ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లేటరైట్‌ తవ్వకాలకు మైనింగ్‌ మాఫియా సన్నద్ధం

ABN, Publish Date - May 01 , 2025 | 11:07 PM

గిరిజన ప్రాంతంలో లేటరైట్‌ తవ్వకాలకు మైనింగ్‌ మాఫియా సన్నద్ధమవుతున్నది. కొంతకాలంగా గూడెంకొత్తవీధి మండలంలో పాగా వేసిన మైనింగ్‌ మాఫియా ఓ అడుగు ముందుకు వేసింది.

చాపరాతిపాలెం లేటరైట్‌ క్వారీ

డోకులూరు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ రేపు

సర్పంచ్‌, పెసా కమిటీ, స్థానిక ప్రజలు అంగీకరిస్తే తవ్వకాలకు అనుమతులు

అడ్డుకునేందుకు ఆదివాసీ సంఘ నాయకుల ప్రయత్నం

మైనింగ్‌ కోసం జతకట్టిన టీడీపీ, వైసీపీ నేతలు

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో లేటరైట్‌ తవ్వకాలకు మైనింగ్‌ మాఫియా సన్నద్ధమవుతున్నది. కొంతకాలంగా గూడెంకొత్తవీధి మండలంలో పాగా వేసిన మైనింగ్‌ మాఫియా ఓ అడుగు ముందుకు వేసింది. పెదవలస పంచాయతీ డోకులూరు గ్రామంలో లేటరైట్‌ గనుల తవ్వకాల లీజు పొందేందుకు ఓ బినామీ గిరిజనుడితో గనులశాఖకు దరఖాస్తు చేయించింది. లేటరైట్‌ తవ్వకాల కోసం వైసీపీ నేతలతో జతకట్టిన టీడీపీ నేతలు పైస్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించడంతో గనులశాఖ ప్రజాభిప్రాయ సేకరణ(పబ్లిక్‌ హియరింగ్‌) కోసం పంపించింది. ఈ మేరకు శనివారం కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ డోకులూరు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. పంచాయతీ సర్పంచ్‌, పెసా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు అంగీకారం తెలిపితే తవ్వకాలకు మార్గం సుగమమైనట్టే. ఇప్పటికే మైనింగ్‌ మాఫియా ప్రజాభిప్రాయ సేకరణలో తమకు అనుకూలంగా ప్రజలతో చెప్పించుకునేందుకు నాయకులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే భారత ఆదివాసీ పార్టీ, ఆదివాసీ సంఘాల నాయకులు ప్రజాభిప్రాయ సేకరణలో మైనింగ్‌ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలతో చెప్పించాలని ప్రయత్నిస్తున్నారు.

పాడేరు రెవెన్యూ డివిజన్‌లో బాక్సైట్‌ పోలిన విలువైన లేటరైట్‌ గనులు గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలంలో మాత్రమే ఉన్నాయి. దీంతో మైనింగ్‌ మాఫియా కన్ను ఈ రెండు మండలాలపై పడింది. చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురంలో గిరిజనుడు దోనె పోతురాజు పేరిట హైదరాబాద్‌కి చెందిన కృష్ణారెడ్డి అనే బినామీ మైనింగ్‌ వ్యాపారి 2001 అక్టోబరు 14 నుంచి 2021 అక్టోబరు 13 వరకు 4.270 హెక్టార్ల డీఫారం భూముల్లో లేటరైట్‌ తవ్వకాల కోసం అనుమతులు పొందారు. విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ బినామీ మైనింగ్‌ వ్యాపారి కొయ్యూరు మండలం వలసంపేట గ్రామానికి చెదిన గిరిజనుడు పొత్తూరు దేముడు పేరిట 2004 జనవరి 13వ తేదీ నుంచి 2024 జనవరి 12 వరకు 11.610 హెక్టార్లలో లేటరైట్‌ తవ్వకాలకు అనుమతులు పొందారు. ఈ రెండు క్వారీల్లో గతంలో తవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ క్వారీల అనుమతుల గడువు ముగిసిపోయింది. చాపరాతిపాలెం క్వారీ గడువు పునరుద్ధరించుకునేందుకు భద్రాచలం ప్రాంతానికి చెందిన మైనింగ్‌ వ్యాపారి పైరవీలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఇప్పటి వరకు లేటరైట్‌ క్వారీలు చాపరాతిపాలెం, సిరిపురంలో మాత్రమే ఉన్నాయి.

