నక్కపల్లి ఆస్పత్రికి నూతన హంగులు
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:48 AM
నక్కపల్లిలోని 50 పడకల ఆస్పత్రికి వచ్చే రోగులకు త్వరలో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ప్రభుత్వం, కొన్ని సంస్థలు నక్కపల్లి ఆస్పత్రికి అత్యాధునికమైన రూ.కోటి విలువైన వైద్య పరికరాలను సమకూర్చాయి. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత త్వరలో వీటిని ప్రారంభించనున్నారు.
రోగులకు త్వరలో అందుబాటులోకి రానున్న మరిన్ని మెరుగైన సేవలు
సమకూరిన రూ.కోటి విలువైన పరికరాలు
రోగుల బెడ్‌ల వద్ద ఆక్సిజన్ యూనిట్లు
ఆర్థోపెడిక్ ఆపరేషన్లకు సీ-ఆర్మ్ మిషన్
త్వరలో ప్రారిభించనున్న హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
నక్కపల్లి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లిలోని 50 పడకల ఆస్పత్రికి వచ్చే రోగులకు త్వరలో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ప్రభుత్వం, కొన్ని సంస్థలు నక్కపల్లి ఆస్పత్రికి అత్యాధునికమైన రూ.కోటి విలువైన వైద్య పరికరాలను సమకూర్చాయి. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత త్వరలో వీటిని ప్రారంభించనున్నారు.
నక్కపల్లి కమ్యూనిటి హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ప్రస్తుతం కాలం చెల్లిన పాత ఎక్స్‌రే మిషన్ ఉంది. ఇది తరచూ మరమ్మతులకు గురవుతోంది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి ఆస్పత్రికి ఎక్స్‌రే యూనిట్ అవసరమని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా సుమారు రూ.50 లక్షల విలువైన 300 ఎం.ఎ. సామర్థ్యం గల అధునాతమైన ఎక్స్‌రే ప్లాంటును ప్రభుత్వం సమకూర్చింది. ప్రస్తుతం ఈ పరికరం ఇక్కడి ఆస్పత్రికి చేరుకుంది. ఈ పరికరాన్ని పూర్తి స్థాయిలో అమర్చేందుకు హైదరాబాద్ నుంచి టెక్నికల్ టీమ్ రావాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సీ-ఆర్మ్ మిషన్‌తో ఆర్థో సేవలు
నక్కపల్లి 50 పడకల ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సేవలకు గాను గత ఏడాది డాక్టర్ రవి కిరణ్‌కు ఉత్తమ సేవా పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో ఆర్థోపెడిక్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. గత ఏడాది జూలైలోనే అతి తక్కువ రోజుల్లో 30 ఆపరేషన్లు చేసి రాష్ట్రంలోనే నక్కపల్లి సీహెచ్‌సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆర్థో సేవలను మరింత విస్తృతపరిచేందుకు ప్రభుత్వం సుమారు రూ.20 లక్షల విలువైన సీ-ఆర్మ్ మిషన్‌ను సమకూర్చింది. ఆర్థోపెడిక్ ఆపరేషన్లు చేసేటప్పుడు నేరుగా మోనిటర్‌లో రోగుల శరీరంలో అంతర్గత అవయవాలను చూస్తూ శస్త్రచికిత్సచేసే అవకాశం కలుగుతుంది.
52 కనెక్షన్లతో ఆక్సిజన్ ప్లాంట్
సీహెచ్‌సీకి విచ్చేసే రోగులు అత్యవసర సమయంలో ఆక్సిజన్ లేక ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను సుమారు 52 కనెక్షన్లతో అధునాతనమైన ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న అన్ని వార్డుల్లో పేషెంట్లు ఉండే బెడ్‌ల వద్ద ఇప్పటికే ఆక్సిజన్ కనెక్షన్లను ఇచ్చారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఒక షెడ్డును కూడా నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయిన వెంటనే ఆక్సిజన్ సరఫరా ప్రతీ రోగి బెడ్ వద్దకు ఏర్పాట్లు చేస్తారు. ఈ సదుపాయాన్ని సుమారు రూ.15 లక్షల వ్యయంతో డెక్కన్ పరిశ్రమ కల్పిస్తోంది.
అదేవిధంగా స్థానిక హెటెరో ఔషధ పరిశ్రమ కూడా మరో రూ.15 లక్షల వ్యయంతో అధునాతనమైన ఈఎన్‌టీ పరికరాలను, ఆస్పత్రికి అవసరమైన పెయింటింగ్‌లను సమకూర్చింది. ఈ పెయింటింగ్‌లు చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాక హెటెరో ఔషధ పరిశ్రమ 30కేవీ జనరేటర్‌ను కూడా ఆస్పత్రికి అందజేయనున్నట్టు టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్ తెలిపారు. త్వరలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత నక్కపల్లి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొత్త పరికరాలను, ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభిస్తారని ఆయననాన్నరు.
రోగులకు మరిన్ని మెరుగైన సేవలు
-డాక్టర్ శిరీషా, సూపరింటెండెంట్
నక్కపల్లి సీహెచ్‌సీలో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన పరికరాల వల్ల అత్యవసర సమయాల్లో రోగులకు సకాలంలో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతుంది. ఎక్స్‌రే ప్లాంట్, సీ-ఆర్మ్ పరికరాలకు సంబంధించి టెక్నికల్ సిబ్బంది వచ్చి కనెక్షన్లు, తదితక ఏర్పాట్లు చేయాలి. ఆక్సిజన్ ప్లాంట్ ఆస్పత్రికి సొంతంగా ఉండడం వల్ల రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
Updated Date - Jul 13 , 2025 | 12:48 AM