చెత్త కుప్పగా మందులు!
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:24 AM
ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే.. రోగులకు ఉచితంగా వైద్య సేవలు, మందులు అందించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు.
కాలం చెల్లకుండానే పారబోసిన 104 సిబ్బంది
పాయకరావుపేట, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే.. రోగులకు ఉచితంగా వైద్య సేవలు, మందులు అందించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. నక్కపల్లి మండలం గొడిచెర్ల పీహెచ్‌సీకి చెందిన మందులను గడువుతీర కుండానే 104 వాహన సిబ్బంది పాయకరావుపేట పీహెచ్‌సీ ఆవరణలో చెత్తగా పడేయడం ఇందుకు నిదర్శనం. సుమారు ఐదు అట్టపెట్టెల్లో ఉన్న చిన్న పిల్లలకు ఇచ్చే దగ్గు మందుతోపాటు ఇతర మందులను నెల రోజుల క్రితమే ఇక్కడ ఆస్పత్రి పాత భవనంలో పడేసినట్టు తెలిసింది. వీటిల్లో చాలా మందులకు ఇంకా గడువు వుంది. దీనిపై పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుభాష్‌ని వివరణ కోరగా... ఆస్పత్రి ఆవరణలో మందులు పడిఉన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇవి నక్కపల్లి మండలం గొడిచెర్ల పీహెచ్‌సీ పరిధిలోని సబ్ సెంటర్లకు 104 వాహన సిబ్బంది పంపిణీ చేయాల్సినవిగా గుర్తించినట్టు చెప్పారు. వీటిని వెంటనే తీసుకెళ్లిపోవాలని 104 సిబ్బందిని ఆదేశించామన్నారు.
Updated Date - Aug 02 , 2025 | 12:24 AM