కేజీహెచ్‌లో నెఫ్రాలజీ పీజీ సీట్లకు ముప్పు?
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:36 AM
నిరుపేదల పెద్దాస్పత్రి కేజీహెచ్‌లోని నెఫ్రాలజీ విభాగంలో పీజీ సీట్లు ప్రమాదంలో పడ్డాయి.
ప్రొఫెసర్ బదిలీతో రద్దు ప్రమాదం
మూడేళ్లుగా అసోసియేట్ పోస్టు ఖాళీ
విభాగానికి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లే దిక్కు
ఉన్నతాధికారుల దృష్టికి సమస్య
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
నిరుపేదల పెద్దాస్పత్రి కేజీహెచ్‌లోని నెఫ్రాలజీ విభాగంలో పీజీ సీట్లు ప్రమాదంలో పడ్డాయి. ఈ విభాగానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏడాదికి మూడు పీజీ సీట్లను మంజూరుచేసింది. ఇవి కొనసాగాలంటే ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఉండాలి. తాజాగా చేపట్టిన వైద్యుల బదిలీల్లో ఇక్కడి సీనియర్ ప్రొఫెసర్ కు బదిలీ అయింది. అయితే ఆ స్థానంలో ఎవరూ రాలేదు. మరోవైపు మూడేళ్లుగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు ఈ పోస్టుల వివరాలను తీసుకుంటుంది. ఖాళీ పోస్టుల వివరాలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళితే కేటాయించిన మూడు పీజీ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఏడాదికి మూడు చొప్పున మూడేళ్లకు 12 సీట్లను విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని, ఇది ఈ విభాగంలోని వైద్యసేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ విభాగంలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లే వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. ఓపీ, ఐపీ సేవలతో పాటు అవసరమైన శస్త్రచికిత్సలను నిర్వహించాల్సి వస్తోంది. ఈ విభాగానికి ప్రతిరోజూ 250 మంది వరకు రోగులు వస్తుంటారు. ఇన్‌పేషెంట్లుగా మరో 60 మంది ఉన్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో 20 మంది డయాలసిస్ చేయించుకుంటారు. ప్రైవేటు సంస్థ 100 మందికి డయాలసిస్ చేస్తుంది. వీటన్నింటినీ ఈ విభాగానికి చెందిన వైద్యులే పర్యవేక్షించాలి. తాజాగా ప్రొఫెసర్ పోస్టు ఖాళీతో పీజీ సీట్లకు గండం పొంచి ఉండగా, రోగులకు అందించే వైద్య సేవలపైనా ప్రభావం పడుతోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవిని వివరణ కోరగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, పదోన్నతుల తరువాత ప్రొఫెసర్ పోస్టును భర్తీచేసే అవకాశం ఉందన్నారు.
నేడు కలెక్టరేట్, జీవీఎంసీలో పీజీఆర్‌ఎస్
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందదిరంలో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిన కాల్‌సెంటర్ 1100 నంబరుకు సంప్రదించి వినతులను నమోదు చేసుకోవచ్చన్నారు. అధికారులంతా నిర్ణీత సమయానికి కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. కాగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత కౌన్సిల్‌హాల్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తామని మేయర్ పీలాశ్రీనివాసరావు, కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు.
పోలీసుల నాకాబందీ
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
నగరంలో గంజాయి రవాణాకు అడ్డుకట్టవేసేందుకు సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశాల మేరకు శనివారం రాత్రి నాకా బందీ నిర్వహించారు. నగరంలోని పోలీసులు 48 బృందాలుగా ఏర్పడి 48 ముఖ్య కూడళ్లలో ఆకస్మికంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా 115 వాహనాలను తనిఖీ చేయగా 60 ద్విచక్రవాహనదారులు హె ల్మెట్ ధరించకపోవడం, 16 వాహనాలకు నంబరు ప్లేట్లు సరిగా లేకపోవడం, మూడు ద్విచక్రవాహనాలపై ట్రిపుల్‌రైడింగ్, 12 మంది సెల్‌ఫోన్ డ్రైవింగ్, మరో 19 వాహనాలపై వివిధ కారణాలతో కేసులు నమోదుచేశారు.
Updated Date - Jun 30 , 2025 | 12:36 AM