డోకులూరులో నూతన క్వారీ

పెదవలస పంచాయతీలో డోకులూరు గ్రామంలో నూతనంగా లేటరైట్‌ క్వారీని ప్రారంభించేందుకు మైనింగ్‌ మాఫియా భారీ స్థాయిలో పైరవీలు చేస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేసిన విజయనగరం ప్రాంతానికి చెందిన మైనింగ్‌ వ్యాపారి నాగరాజు అరకు నియోజకవర్గం టీడీపీకి చెందిన ఓ ముఖ్య నేత బంధువు బుక్కా రాజేంద్ర ప్రసాద్‌ పేరిట లేటరైట్‌ తవ్వకాల కోసం దరఖాస్తు చేయించాడు. డోకులూరు గ్రామంలో 18 మంది గిరిజన రైతులు, చాపరాతిపాలెంలో ఎనిమిది మంది రైతులకు చెందిన 28 ఎకరాల భూమిని తవ్వకాల కోసం దరఖాస్తు చేసుకున్న రాజేంద్రప్రసాద్‌కి లీజుకి ఇవ్వడానికి అంగీకరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్‌శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మైనింగ్‌ వ్యాపారి నాగరాజు గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎస్పీగా పనిచేసి, కూటమి ప్రభుత్వంలోనూ పోలీసుశాఖ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారి బంధువు. అలాగే బినామీ లీజుదారుడైన రాజేంద్రప్రసాద్‌ బంధువు అరకు నియోజకవర్గంలో ముఖ్య టీడీపీ నేత కావడంతో లేటరైట్‌ దరఖాస్తు చకచకా ముందుకు తీసుకొచ్చారు.

మైనింగ్‌ కోసం జతకట్టిన వైసీపీ, టీడీపీ నేతలు

డోకులూరు లేటరైట్‌ మైనింగ్‌ కోసం వైసీపీ, టీడీపీ నేతలు జతకట్టారు. మైనింగ్‌ వ్యాపారి నాగరాజు వైసీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. అయినప్పటికీ లేటరైట్‌ గనులను దక్కించుకునేందుకు నాగరాజుతో అరకు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్యనేత దోస్తీకి సై అన్నారు. ఇద్దరూ కలిసి లేటరైట్‌ లీజును దక్కించుకునేందుకు తమదైన శైలిలో పైరవీలు చేస్తున్నారు.

ప్రజలు అంగీకరిస్తే తవ్వకాలకు అనుమతులు

డోకులూరు గ్రామంలో మైనింగ్‌ వ్యాపారులు తవ్వకాలు అనుమతులు పొందాలంటే కలెక్టర్‌ నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో పంచాయతీ సర్పంచ్‌, పెసా కమిటీ సభ్యులు, చాపరాతిపాలెం, డోకులూరు గ్రామాలకు చెందిన మూడో వంతు గిరిజనులు లేటరైట్‌ తవ్వకాలకు అభ్యంతరం లేదని అంగీకారం తెలపాల్సి వున్నది. ఇప్పటికే మైనింగ్‌ వ్యాపారులు ప్రజాభిప్రాయ సేకరణలో తమకు అనుకూలంగా చెప్పించుకోవడానికి పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ కలెక్టర్‌ ఎదుట సర్పంచ్‌, వార్డు సభ్యులు, పెసా కమిటీ సభ్యులు, స్థానిక గిరిజనులు లేటరైట్‌ తవ్వకాలకు అభ్యంతరాలు తెలియజేస్తే కలెక్టర్‌ సిఫారసు మేరకు మైనింగ్‌శాఖ అనుమతులు రద్దు చేస్తుంది. తవ్వకాల అనుమతులు ఇచ్చేది, లేనిది గ్రామ సర్పంచ్‌, పెసా కమిటీ, ప్రజల చేతిలోనే వుంటుంది.

Updated Date - May 01 , 2025 | 11:07 PM