చినకలవలాపల్లిలో వడ్డీ వ్యాపారి హత్య
ABN, Publish Date - Apr 22 , 2025 | 01:35 AM
మండలంలోని చినకలవలాపల్లిలో వడ్డీ వ్యాపారి ఒకరు హత్యకు గురయ్యాడు.
రాత్రి మేడపై నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి
తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో మృతి
రాంబిల్లి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని చినకలవలాపల్లిలో వడ్డీ వ్యాపారి ఒకరు హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి మేడపై నిద్రించడానికి వెళ్లిన ఆయన సోమవారం ఉదయం తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడివున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడి వుంటారని పోలీసు భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ నరసింగరావు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
చినకలవలాపల్లికి చెందిన జల్లి తాతారావు (65) స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలకు గతంలోనే వివాహాలు అయ్యాయి. భార్యతో మనస్పర్థలు రావడంతో ఆమె ప్రస్తుతం రాజమహేంద్రవరంలో వుంటున్నది. ఇక్కడ తాతారావు ఒక్కడే నివాసం వుంటున్నాడు. ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం ఇంటి మేడపైకి వెళ్లి పడుకున్నాడు. సోమవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కేబుల్ టీవీ సిబ్బంది కేబుల్ సరిచేసేందుకు తాతారావు ఇంటి మేడపైకి ఎక్కారు. అక్కడ రక్తపుమడుగులో విగతజీవిగా పడివున్న తాతారావును చూసి కుటుంబ సభ్యుకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరసింగరావు, ఎస్‌ఐ నాగేంద్ర, సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లారు. తాతారావు మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని వాకబు చేశారు. తరువాత పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ సంఘటనా స్ధలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్‌టీమ్, డాక్‌స్క్వాడ్ వచ్చి పలు ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఆదివారం రాత్రి తన ఇంటి మేడపై పడుకొన్న తాతారావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడన్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం తాతారావుది హత్యగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. తాతారావు కుమారుడు జల్లి అప్పలరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
Updated Date - Apr 22 , 2025 | 01:35 AM