మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడ్
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:38 AM
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కూడా ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ప్రస్తుతం వున్న 183 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
జిల్లాలో 183 ప్రధాన కేంద్రాలుగా మార్పు
త్వరలో ఆయా కేంద్రాలకు సహాయక పోస్టులు భర్తీ
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కూడా ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ప్రస్తుతం వున్న 183 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీలు కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం భావించింది. రెండు రోజుల క్రితం అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిఽధిలో 1,908 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 183 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు వున్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. జిల్లాలో ప్రాజెక్టుల వారీగా ఎన్ని మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయన్న దానిపై జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జిల్లాలో 1,725 అంగన్‌వాడీ కార్యకర్తలు ఉండాల్సి ఉండగా 1,692 మంది మాత్రమే వున్నారు. సహాయకులు 1,725 మందికిగాను 1,639 మంది ఉన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక్క కార్యకర్త మాత్రమే వున్నారు. ప్రధాన కేంద్రంగా మార్చిన తరువాత అదనంగా సహాయకురాలి పోస్టులను భర్తీ చేయాల్సి వుంటుంది. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై అంగన్‌వాడీల సిబ్బం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jun 27 , 2025 | 12:38 AM