గొంప మెట్టపై మైనింగ్ తనిఖీలు
ABN, Publish Date - May 27 , 2025 | 01:53 AM
మండలంలోని గుడివాడ పంచాయతీ రెవెన్యూ పరిధిలో గొంప మెట్టపై నల్ల రాయి తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో సోమవారం మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు.
నల్ల రాయి తవ్వకాలకు ఉపయోగిస్తున్న యంత్రాలు సీజ్
రావికమతం, మే 26 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని గుడివాడ పంచాయతీ రెవెన్యూ పరిధిలో గొంప మెట్టపై నల్ల రాయి తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో సోమవారం మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. అయితే అధికారులు వస్తున్నట్టు ముందుగా సమాచారం రావడంతో తవ్వకందారులు పరార య్యారు. భూగర్భ గనుల శాఖ నర్సీపట్నం డివిజన్ ఏడీ జి.శివాజీ సిబ్బందితో అక్కడికి వెళ్లి తవ్వకాలకు ఉపయోగిస్తున్న యంత్రాలను సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రావికమతం డిప్యూటీ తహసీల్దార్ జి.అప్పలనాయుడు, వీఆర్వో పి.నారాయణరావులకు వీటి సంరక్షణ బాధ్యత అప్పగించారు. అనంతరం మైనింగ్ ఏడీ శివాజీ విలేకరులతో మాట్లాడుతూ గుడివాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 399/పిలో నాలుగు ఎకరాల 95 సెంట్లు విస్తీర్ణంలో నల్ల రాయి తవ్వకాలకు అనుమతుల కోసం నెట్‌కమ్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ-ఆక్షన్‌లో రూ.16.2 లక్షలు చెల్లించి అనుమతులు కోరిందన్నారు. అయితే దీనికి సంబంధించి అవసరమైన ధ్రువ పత్రాలు, అగ్రిమెంట్లు ఇంత వరకు తమకు సమర్పించలేదన్నారు. నిబంధనల ప్రకారం ధ్రువ పత్రాలు సమర్పించిన తర్వాత మాత్రమే రాయి తవ్వకాలకు పూర్తి స్థాయి అనుమతులు ఇస్తామని ఆయన తెలిపారు.
Updated Date - May 27 , 2025 | 01:53 AM