలని యోచిస్తున్నారు.

కైలాసగిరి పైకి వెళ్లేవారు ఏమైనా తినాలంటే చిన్న చిన్న హోటళ్లు తప్పితే మంచి హోటల్‌ ఒక్కటి కూడా లేదు. ఆ లోటు తీరేలా 360 డిగ్రీల కోణంలో తిరిగే రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రతిపాదన చాలాకాలంగా ఉన్నా...ఇప్పుడు దీనిని కార్యరూపంలోకి తేవాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. అలాగే పర్యాటకులు సముద్రాన్ని చూస్తూ కొంతసేపు గడపాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ‘బే వ్యూ కాఫీ షాప్‌’ నిర్మాణం ప్రతిపాదించారు.

ప్రముఖ పర్యాటక దేశమైన సింగపూర్‌లో సెంటోసా ఐల్యాండ్‌లో ‘లూజ్‌ గ్రావిటీ రైడింగ్‌’ ప్రత్యేకమైనది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఇంటిల్లపాదీ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. గో కార్టింగ్‌ తరహాలో ఉండే ఈ రైడ్‌ భూమి ఆకర్షణ శక్తితో పనిచేస్తుంది. దాని కోసం ప్రత్యేక ట్రాక్‌ కూడా ఉంటుంది. దీనిని కైలాసగిరిపై పెట్టనున్నారు.

మరింత పొడవుగా రోప్‌వే

ప్రస్తుతం కైలాసగిరికి వెళ్లడానికి అప్పుఘర్‌ వద్ద రోప్‌ వే ఉంది. చాలా చిన్న పెట్టెలతో నడుపుతున్నారు. ప్రయాణ దూరం కూడా తక్కువే. దీని స్థానంలో కొత్త తరహా రోప్‌ వే ప్లాన్‌ చేశారు. సుమారు 1.5 కి.మీ. దూరం అందులో ప్రయాణించేలా...ఆ సమయంలో సముద్రం అందాలు కనువిందు చేసేలా ఆ మార్గాన్ని తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు స్థలం వద్దే కార్లు పార్కింగ్‌ చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఈ రోప్‌వేను విస్తరించడం వల్ల ఆ చివరనున్న తెలుగు మ్యూజియానికి కూడా సందర్శకులు పెరుగుతారని అధికారులు భావిస్తున్నారు.

అన్నింటికీ ఆర్‌పీఎఫ్‌లు పిలిచాం

ప్రణవ్‌ గోపాల్‌, ఛైర్మన్‌, వీఎంఆర్‌డీఏ

కైలాసగిరిని ప్రత్యేక ఆకర్షణగా మార్చాలనేది సీఎం చంద్రబాబునాయుడు ఆదేశం. ఆ మేరకు కమిషనర్‌ విశ్వనాథన్‌తో చర్చించి ఈ ప్రాజెక్టులు అన్నింటికీ రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ ఆహ్వానించాం. వీటిని వీలైనంత త్వరగా నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని యత్నిస్తున్నాం.

Updated Date - Jul 13 , 2025 | 01:01 AM