కొరపర్తికి కొత్త కళ
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:39 PM
మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ కొరపర్తి గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేవు. ఎన్నో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న వారికి తాజాగా అభివృద్ధి పనులు జోరుగా సాగుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తమ సమస్యలను ఎంతో ఓపిగ్గా విని పరిష్కారం చూపారని సంబరపడుతున్నారు.
గ్రామంలో జోరుగా అభివృద్ధి పనులు
గత ఏడాది డిసెంబరులో గ్రామాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరాయని విన్నవించుకున్న గ్రామస్థులు
బాగు చేయిస్తానని హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి
మర్నాడే పరిశీలించి నివేదిక అందజేసిన అధికారులు
వెంటనే నిధులు విడుదల
శరవేగంగా పనులు
ఆనందం వ్యక్తం చేస్తున్న గిరిజనులు
అనంతగిరి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ కొరపర్తి గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేవు. ఎన్నో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న వారికి తాజాగా అభివృద్ధి పనులు జోరుగా సాగుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తమ సమస్యలను ఎంతో ఓపిగ్గా విని పరిష్కారం చూపారని సంబరపడుతున్నారు.
మండలంలోని పినకోట పంచాయతీ బల్లగరువు గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గత ఏడాది డిసెంబరు 21న వచ్చారు. ఆ రోజు సాయంత్రం తిరుగు ప్రయాణమవుతుండగా మార్గమధ్యంలో కొరపర్తి గ్రామస్థులు తన రాక కోసం వేచి ఉండడం చూసి ఆగారు. ఆ గ్రామానికి చెందిన గిరిజన మహిళలు ఆయనకు హారతి పట్టి సాదరంగా ఆహ్వానించారు. తమ గ్రామంలోని సమస్యలను విన్నవించుకున్నారు. పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, తమ పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాటిని ఆయన స్వయంగా పరిశీలించారు. వాటిని బాగు చేయిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఆయన వెళ్లిన మరుసటి రోజే అధికారులను కొరపర్తికి పంపించి, పాఠశాల, అంగన్‌వాడీ భవనాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు వాటిని పరిశీలించి నివేదిక సమర్పించారు. దీంతో ఆయన ఆ గ్రామానికి నిధులు విడుదల చేయించారు. ప్రస్తుతం పనులు జోరుగా సాగుతుండడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొరపర్తికి కేటాయించిన నిధులు
- పాఠశాల మరమ్మతులు, తాగునీటి సదుపాయం కోసం రూ.10 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం 60 శాతం వరకు పనులు పూర్తయ్యాయి.
- పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి.
- అంగన్‌వాడీ కేంద్రానికి నూతన భవనం మంజూరు చేశారు. దీనికి రూ.8 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం శ్లాబ్ పూర్తికాగా మిగతా పనులు జరుగుతున్నాయి. అలాగే అంగన్‌వాడీ కేంద్రం భవనానికి రూ.15 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.5 లక్షలు కేటాయించారు.
- గ్రామానికి సుమారు 160 మీటర్ల మేర జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించనున్నారు.
Updated Date - Jun 26 , 2025 | 11:39 PM