ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అతి విశ్వాసమే కొంపముంచింది..

ABN, Publish Date - Apr 21 , 2025 | 12:46 AM

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె మేయర్‌ పీఠం నుంచి వైదొలిగారు.

  • వైసీపీ నేతల తీరుపై ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి

  • కౌన్సిల్‌లో బలం తగ్గిందని తెలిసినా మొండిగా వ్యవహరించారని విమర్శలు

  • మేయర్‌తో స్వచ్ఛందంగా రాజీనామా చేయిస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు

  • అవిశ్వాసం నెగ్గడంతో మౌనం దాల్చారని ఆగ్రహం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె మేయర్‌ పీఠం నుంచి వైదొలిగారు. దీంతో మేయర్‌ పీఠం కూటమి వశం కానున్నది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లలో 27 మంది మంది, ఇండిపెండెంట్లలో నలుగురు కూటమిలో చేరడంతో కౌన్సిల్‌లో వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోయింది. ఈ విషయం తెలిసి కూడా కూటమి నేతలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందనే భ్రమలో తమ పార్టీ నేతలు పడ్డారని వైసీపీకి చెందిన పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మేయర్‌తో స్వచ్ఛందంగా రాజీనామా చేయించకుండా మొండిగా వ్యవహరించి చివరకు పార్టీ పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాపరిణామంతో వైసీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి.

నాలుగేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 58 వార్డులను గెలుచుకోవడంతో పాటు ఇండిపెండెంట్లుగా గెలిచిన నలుగురు కార్పొరేటర్ల మద్దతుతో మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారిని ఎంపిక చేసింది. అప్పటినుంచి జీవీఎంసీలో వైసీపీ నేతల హవాయే నడుస్తూ వచ్చింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జీవీఎంసీలో పరిణామాలు శరవేగంగా మారసాగాయి. ఇండిపెండెంట్లుగా గెలిచిన నలుగురిలో ఇద్దరు టీడీపీలోచేరగా, మరో ఇద్దరు జనసేనలో చేరిపోయారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన 27 మంది కూడా టీడీపీ, జనసేన కూటికి చేరారు. దీంతో కౌన్సిల్‌లో కూటమి బలం 63కి చేరగా, వైసీపీ బలం 32కి తగ్గిపోయింది. అదే సమయంలో జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లను కూటమి పార్టీలే గెలుచుకోవడంతో ఎక్స్‌ అఫీషియో సభ్యుల హోదాలో 11 స్థానాలు కూటమికి పెరగడంతో గ్రేటర్‌లో కూటమి బలం 74కి పెరిగింది. అంటే మొత్తం 111 మంది సభ్యులు కలిగిన కౌన్సిల్‌లో కూటమికి 2/3 వంతు ఆధిక్యం దక్కినట్టయింది. ఈ మేరకు స్పష్టమైన సంఖ్యాబలం ఉండడంతో కూటమి నేతలు జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోరుతూ గత నెల 22న జిల్లా కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. దీనిని పరిశీలించిన

కలెక్టర్‌ ఈ నెల 20న మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికే కూటమికి 72 మంది సభ్యుల బలం ఉండడంతో కేవలం మరో ఇద్దరు సభ్యులు మద్దతు మాత్రమే అవసరం. వైసీపీలో అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లతో పాటు వ్యాపార ప్రయోజనాల కోసం వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరే యోచనలో ఉన్న కార్పొరేటర్లు కొందరు ఉన్నారు. దీంతో మరో ఇద్దరు కార్పొరేటర్ల బలం సాధించడం కూటమికి పెద్ద కష్టమేమీ కాదని కూటమి నేతలతో పాటు వైసీపీన ేతలు కూడా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తమ పార్టీలో ఉన్నవారెవరూ బయటకు వెళ్లరని, పైగా ఇటీవల కూటమి పార్టీల్లో చేరిన వారిలో కొందరు మళ్లీ వెనక్కి వచ్చేస్తారంటూ.. అవిశ్వాసం నెగ్గదని వైసీపీలో కొందరు ముఖ్య నేతలు భ్రమించారు. దీంతో గతనెల 23న కార్పొరేటర్లు, నేతలతో భ్రమలో ఉన్న ముఖ్య నేతలు సమావేశం పెట్టి తమ కార్పొరేటర్లందరినీ క్యాంప్‌ పేరుతో బెంగళూరు, శ్రీలంక తరలించాలని ఆదేశించారు. ఇందుకోసం అయ్యే ఖర్చును మేయర్‌, డిప్యూటీ మేయర్లతో పాటు ఫ్లోర్‌ లీడర్‌ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. అదే సమయంలో ముఖ్య నేతల అభిప్రాయాలపై కొందరు నాయకులు, కార్పొరేటర్లు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌన్సిల్‌లో కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉందని, ఒకరిద్దరిని సంపాదించుకోవడం వారికి పెద్ద ఇబ్బంది కాదని వివరించినట్టు సమాచారం. అంతేకాకుండా తమతోపాటు సమావేశానికి రాని వారిలో కొందరు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని, మరికొందరు వ్యాపార ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా ఉంటూ ఇతర పార్టీల వైపు చూస్తున్నందున వారిలో ఎవరో ఒకరు ఎంత అడ్డుకున్నా కూటమిలో చేరిపోవడం ఖాయమని స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. అయినప్పటికీ ముఖ్య నేతలు మాత్రం అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు తమ వద్ద కార్యాచరణ ఉందని, మేయర్‌తో స్వచ్ఛందంగా రాజీనామా చేయిస్తే అనవసరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌ను కోల్పోయినట్టవుతుందని దబాయించినట్టు సమాచారం. దీంతో వారంతా చేసేది లేక గతనెల 24న క్యాంప్‌ శిబిరానికి తరలిపోయారు.

తాజా పరిణామంతో మౌనవ్రతం..

మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారిపై కూటమి నేతలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శనివారం 2/3 వంతు మెజారిటీతో నెగ్గడంతో వైసీపీలో ఆదినుంచి అవిశ్వాస తీర్మానంపై ముందుకు వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్న వారికి అవకాశంగా మారింది. కౌన్సిల్‌లో తమ పార్టీ బలం తగ్గిపోయిందని, కూటమి అవిశ్వాసం పెట్టడంతో ఎలాగైనా మేయర్‌ పదవిని కోల్పోవలసి వస్తుంది కాబట్టి ప్రత్యేక సమావేశానికి ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే మంచిదని తాము గగ్గోలు పెట్టినా కొందరు నేతలు మొండిగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలం లేకపోయినా పదవి కోసం చివరి వరకు వేలాడామన్న అప్రతిష్ట ప్రజల్లో మూటగట్టుకోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాకాకుండా అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చిన తర్వాత, కౌన్సిల్‌ సమావేశం జరగడానికి ముందు స్వచ్ఛందంగా మేయర్‌ రాజీనామా చేసి ఉంటే ప్రజల్లో సానుభూతి పెరిగేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు అవిశ్వాసం వీగిపోతుందంటూ ఊహల్లో ఊరేగుతూ గొంతు చీల్చుకుని స్టేట్‌మెంట్లు ఇచ్చిన నేతలు ఇప్పుడు మౌనం దాల్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కార్పొరేటర్లను పశువుల్లా కొనుగోలు చేశారంటూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా ప్రజలు హర్షించే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:46 AM