అందుబాటులోకి రానున్న రాగి నూతన వంగడాలు
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:41 PM
గిరిజన రైతులు నూతన రాగి వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కార్యాచరణ ప్రారంభించారు. అత్యధిక దిగుబడి, మెండైన పోషక విలువలు కలిగిన ‘ఇంద్రావతి’ ‘వేగావతి’ వంగడాలపై అధ్యయనం చేస్తున్నారు. దిగుబడి, నాణ్యత ఆధారంగా వచ్చే ఏడాది రైతులకు మినీ కిట్స్ రూపంలో విత్తనాలను పంపిణీ చేయనున్నారు.
వేగావతి, ఇంద్రావతిలపై శాస్త్రవేత్తలు అధ్యయనం
అధిక దిగుబడి, మెండైన పోషక విలువలు
వచ్చే ఏడాదికి రైతులకు మినీ కిట్స్
చింతపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈఏడాది మే 19న పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన పరిశోధన, విస్తరణ సలహామండలి (జెడ్‌ఆర్‌ఈఏసీ) సమావేశంలో గిరిజన రైతులకు రాగిలో నూతన వంగడాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇంద్రావతి, వేగవతిలపై తుదిదశ పరిశోధనలు నిర్వహించాలని శాస్త్రవేత్తలు తీర్మానించారు. ఈమేరకు రాగి సాగును గిరిజన ప్రాంతంలో విస్తరించేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో రాగి పంటను 18,176 హెక్టార్లలో ఆదివాసీ రైతులు సాగుచేస్తున్నారు. పదేళ్ల క్రితం 25వేల హెక్టార్లలో రాగి పంటను సాగుచేసేవారు. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేక, దేశవాళి రకాలతో అధిక దిగుబడులు రాకపోవడంతో కాలక్రమంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. దీంతో గిరిజన ప్రాంతంలో రాగి సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నాణ్యమైన ‘ఇంద్రావతి’ ‘వేగావతి’ విత్తనాలను పరిచయం చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
ఇంద్రావతి, వేగావతిల ప్రత్యేకతలు
ఇంద్రావతి, వేగవతి వంగడాలను విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ వంగడాలపై వివిధ పరీక్షలు నిర్వహించి నాట్లుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంద్రావతి, వేగావతిలపై చింతపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలోనూ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపట్టి ఉత్తమ ఫలితాలు సాధించారు. 115-120 రోజుల్లో పంట చేతికొస్తాయి. ఎకరాకు 14-15 క్వింటాళ్ల దిగుబడి వస్తాయి. ప్రధానంగా రాగి పంటలో ఎదురయ్యే అగ్గితెగులు సమస్యను తట్టుకుంటాయి. మార్కెట్‌లో రాగి ఆహార ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఈనేపఽథ్యంలో రాగి సాగుచేసే రైతులకు అధిక ధర లభించనున్నది.
తుది దశ పరిశోధనలు
ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇంద్రావతి, వేగావతిలపై తుదిదశ పరిశోధనలు నిర్వహించనున్నారు. ఈ రెండు రకాల విత్తనాల దిగుబడి, నాణ్యతపై అధ్యయనం చేస్తారు. ఈ రెండు రకాలు గిరిజన ప్రాంతానికి అనువైనవిగా శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. వచ్చే ఏడాది ఈ రెండు వంగడాలను రైతులకు మినీ కిట్స్ రూపంలో అందజేస్తారు. అలాగే విత్తనం అధిక సంఖ్యలో రైతులకు అందజేసేందుకు విత్తనోత్పత్తి చేపట్టనున్నారు.
చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి, ఏడీఆర్,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి.
గిరిజన ప్రాంతంలో చిరుధాన్యాల సాగుని ప్రోత్సహిస్తున్నాం. ఆదివాసీ రైతులు వరి తరువాత రాగిని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. రైతులకు నాణ్యమైన వంగడాలను అందుబాటులోకి తీసుకొని రావాలని ఇంద్రావతి, వేగావతి రకాలపై అధ్యయనం చేస్తున్నాం. పరిశోధన ఫలితాలు ఆధారంగా రైతులకు మినీ కిట్స్ రూపంలో అందజేస్తాం. రాగి సాగులో రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించాలి. గుళి రాగి పద్ధతిలో సాగు చేపడితే రెట్టింపు దిగుబడులు వస్తాయి. ప్రభుత్వం గుళి రాగిసాగును ప్రోత్సహిస్తుంది.
Updated Date - Jul 06 , 2025 | 11:41 PM