నాడు నిర్లక్ష్యం.. నేడు మోక్షం!
ABN, Publish Date - May 03 , 2025 | 12:46 AM
జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు రెండో దశలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పనులు ప్రారంభించి, అసంపూర్తిగా వదిలేసిన వాటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ‘స్కూల్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్’ పేరుతో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక రూపొందించింది. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం
నాడు-నేడు పేరుతో అసంపూర్తిగా వదిలేసిన గత వైసీపీ ప్రభుత్వం
పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పూర్తి చేయాలని ఆదేశం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు రెండో దశలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పనులు ప్రారంభించి, అసంపూర్తిగా వదిలేసిన వాటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ‘స్కూల్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్’ పేరుతో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక రూపొందించింది. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమం రెండో దశ కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వం 2023-24వ సంవత్సరంలో జిల్లాలో 604 పాఠశాలల్లో 988 పనులు చేపట్టేందుకు రూ.250 కోట్లు మంజూరు చేసింది. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, నీరు, విద్యుత్తు, ప్రహరీ గోడల నిర్మాణ పనులు చేపట్టారు. అయితే పేరెంట్స్ కమిటీల పేరుతో వైసీపీ నేతలే పనులు చేపట్టగా, ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేదు. దీంతో పనులు నత్తనడకన సాగాయి. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. గత వైసీపీ పాలనలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆయా పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ, సమగ్ర శిక్ష అధికారులు మండలాల వారీగా వివరాలు సేకరించారు. వైసీపీ అధికారంలో నుంచి దిగిపోయేనాటికి చేసిన పనుల విలువ రూ.131 కోట్లుగా అధికారులు తేల్చారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.119 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు.
పాఠశాలలు తెరిచే నాటికి పనులు పూర్తి
జిల్లాలోని పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం, ఇతర పనుల గురించి సమగ్ర శిక్షా విభాగం ఈఈ నరసింగరావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా.. అసంపూర్తి పనుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశామన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాగానే నిర్మాణ పనులు చేపటి, పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
Updated Date - May 03 , 2025 | 12:46 AM