మ్యూజియం పనులకు మళ్లీ బ్రేక్
ABN, Publish Date - Jun 03 , 2025 | 11:20 PM
లంబసింగి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులకు మళ్లీ బ్రేక్ పడింది. గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు తొలగించిన పాత కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కాంట్రాక్టర్‌కి స్టే జారీ చేసింది.
హైకోర్డును ఆశ్రయించిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పాత కాంట్రాక్టర్
స్టే జారీ చేసిన న్యాయస్థానం
పనులు నిలిపివేసిన ఇంజనీరింగ్ అధికారులు
చింతపల్లి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): లంబసింగి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులకు మళ్లీ బ్రేక్ పడింది. గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు తొలగించిన పాత కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కాంట్రాక్టర్‌కి స్టే జారీ చేసింది. దీంతో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులను నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను గడగడ వణికించిన ఆదివాసీ పోరాటయోధుల చరిత్ర భావితరాలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో రాష్ట్రానికి ‘గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం’ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మ్యూజియం నిర్మాణానికి రూ.35 కోట్లు కేటాయించగా, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.15 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లుగా ఒప్పందం కుదిరింది. లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి డెయిరీ ఫారం భూములు 22 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మ్యూజియం నిర్మాణ పనులను 2021 అక్టోబరు 8వ తేదీన ప్రారంభించారు. మ్యూజియం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా రూ.7.5 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పనులు ప్రారంభించారు. అయితే ఈ నిధులను గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో కాంట్రాక్టర్‌కి అందజేయకపోగా ఇతర అవసరాలకు వెచ్చించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాటాకు సంబంధించి ఒక్కపైసా నిధులు కూడా కేటాయించలేదు. దీంతో రెండేళ్లలో పూర్తి కావాల్సిన మ్యూజియం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
పనులు పునఃప్రారంభం
కూటమి ప్రభుత్వం గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను పది రోజుల క్రితం పునఃప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మూడు నెలల వ్యవధిలో గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్ రెండు సార్లు మ్యూజియం పనులను పరిశీలించారు. మ్యూజియం నిర్మాణాలకు నిధుల కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్య కార్యదర్శి స్పష్టం చేశారు. డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాగా మ్యూజియం నిర్మాణాలు తీవ్ర జాప్యం కావడంతో 2024 డిసెంబరులో గిరిజన సంక్షేమశాఖ పాత టెండర్‌ను రద్దు చేసి, కాంట్రాక్టర్‌ను తొలగించింది. దీంతో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు రెండో విడత టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. మ్యూజియం పనులు మొత్తం ఒకే కాంట్రాక్టర్‌కి అప్పగించకుండా మూడు విభాగాలుగా విభజించి టెండర్లను పిలిచారు. ప్రస్తుతం చేపట్టాల్సిన పనులకు సంబంధించి రెండు టెండర్లు ఖరారు చేసి, నిర్మాణ పనుల బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించారు.
న్యాయస్థానం ఆదేశాలతో నిలిచిపోయిన పనులు
హైకోర్టు ఆదేశాలతో మ్యూజియం నిర్మాణ పనులను గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు నిలిపివేశారు. గిరిజన సంక్షేమశాఖ తొలగించిన పాత కాంట్రాక్టర్ గత ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం, ఇసుక కొరత కారణంగా నిర్మాణం జాప్యమైందని, తాను చేపట్టిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి వుందని, తనను అన్యాయంగా నిర్మాణ బాధ్యతల నుంచి తప్పించారని న్యాయస్థానంలో దావా వేశారు. దీంతో న్యాయస్థానం స్టే జారీచేసి, విచారణ కొనసాగిస్తున్నది. మ్యూజియం నిర్మాణాలు కోర్టు పరిధిలో ఉండడంతో పనులు ఎప్పుడు పునఃప్రారంభిస్తామనే విషయం చెప్పలేమని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
Updated Date - Jun 03 , 2025 | 11:20 PM