నేడు మంత్రి లోకేశ్ రాక
ABN, Publish Date - Jun 09 , 2025 | 01:07 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకుగాను సోమవారం విశాఖ రానున్నారు.
రేపటి సీఎం చంద్రబాబు పర్యటన రద్దు
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకుగాను సోమవారం విశాఖ రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 8.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో పార్వతీపురం వెళతారు. అక్కడ జరిగే పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవలో పాల్గొంటారు. స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి పది గంటలకు విశాఖ చేరుకుంటారు. ఇక్కడ టీడీపీ కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. పదో తేదీ ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి, పితృవియోగం కలిగిన ఆయనను పరామర్శిస్తారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని యోగాంధ్రపై సమీక్ష నిర్వహించి, మధ్యాహ్నం ఒంటిగంటకు విజయవాడ బయలుదేరి వెళతారు.
రేపటి సీఎం పర్యటన రద్దు
విశాఖలో ఈ నెల 10వ తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన రద్దయ్యింది. అయితే ఈ నెల 13న మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం ఇక్కడకు వస్తారని సమాచారం. ఈ పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
నేడు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చిచిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పేరిట సోమవారం ఉదయం పది గంటలకు ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ హాలులో అవార్డులు ప్రదానం చేయనున్నారు. పదో తరగతిలో 83 మందికి, ఇంటర్మీడియట్‌లో 38 మందికి అవార్డులు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోల శ్రీబాలవీరాంజనేయస్వామి ముఖ్యఅతిథిగా హాజరవుతారని కలెక్టర్ హరేంధిరప్రసాద్ తెలిపారు.
కేజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాణి
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఐ.వాణి పదోన్నతి పొందారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రా మెడికల్ కాలేజీలో సీనియర్ ప్రొఫెసర్‌గా, గైనకాలజీ విభాగాధిపతిగా ఆమె పనిచేస్తున్నారు. కొన్నాళ్ల కిందట జరిగిన అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్స్‌లో ఏడీఎంఈగా పదోన్నతి పొందిన ఆమె తాజాగా కేజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. గత ఏడాదిన్నరగా ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ శివానంద వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి పూర్తి స్థాయి సూపరింటెండెంట్‌ను ఆరోగ్యశాఖ నియమించింది. సోమవారం బాధ్యతలు స్వీకరించేందుకు డాక్టర్ వాణి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేజీహెచ్‌కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కేజీహెచ్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
నేడు ఏయూ పాలక మండలి సమావేశం
కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రా యూనివర్సిటీ పాలక మండలి సమావేశం సోమవారం జరగనున్నది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ప్రధానంగా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) ప్రమోషన్స్‌తో పాటు పలు విభాగాలకు కంప్యూటర్ల కొనుగోలు, వర్సిటీలో కొన్ని మార్పులకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఆఫ్‌లైన్, వర్చువల్ విధానంలో సభ్యులు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి సభ్యులకు ఇప్పటికే సమాచారాన్ని వర్సిటీ అధికారులు అందజేశారు.
ఇదిలావుండగా ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండలిపై వర్సిటీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావచ్చింది. ఇప్పటికీ ఏయూకు నూతన పాలక మండలిని ఏర్పాటు చేయలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి సభ్యులతోనే సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో చర్చించే అంశాలు, తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన సమాచారం బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Updated Date - Jun 09 , 2025 | 01:07 AM