మలేరియా పోస్టుల కోసం ఎమ్మెల్యేలు పేచీ
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:53 AM
నగరంలో దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు జీవీఎంసీ అధికారులు చేపట్టిన మలేరియా కార్మికుల పోస్టుల భర్తీ ప్రక్రియ కొందరు ఎమ్మెల్యేల కారణంగా ముందుకుసాగడం లేదు.
తాత్కాలిక ప్రాతిపదికన 434 మందిని తీసుకునేందుకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం
ఎమ్మెల్యేకి పది, కార్పొరేటర్‌కు మూడు చొప్పున కేటాయించిన మేయర్
తమకు 40 పోస్టులు కావాలంటూ కొందరు ఎమ్మెల్యేల పట్టు
జాబితా తయారుచేసి మేయర్‌కు అందజేత
ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు జీవీఎంసీ అధికారులు చేపట్టిన మలేరియా కార్మికుల పోస్టుల భర్తీ ప్రక్రియ కొందరు ఎమ్మెల్యేల కారణంగా ముందుకుసాగడం లేదు. ఐదు నెలల కాలానికి 434 మంది కార్మికులను నియమించుకోవాలని భావించిన అధికారులు ఇటీవల కౌన్సిల్ అనుమతి తీసుకున్నారు. ఆయా పోస్టులను మేయర్ పీలా శ్రీనివాసరావు ఒక్కో కార్పొరేటర్‌కు మూడేసి, ఎమ్మెల్యేలకు పదేసి చొప్పున కేటాయించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు తమకు 40కిపైగా పోస్టులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండడంతో ప్రజారోగ్య విభాగం అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ సీజన్‌లో వర్షాల వల్ల పారిశుధ్య నిర్వహణ పనులకు అంతరాయం కలగడం, నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతాయి. అందుకే సాధారణంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి దోమల లార్వాలను గుర్తించడం, వాటిని నిర్వీర్యం చేయడం, దోమలు వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు డ్రై డే పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను ఏటా మలేరియా విభాగంలో తాత్కాలిక కార్మికులను (ఐదు నెలల వ్యవధికి) తీసుకుంటారు. వారికి నెలకు రూ.15 వేలు ఇస్తారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా జీతాలు చెల్లిస్తుంటారు. ఈ ఏడాది కూడా మలేరియా విభాగంలో దోమల వ్యాప్తి నియంత్రణకు 434 మంది కార్మికులను నియమించుకోవాల్సి ఉంటుందని ప్రజారోగ్య విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అందుకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆమోదం తెలిపారు. గతంలో పనిచేసిన కార్మికులను తిరిగి తీసుకోవాలని అధికారులు భావించగా, కొంతమంది కార్పొరేటర్లు తమ వార్డులో తాము సూచించిన వారికే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో మేయర్ పీలా శ్రీనివాసరావు...ఒక్కో కార్పొరేటర్‌కు మూడేసి, ఎమ్మెల్యేలకు పదేసి పోస్టుల చొప్పున పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తమ కోటాలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే జాబితాను ప్రజారోగ్య విభాగం అధికారులకు అందజేయాలని ఆయా జోన్‌ల ఏఎంహెచ్‌ఓల ద్వారా సమాచారం పంపించారు. కొంతమంది కార్పొరేటర్లు తమ వంతుగా ముగ్గురు పేర్లను పంపించేయడంతో వారంతా ఈనెల ఒకటి నుంచి విధుల్లో చేరిపోయారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ కోటాలో ఎవరిని నియమించాలనేది సూచిస్తూ జాబితాలను పంపించేశారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మాత్రం తమకు కేటాయించిన పోస్టులు సరిపోవని, తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది కాబట్టి కోటాను పెంచాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కార్పొరేటర్లకు ఏదోలా నచ్చజెప్పిన అధికారులు, ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎదురు మాట్లాడలేకపోతున్నారు. ఒక ఎమ్మెల్యే 43 మంది పేర్లతో జాబితాను మేయర్‌తోపాటు ప్రజారోగ్య విభాగం అధికారులకు పంపించారు. మరో ఎమ్మెల్యే 32 మందితో, ఇంకో ఎమ్మెల్యే 28 మందితో కూడిన జాబితాలను అధికారులకు పంపించారు. వారందరికీ అవకాశం కల్పించలేమని అధికారులు అంటున్నారు. అలాగని ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయకపోతే తమ పోస్టింగ్‌కు ఎక్కడ ముప్పువస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైపోయినా సరే మలేరియా కార్మికుల సేవలను అందుబాటులోకి తెచ్చుకోలేకపోతున్నామని, దీని ప్రభావం జ్వరాల వ్యాప్తిపై పడుతుందని అధికారులు పేర్కొంటుండడం విశేషం. ఐదు నెలలు మాత్రమే పనిచేసే తాత్కాలిక కార్మికుల పోస్టుల కోసం ఇంతగా పంతాలకు పోవడం ఎమ్మెల్యేలకు సరికాదని, నగరవాసుల ఆరోగ్యాన్ని దృషిలో పెట్టుకుని వీలైనంత వేగంగా కార్మికులను తీసుకునేందుకు సహకరించాలని కోరుతున్నారు.
Updated Date - Jul 02 , 2025 | 12:53 AM